Food

అందం-ఆరోగ్యం-అమోఘం=కరివేపాకు

Curry leaves are not only good for flavor but are super healthy too

తమను ‘కూరలో కరివేపాకులా తీసిపారేశారు’ అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ‘కరివేపాకే కదా’ అంటూ చిన్నచూపు చూసేవారు ఇప్పుడు ఆలోచనలో పడక తప్పదు. కూరైనా, సాంబారు అయినా, ఉప్మా, రసం దేనిలోనైనా కరివేపాకు వేస్తే వచ్చే రుచే డిఫరెంట్‌గా ఉంటుంది. కరివేపాకు వల్ల రుచే కాదు…ఆరోగ్య పరంగా ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. శరీరానికి ఎంతో అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లూ, బి విటమిన్, కెరోటిన్ పుష్కలంగా ఉండటమే కాదు.. తాజా కరివేపాకు నుంచి ప్రొటీన్లు, కొవ్వు పదార్ధాలు, పిండి పదార్ధాలు, పీచు పదార్ధాలు, ఖనిజ లవణాలు, క్యాలరీలు కూడా లభిస్తాయి.కరివేపాకులో పౌష్టిక విలువలు మాత్రమే కాదు.. ఔషధ గుణాలు కూడాఎక్కువగానే ఉన్నాయి. కరివేపాకుని మధుమేహానికి మంచి మందుగా పాశ్చాత్యులు కూడా గుర్తించారు. ఇందులోని కొయినిజన్ వంటి కొన్ని రసాయనాలు షుగర్ పేషట్ల పాలిట వరం అంటారు నిపుణులు. ఎలా అంటే, తీసుకున్న ఆహారాన్ని గ్లూకోజ్‌గా మార్చి రక్తంలో చక్కెర శాతాన్ని పెంచేందుకు క్లోమగ్రంధి నుంచి విడుదలయ్యే అల్థాఎమిలేజ్ అనే ఎంజైమే కారణం. కరివేపాకులోని ప్రత్యేక పదార్ధాలు ఈ ఎంజైమ్ స్రావాన్ని తగ్గిస్తాయని నిపుణులు పరిశోధనల ద్వారా తేల్చారు.అంతేకాదు జన్యుపరంగా లేదా ఒబెసిటీ కారణంగా వచ్చే మధుమేహాన్ని కరివేపాకు ద్వారా నియంత్రివచ్చని ఆయుర్వేద నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయమే పది కరివేపాకుల చొప్పున మూడు నెలలపాటు తింటే స్థూలకాయం, అలాగే రక్తంలో చక్కెర శాతం కూడా తగ్గుతాయంటున్నారు ఆయుర్వేద డాక్టర్లు.పెద్దలకు మాత్రమే కాదు పిల్లల్లో ఆకలి మందగిస్తే చక్కగా స్పూన్ నెయ్యి వేసి కరివేపాకు పొడి కలిపి రోజు మొదటగా రెండు ముద్దలు పెడితే చాలు. ఆకలి పెరుగుతుంది. అజీర్తి తగ్గుతుంది కూడా. కరివేపాకు పొడి అంటే ఒట్టి కరివేపాకే కాదు.. మెంతులు, మిరియాలు కూడా కలపాలి.ఆరోగ్యానికే కాదు.. సౌందర్యానికీ కరివేపాకుని బాగా ఉపయోగపడుతుంది. కరివేపాకు వేసి కాచిన నూనెని తలకి మర్ధన చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా మెరుస్తాయి. పెరుగుతాయి కూడా. అంతేనా… జుట్టు తెల్లబడటం తగ్గి, కురులు నల్లదనాన్ని సంతరించుకుంటాయి.రుచికే కాదు, ఆరోగ్యానికి, సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది కరివేపాకు.