DailyDose

Yes Bankకు రేటింగ్ షాక్-వాణిజ్య–06/13

Yes Bankకు రేటింగ్ షాక్-వాణిజ్య–06/13-Yes bank loses rating - June 13 2019 - Daily Business News

*ప్రయివేటు రంగ బ్యాంకు ఎస్‌బ్యాంకును కష్టాలు వీడడం లేదు. ఇటీవల తీవ్ర నష్టాలతో కుదైలైన ఎస్‌బ్యాంక్‌నకు తాజాగా రేటింగ్‌షాక్‌ తగిలింది. బ్రోకింగ్‌ సంస్థ యూబీఎస్‌ ఇండియా ఎస్‌బ్యాంకు ర్యాంకింగ్‌ 47 శాతం డౌన్‌ గ్రేడ్‌ చేసింది. గతంలో ఇచ్చిన రూ. 170 ను రూ. 90కు కుదించి సెల్‌ రేటింగ్‌ ఇచ్చింది. దీంతో అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది. గురువారం దాదాపు 13శాతం నష్టాలతో కొనసాగుతోంది.
*ఆర్థిక సంక్షోభం కారణంగా కార్యకలాపాలు నిలిపివేసిన ప్రయివేట్‌ రంగ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. లావాదేవీల నిర్వహణ (ట్రేడింగ్‌ యాక్టివిటీ)లో ఆంక్షలు విధించాలని స్టాక్ ఎక్స్ఛేంజీలు నిర్ణయించినట్లు వెలువడిన వార్తలు నేపథ్యంలో ఇన్వెస్టర్లు జెట్‌ ఎయిర్‌ వేస్‌ షేర్లలో భారీ అమ్మకాలకు దిగారు. దీంతో గురువారం నాటి మార్కెట్‌లో జెట్‌ షేరు ఏకంగా 23శాతం పతనమైంది. తద్వారా సరికొత్త కనిష్టానికి చేరింది. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 986.03 కోట్లకు పడిపోయింది. బిఎస్ఇలో 15.61 లక్షల షేర్లు చేతులుమారాయి. స్టాక్ గత తొమ్మిది రోజుల్లో 40శాతానికి పైగా పతనమైంది.
*వివిధ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.32,680, విశాఖపట్నంలో రూ.33,700, ప్రొద్దుటూరులో రూ.33,500, చెన్నైలో రూ.32,750గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,120, విశాఖపట్నంలో రూ.31,000, ప్రొద్దుటూరులో రూ.30,900, చెన్నైలో రూ.31,190గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.36,900, విశాఖపట్నంలో రూ.38,000, ప్రొద్దుటూరులో రూ.37,900, చెన్నైలో రూ.39,800 వద్ద ముగిసింది.
*ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్‌ వినియోగదార్లలో 12 శాతం మంది మనదేశంలోనే ఉన్నారు. అత్యధికంగా ఇంటర్నెట్‌ వినియోగదార్లున్న దేశాల్లో మనదేశం రెండోస్థానానికి చేరింది.
*గిరిజనుల నుంచి వ్యతిరేకత రావడంతో తాజాగా చత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో బైలాడిల్లా గనుల్లోనూ ఇనుప ఖనిజం ఉత్పత్తిని ఎన్‌ఎండీసీ నిలిపివేసింది.
*రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)కు ఒక కేంద్రీకృత సమాచార, నిర్వహణ వ్యవస్థ (సీఐఎమ్‌ఎస్‌)ను అమలు చేసే బాధ్యతలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌)కు దక్కాయి.
*రిటైల్‌ ద్రవ్యోల్బణం మేలో ఏడు నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. కూరగాయలు, మాంసం, చేపలు సహా ఆహార పదార్ధాలు ప్రియం కావడం ఇందుకు కారణం.
*రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తన వద్ద ఉంచుకోవాల్సిన మూలధన పరిమాణం అంశాన్ని పరిశీలిస్తున్న బిమల్‌ జలాన్‌ కమిటీ మరోసారి సమావేశం కానుంది.
*ఎల్‌ఖీటీ ఓపెన్‌ ఆఫర్‌ కింద ఒక్కో షేరుకు రూ.980 ఇస్తామని ప్రకటించడం సబబుగానే ఉందని మైండ్‌ట్రీ స్వతంత్ర డైరెక్టర్ల కమిటీ అభిప్రాయపడింది.
*ఫ్రెంచి బ్రాండు అయిన ‘థామ్సన్‌’, అధికారిక ఆండ్రాయిడ్‌ టీవీలను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది.
*ద్విచక్ర వాహన విభాగంపై ప్రభుత్వ విధానాల్లో అనిశ్చితి నేపథ్యంలో, భారత్‌లో భవిష్యత్తు పెట్టుబడులపై పునరాలోచన చేస్తామని జపాన్‌ వాహన దిగ్గజం హోండా ప్రకటించింది.
*జీడీపీ గణాంకాలను ఎక్కువ చేసి చూపారంటూ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్‌ సుబ్రమణియన్‌ చేసిన ఆరోపణలను ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎమ్‌) తీవ్రంగా ఖండించింది.