Movies

నయనతార సినిమాకు షాక్‌ ఇచ్చిన హైకోర్టు

Madras High Court Temporarily Stops Nayantharas Movie

అగ్రనటి నయనతారకు ఈ మధ్య టైమ్‌ అస్సలు బాగోలేదనే చెప్పాలి. కోలమావు కోకిల చిత్రం తరువాత నయనతార హిట్‌ను చూడలేదు. ఈ అమ్మడు హీరోయిన్‌ సెంట్రిక్‌ పాత్రలో నటించిన ఐరా, ఇటీవల శివకార్తికేయన్‌తో రొమాన్స్‌ చేసిన మిస్టర్‌ లోకల్‌ వంటి చిత్రాలు నిరాశపరిచాయి. అదే విధంగా ఈ లేడీ సూపర్‌స్టార్‌ నటించిన సస్పెన్స్, థ్రిల్లర్‌ కథా చిత్రం కొలైయుధీర్‌కాలంకు మొదటి నుంచి సమస్యలు వెంటాడుతున్నాయి.ఈ సినిమాకు మొదట యువన్‌శంకర్‌రాజా నిర్మాణ భాగస్వామిగానూ, సంగీత దర్శకుడిగానూ ఉన్నారు. ఆ తరువాత ఆయన చిత్రం నుంచి తప్పుకున్నారు. కాగా ఇటీవల చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో సీనియర్‌ నటుడు రాధారవి నటి నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేసి కలకలాన్ని సృష్టించారు. అదే సందర్భంలో నయనతార ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌ కొలైయుధీర్‌ కాలం చిత్రం ఆగిపోయిందనుకున్నామమని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆ చిత్రయూనిట్‌ ఆగ్రహానికి గురయ్యాడు.ఈ వ్యవహారం సద్దుమణిగి చిత్రాన్ని ఈ నెల 14న విడుదలకు సన్నాహాలు జరుగుతున్న తరుణంలో మద్రాసు హైకోర్టు మరో షాక్‌ ఇచ్చింది. ఈ కథేంటంటే బాలాజీమోహన్‌ అనే వ్యక్తి కొలైయుధీర్‌ కాలం చిత్ర టైటిల్‌ను తాను రూ.10 లక్షలు చెల్లించి పొందానని, ఆ టైటిల్‌ హక్కులు తనకు చెందినవని మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తన టైటిల్‌ను ఉపయోగించిన నయనతార చిత్ర విడుదలపై నిషేధం విధించాలని అందులో పేర్కొన్నారు.దీనిపై విచారించిన హైకోర్టు మంగళవారం నయనతార నటించిన కొలైయేధీర్‌కాలం చిత్ర విడుదలపై తాత్కాలిక స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా ఈ వ్యవహారంపై జూన్‌ 21లోగా వివరణ ఇవ్వాలంటూ చిత్ర నిర్మాతకు ఆదేశించారు. ఇదే చిత్ర హిందీ రీమేక్‌ ఖామోషిలో తమన్నా నటించారు. ప్రభుదేవా ముఖ్యపాత్రలో నటించిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది.