Business

ఒక్క వార్తలపైనే ఆదాయం ₹33వేల కోట్లు

Google news made 33000 Crore INR in 2018

గూగుల్‌కు గతేడాది వార్తలపై రూ.33,000 కోట్ల (4.7 బిలియన్‌ డాలర్ల) ఆదాయం లభించిందని ఒక అధ్యయనం వెల్లడించింది. గూగుల్‌లో శోధన, గూగుల్‌ న్యూస్‌ ద్వారా 2018లో ఇంతటి ఆదాయం గూగుల్‌కు లభించిందని న్యూస్‌ మీడియా అలయన్స్‌ (ఎన్‌ఎంఏ) తెలిపింది. అమెరికాలోని 2,000 వార్తా పత్రికలకు ఎన్‌ఎంఏ ప్రాతినిథ్యం వహిస్తోంది. ఆన్‌లైన్‌ ప్రకటనల ఆదాయం తగ్గిపోతున్నందున కొన్ని మీడియా సంస్థలు మూతబడుతున్నా, గూగుల్‌కు మాత్రం ఆదాయం బాగుందని ఎన్‌ఎంఏ అధ్యయనం విశదీకరించింది. దిగ్గజ టెక్నికల్‌ కంపెనీలు, ప్రసార మాధ్యమాల మధ్య అంతర్గత సంబంధాలపై చట్టసభల సంఘం మంగళవారం విచారించనున్న నేపథ్యంలో, వెలుగుచూసిన ఈ నివేదిక ప్రకారం.. గూగుల్‌ వ్యాపారంలో వార్తలు ముఖ్యభూమిక పోషిస్తున్నాయి. గూగుల్‌కు 470 కోట్ల డాలర్ల ఆదాయం రావడంలో, వార్తలను రూపొందించిన విలేకరులకూ పాత్ర ఉంది.గతేడాది డిజిటల్‌ ప్రకటనల ద్వారా అమెరికా వార్తా పరిశ్రమ మొత్తం కలిపి 5.1 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.35,700 కోట్ల) ఆదాయం ఆర్జించగా, గూగుల్‌ ఆర్జన దీనికి సమీపంలో ఉండటం గమనార్హం. గూగుల్‌ ఆదాయంపై ఈ అంచనా సంప్రదాయకంగా నిర్వహించిందే. వినియోగదారులు వార్తలను శోధించే క్రమంలో వారు చేసే ప్రతి క్లిక్‌పై, గూగుల్‌కు లభించే వ్యక్తిగత డేటా విలువను పరిగణనలోకి తీసుకోలేదు. ఈ సమాచారం నుంచి కూడా గూగుల్‌కు ఆదాయం లభించే వీలుంది.గూగుల్‌ ట్రెండింగ్‌ విచారణలో 40 శాతం క్లిక్‌లు వార్తలకు సంబంధించే ఉంటున్నాయి. ఈ వార్తల కోసం గూగుల్‌ ఏమీ చెల్లింపు జరపదు. కానీ వార్తా పత్రికల్లోని ప్రధాన శీర్షికలను గూగుల్‌ చూపుతుండటం గమనార్హం.గూగుల్‌తో పాటు ఫేస్‌బుక్‌ కూడా వార్తా పత్రికలకు ప్రధాన పంపిణీదార్లుగా ఉన్న సంగతి విదితమే. ఈ రెండు సైట్ల నుంచే 80 శాతం క్లిక్‌లు వేరే సైట్లకు దారితీస్తాయి. అయితే వినియోగదారులు ఆయా సైట్లకు ఆకర్షితులయ్యేలా గూగుల్‌, ఫేస్‌బుక్‌ ప్రత్యేక చర్యలేమీ తీసుకోవు. కానీ మధ్యవర్తిగా వ్యవహరించినందుకు ఆన్‌లైన్‌ ప్రకటనల ఆదాయంలో వాటా మాత్రం పొందుతుంటాయి. ఇందువల్ల వార్తా సంస్థలకు ఆదాయం తగ్గిపోతోంది.వార్తలనేవి పౌర సమాజాన్ని బలపరుస్తాయి. ఒకవేళ పాత్రికేయ వృత్తి కనుక అంతరిస్తే, పాఠకులు, రచయితలు, రాజకీయ నాయకులకు వేదన తప్పదు. గణతంత్ర పరిరక్షణకు పాత్రికేయ వృత్తి ఎంతో కీలకం.