Devotional

14 నుంచి తిరుమలలో జ్యేష్ఠాభిషేకం

Jyeshthaabhishekam Starts In Tirumala From The 14Th Of June - Daily Devotional News

1. 14 నుంచి తిరుమలలో జ్యేష్ఠాభిషేకం – ఆద్యాత్మిక వార్తలు
నిత్యకల్యాణం పచ్చతోరణంలా విరాజిల్లే ఆనందనిలయంలో జ్యేష్ఠాభిషేకానిది ప్రత్యేక స్థానం. ఏటా జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠానక్షత్రానికి ముగిసేలా మూడు రోజులపాటు జరిగేదే ఈ ఉత్సవం.
*ఎందుకు?
ఏడాది పొడవునా 365 రోజుల్లో 470కి పైగా ఉత్సవాలు తిరుమలలో జరుగుతాయి. వీటిలో సింహభాగం సేవలు మలయప్పస్వామికే. మూలవిరాట్టు ప్రతినిధిగా, ఉత్సవమూర్తిగా ఎన్నో అభిషేకాలు, స్నపన తిరుమంజనాలు ఆయనకే. అందువల్ల అంగాలు (నేత్రాలు, ముక్కు, చెవులు వంటివి), మహాంగాలు(శిరస్సు, కంఠం, ఉదరం, బాహువులు వంటివి), ఉపాంగాలు (కేశాలు, నఖం వంటివి), ప్రత్యాంగాలు (శంఖుచక్రాలు, మకుటం, పీఠం వంటివి) తరుగులకు గురయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా జరగకుండా చూసేందుకు ఉత్సవమూర్తిని రక్షించే ప్రక్రియను భృగువు క్రియాధికారంలో వివరించారు. ఆ రక్షించే ప్రక్రియే జ్యేష్ఠాభిషేకం. దీన్ని సుగంధ తైల సమర్పణోత్సవం, అభిదేయక అభిషేకం అని కూడా పిలుస్తారు.చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంలో కలిసి ఉన్న మాసంలో విశేషమైన సుగంధతైల సమర్పణం చేయాలని భృగువు వివరించారు. దీనివల్ల విష్ణుమూర్తి దివ్య తేజస్సుతో వెలుగొందుతారని చెప్పారు. దీని ప్రకారమే తిరుమలలో జ్యేష్ఠాభిషేకం జరుగుతోంది.
**మూడు రోజులూ..
జ్యేష్ఠాభిషేకం ప్రారంభంనాడు యధావిధిగా సుప్రభాతం, తోమాలసేవ, సహస్రనామార్చన, నైవేద్యం, రెండో అర్చన, రెండో నివేదన జరిగిన అనంతరం మలయప్ప స్వామివారు ఆనంద నిలయం గర్భాలయం నుంచి నిత్యకల్యాణం జరిగే వేంకటరమణ కల్యాణమంటపానికి చేరుకుంటారు. స్వామివారి సన్నిధిలో యాగశాలలో శాంతిహోమం చేస్తారు. శతకలశప్రతిష్ఠ, ఆవాహన, తర్వాత నవకలశ ప్రతిష్ఠ, ఆవాహన పూజలు నిర్వహిస్తారు. తర్వాత నివేదనలు, హారతులు సమర్పించి కంకణ ప్రతిష్ఠ చేస్తారు.అనంతరం స్వామివారికి ఆర్ఘ్యపాద ఆచమనీయం సమర్పించి కంకణధారణ చేస్తారు. తర్వాత హోమాన్ని పూర్తి చేసి హోమ తిలకాన్ని స్వామివారికి దిద్దుతారు.వేద పండితులు శ్రీసూక్తం, పురుషసూక్తం, భూసూక్తం వంటివి పఠిస్తుండగా శుద్ధ జలాలలో అభిషేకం చేస్తారు. తర్వాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుసు నీళ్లతో, శతకలశాల్లోని జలాలతో స్వామికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. చివర్లో స్వామి, అమ్మవార్లను చందనంతో అలంకరిస్తారు.
తర్వాత నవ కలశాల్లోని జలాలతో అభిషేకిస్తారు. ఆ జలాలను అర్చకస్వామి శిరస్సుపై చల్లుకుని భక్తులందరిపై పురోభవ అని చిలకరిస్తారు. తర్వాత స్వామికి వస్త్రాలంకరణ, నివేదన జరుగుతాయి.ఇలా రెండో, మూడో రోజు కూడా జరుగుతుంది. జ్యేష్ఠాభిషేకం చివరిరోజు స్వామివారికి స్వర్ణకవచం ధరింపజేస్తారు.
***నిజరూపం..
వివిధ సేవలు, ఉత్సవాలను జరిపించుకుంటూ భక్తులకు దర్శనమిచ్చే శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు ఎప్పుడూ కవచాన్ని ధరించి ఉంటారు. కేవలం జ్యేష్ఠాభిషేక సమయంలోనే స్వర్ణ కవచాన్ని తొలగిస్తారు. ఈ ఒక్క సందర్భంలోనే మలయప్ప నిజరూపంలో దర్శనమిస్తారు.
ఏడాది పొడవునా కేవలం శుద్ధజలంతో మాత్రమే మలయప్ప స్వామికి శిరస్సు పై నుంచి అభిషేకం జరుగుతుంది. ఈ జ్యేష్ఠాభిషేకంలో మాత్రమే స్వామిని అన్ని ద్రవ్యాలతో అభిషేకిస్తారు.
2. 25న విజయవాడలో పూరీ జగన్నాథ రథయాత్ర
ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన శ్రీశ్రీశ్రీ పూరీ జగన్నాథుని రథయాత్రను ఇస్కాన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన విజయవాడలో నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తెలిపారు. బుధవారం విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో కార్యక్రమ గోడపత్రికను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ నలభై ఏళ్లుగా ఇస్కాన్‌ ప్రపంచ వ్యాప్తంగా ఏటా 70దేశాలలో 400లకుపైగా రథయాత్రలను నిర్వహిస్తుందని తెలిపారు. జాతి, కుల, మత వర్గాలకతీతంగా నిర్వహిస్తున్న ఈ రథయాత్ర 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గాంధీనగర్‌ ధర్నా చౌక్‌ నుంచి ప్రారంభమవుతుందన్నారు. హనుమాన్‌పేట, చల్లపల్లిబంగ్లా, ఏలూరురోడ్డు, సీతారాంపురం, పుష్పాహోటల్‌ సెంటర్‌, జమ్మిచెట్టు కూడలి మీదగా బందరురోడ్డులోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వరకు కొనసాగుతుందన్నారు. రాత్రి 7 గంటల నుంచి కన్వెన్షన్‌ సెంటర్‌లో హారతి, జగన్నాథుని లీలల గురించి ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు. ఈ రథయాత్ర మార్గమంగా ప్రజలకు తీర్థప్రసాదాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నగర ప్రజలంతా రథయాత్రలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, తొండెపు హనుమంతరావు, చక్రధారి తదితరులు పాల్గొన్నారు.
3. రామయ్య హుండీ ఆదాయం రూ.1.07 కోట్లు
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ హుండీల ఆదాయాన్ని బుధవారం చిత్రకూట మండపంలో లెక్కించారు. ఈవో తాళ్లూరి రమేశ్‌ బాబు, ఏఈవో శ్రావణ్‌కుమార్‌, డీఈ రవీంద్రనాథ్‌, ఏఈ నర్సింహరాజు పర్యవేక్షణలో ఉదయం నుంచి సాయంత్రం వరకు లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్స్‌తో పాటు సెక్యూరిటీ గార్డుల భ్రదత నడుమ 75 రోజుల ఆదాయాన్ని ఆలయ సిబ్బందితో పాటు భక్తులు లెక్కించారు. నగదు రూపంలో రూ.1,07,20,901 వచ్చిందని తెలిపారు. 65 గ్రాముల బంగారం, ఒక కిలో 250 గ్రాముల వెండి కానుకల సమకూరినట్లు వెల్లడించారు. యూఎస్‌ఏ డాలర్లు 87, ఓమన్‌ బైసా 100, నేపాల్‌ రూపీస్‌ 15, సింగపూర్‌ డాలర్లు 10, యూఏఈ దీనార్లు 20, మలేషియా రింగ్గిట్లు 50, మారిషస్‌ రూపీస్‌ 25, సౌదీ రియాల్స్‌ ఒకటి వచ్చాయని వివరించారు. గతంలో మార్చి 28న హుండీలను తెరిచిన తర్వాత మళ్లీ ఇదే లెక్కింపు. శ్రీరామ నవమితో పాటు వేసవి సెలవులు ఉండడంతో కానుకలు వెల్లువెత్తి హుండీలు కళకళలాడాయి. ప్రధాన ఆలయంలో 12 హుండీలు ఉండగా ఇందులో సగం మాత్రమే ఇప్పుడు లెక్కించారు. ఉపాలయాలలో మరో 22 హుండీలు ఉన్నాయి. ఈ 28 హుండీలను తర్వాత లెక్కిస్తామని తెలిపారు.
4. చరిత్రలో ఈ రోజు/జూన్ 13
1831 : ప్రముఖ భౌతిక, గణిత శాస్త్రవేత్త జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్ జననం (మ.1879)
1889 : సాలార్‌జంగ్ మ్యూజియం ప్రధాన సేకరణ కర్త మీర్ యూసుఫ్ అలీఖాన్ (మూడవ సాలార్‌జంగ్) జననం.(మ.1949).
1954 : సుమారు రెండు శతాబ్దాల ఫ్రెంచిపాలన నుండి యానాం విమోచనం చెందింది.
1965 : భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు మణీందర్ సింగ్ జననం.
1893 : మొదటి మహిళల గోల్ఫ్ ఛాంపియన్‌షిప్ రాయల లీథం అనే చోట నిర్వహించబడింది.
1937 : ప్రముఖ కంప్యూటర్ శాస్త్రవేత్త మరియు టూరింగ్ అవార్డు గ్రహీత డా.రాజ్ రెడ్డి జననం.
5. శుభమస్తు తేది : 13, జూన్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : గురువారం
పక్షం : శుక్లపక్షం
తిథి : ఏకాదశి
(నిన్న రాత్రి 6 గం॥ 30 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 4 గం॥ 52 ని॥ వరకు)
నక్షత్రం : చిత్త
(నిన్న ఉదయం 11 గం॥ 54 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 10 గం॥ 57 ని॥ వరకు)
యోగము : పరిఘము
కరణం : వణిజ
వర్జ్యం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 57 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 48 ని॥ నుంచి ఈరోజు ఉదయం 6 గం॥ 20 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 10 గం॥ 4 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 56 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 19 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 11 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 54 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 32 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 8 గం॥ 58 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 36 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 12 గం॥ 15 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 53 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 41 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 50 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : తుల
6. ఆపన్నులకు అభయహస్తం
అప్పలాయగుంటలో అభయహస్త ముద్రలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివెయ్యేళ్లకు పైగా చారిత్రక ప్రాశస్త్యంజూన్‌ 13 నుండి 21 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అప్పలాయగుంటలో వెలసిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు అభయహస్త ముద్రలో భక్తులకు అభయమిస్తున్నారు. పురాణాల ప్రకారం శ్రీ వేంకటేశ్వరస్వామివారు నారాయణవనంలో ఆకాశరాజు కుమారై శ్రీ పద్మావతీ దేవిని వివాహం చేసుకుని తిరుమలకు కాలినడకన బయలుదేరాడు. మార్గమధ్యంలో శ్రీసిద్ధేశ్వరస్వామివారి తపస్సుకు మెచ్చి ఆభయహస్తంతో దర్శనమిచ్చి అప్పలాయగుంటలో కొలువుతీరాడు. ఈ ఆలయానికి సుమారు వెయ్యేళ్లకు పైగా చారిత్రక ప్రాశస్త్యం ఉంది. కార్వేటినగర ప్రభువుల పాలనలో ఈ ఆలయం ఉండేదని, తిరుమల తరహాలో ఇక్కడ కూడా ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహించారని శాసనాధారాల ద్వారా తెలుస్తోంది.
**ఆలయ విశిష్టత
ఈ ఆలయంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి శంఖుచక్రాలు ధరించి, కటిహస్తం, అభయహస్త ముద్రతో ప్రసన్నుడై ఉంటారు. శ్రీదేవి, భూదేవి, చక్రత్తాళ్వారు, విష్వక్సేనులు, భాష్యకారుల ఉత్సవ విగ్రహాలు నిత్యపూజలు అందుకుంటున్నాయి. గర్భాలయానికి నైరుతి మూలలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, వాయవ్య మూలలో శ్రీ గోదాలక్ష్మీ(ఆండాళ్‌) అమ్మవారి ఆలయం, ఎదురుగా గరుత్మంతుల విగ్రహం వెలిసి ఉన్నాయి. ఆలయం వెలుపల ప్రాకారానికి ఎదురుగా సుమారు 100 గజాల దూరంలో శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారి ఆలయం ఉంది.

**జూన్‌ 13న ధ్వజారోహణం
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్‌ 13న గురువారం ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 నుంచి 10.30 గంటల మధ్య కర్కాటక లగ్నంలో సంప్రదాయబద్ధంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు.
**బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు
తేదీ ఉదయం సాయంత్రం

13-06-2019(గురువారం) ధ్వజారోహణం(కర్కాటక లగ్నం) పెద్దశేష వాహనం
14-06-2019(శుక్రవారం) చిన్నశేష వాహనం హంస వాహనం
15-06-2019(శనివారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
16-06-2019(ఆదివారం) కల్పవృక్ష వాహనం కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం
17-06-2019(సోమవారం) మోహినీ అవతారం గరుడ వాహనం
18-06-2019(మంగళవారం) హనుమంత వాహనం గజ వాహనం
19-06-2019(బుధవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
20-06-2019(గురువారం) రథోత్సవం అశ్వవాహనం
21-06-2019(శుక్రవారం) చక్రస్నానం ధ్వజావరోహణం
బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు, రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్‌ 16వ తేదీ సాయంత్రం 5.00 నుండి రాత్రి 7.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు.
7. భక్తులతో బాసర కిటకిట
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. చదువుల తల్లిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించుకున్నారు. తమ పిల్లలకు బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించమని అమ్మవారిని వేడుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.