నాకు 80 ఏళ్లు. గత ఏడాదిన్నరగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బాగా మగతగా ఉంటోంది. ఎలెక్ట్రోలైట్ పరీక్షలో సోడియం తక్కువగా ఉన్నట్టు తేలింది. దీనికి మందులు వాడుతున్నాను గానీ పెద్దగా ఫలితం లేదు. నాకు బీపీ ఉంది. మాత్రలు వాడుతున్నాను. నిద్ర మాత్రలు కూడా వేసుకుంటున్నాను. అసలు నాకు మగత ఎందుకు వస్తోంది?
మీ సమస్యకు కారణం కనిపిస్తూనే ఉంది. అది రక్తంలో సోడియం తగ్గిపోవటం. దీనికి దీర్ఘకాల కిడ్నీజబ్బు కారణం కావొచ్చు. సాధారణంగా వయసుతో పాటు కిడ్నీ పనితీరు తగ్గుతుంది. మీరు మధుమేహం ఉందో లేదో తెలియజేయలేదు. మధుమేహం మూలంగానూ కిడ్నీల పనితీరు మందగించి సోడియం తగ్గిపోవచ్చు. అందువల్ల కిడ్నీల పనితీరును తెలిపే మూత్ర పరీక్ష, బ్లడ్ యూరియా, సీరమ్ క్రియాటినైన్ పరీక్షలు అవసరం. మీరు వాడుతున్న మాత్రలు మంచివే. మజ్జిగలో గానీ, బార్లీ నీళ్లలో గానీ ఉప్పు వేసుకొని తాగితే రక్తంలో సోడియం పెరుగుతుంది. పెద్ద వయసులో మెదడుకు రక్త ప్రసరణ తగ్గటం కూడా మగతకు కారణమే. సూక్ష్మ రక్తనాళాల్లో రక్తప్రసరణ తగ్గితే మతిమరుపు, మగత, తల తిరగటం తలెత్తొచ్చు. పార్కిన్సన్స్ అనే నాడీ సమస్యలోనూ మగత రావొచ్చు. మరో ముఖ్యమైన కారణం- థైరాయిడ్ హార్మోన్ తగ్గటం. పెద్ద వయసులో థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగా ఉండదు. దీంతో మగత, బద్దకం, నిస్సత్తువ వంటివి వేధిస్తాయి. మీరు నిద్ర మాత్రలు వాడుతున్నాననీ రాశారు. వీటితో ఉదయం పూట మగతగా ఉండి కళ్లు మూతలు పడుతుంటాయి. అలాగే దురదలకు వేసుకునే అలర్జీ మాత్రలు, దగ్గు మందులు కూడా మగతను కలగజేస్తాయి. కాబట్టి మీరు వాడుతున్న మందులతో మగత వస్తుందేమో తెలుసుకోవాలి. కొందరికి రక్తహీనతతోనూ మగత రావొచ్చు. అందువల్ల రక్తశాతం ఎంత ఉందో కూడా చూసుకోవాలి. అన్నింటికన్నా ముఖ్య విషయం- నలుగురితో అంతగా కలవలేకపోవటం. పెద్ద వయసులో ఇంట్లో మాట్లాడేవారు తక్కువ. దీంతో నిరుత్సాహం ఆవరిస్తుంది. ఏ వ్యాపకమూ లేకపోతే చురుకుదనం తగ్గిపోయి, మగత ముంచుకురావొచ్చు. కాబట్టి వీలైనప్పుడల్లా తోటి వయసు వారిని కలుసుకొని, కబుర్లు చెప్పుకోవటం మంచిది. పత్రిక చదివే అలవాటుంటే కొనసాగించాలి. టీవీతో కొంతసేపు కాలక్షేపం చేయాలి. మనుమలు, మనుమరాళ్లతో కబుర్లు చెప్పాలి. ఆటలు ఆడాలి. ఇవన్నీ చురుకుగా ఉండేలా చేస్తాయి. మగత రాకుండా కాపాడతాయి.