Health

నడుము నొప్పికి నువ్వుల నూనెతో మర్దన చేయండి

Massage with sesame oil aids in relieving back pain

రోజంతా కూర్చుని పనిచేసినప్పుడు, ఎక్కువ శ్రమించినప్పుడు నడుము నొప్పి రావడం సహజం. దీనికి మాత్రలు వేసుకోవడం కన్నా… చిన్నచిన్న చిట్కాలతో ఇంట్లోనే తగ్గించుకోవచ్చు.
**కారణాలు
నడుము, వెన్నుపూసలో ఉండే కీళ్లు అకస్మాత్తుగా పట్టేయడం, ఈ భాగంలోని కండరాలు, లిగమెంట్లు తెగినట్లు అవడం వల్ల నడుము నొప్పి వస్తుంది. వెన్నెముకకు శ్రమ కలిగించే విధంగా కూర్చోవడం, జారిపడటం, అకస్మాత్తుగా వంగడం, బరువులెత్తడం, స్లిప్‌ డిస్క్‌, మహిళల్లో గర్భాశయానికి సంబంధించిన అనారోగ్యాలు ఈ సమస్యకు దారి తీస్తాయి. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. మెత్తని పరుపుపై కాకుండా చెక్క బల్లపై లేదా గట్టిగా ఉండే పరుపుపై తలకింద దిండు లేకుండా నిద్రపోవాలి. ఎటు కదిలితే నొప్పి వస్తోందో గుర్తించి అటువైపు కదలకుండా జాగ్రత్తపడాలి. ఆయుర్వేదంలో వాతాన్ని తగ్గించేవి, గుగ్గులతో తయారైన ఔషధాలను వైద్యుల సలహాతో తీసుకోవాలి. డిస్క్‌ సమస్య కారణం అయితే, ఎక్కువ కాలం విశ్రాంతి తప్పనిసరి. దీనికి శస్త్రచికిత్సే అవసరంలేదు. ఆయుర్వేద ఔషధాలు, తైలాలు, కాపడం వంటివీ పని చేస్తాయి. అధిక బరువును నియంత్రించుకోవాలి. నడుము నొప్పితో బాధపడేవాళ్లు మడత కుర్చీలో కూర్చోకూడదు. నిల్చునేటప్పుడు వెన్ను వంచకుండా నిటారుగా నిలబడాలి. ఒకే విధంగా ఎక్కువ సేపు కదలకుండా ఉండకూడదు. అధిక బరువులెత్తకూడదు. వెన్నెముకకు దన్ను ఇచ్చే కుర్చీలను ఎంచుకోవాలి. కూర్చున్నప్పుడు రెండు పాదాలు నేలకు ఆనేలా ఉంచాలి. అకస్మాత్తుగా వంగకూడదు. మునివేళ్లపై పరుగెత్తకూడదు. ఈ జాగ్రత్తలను పాటిస్తూ, తైలాలు రాయడం, కాపడం పెట్టడం వల్ల నడుము నొప్పిని తగ్గించుకోవచ్చు. ఈ భాగంలోని కండరాలకు బలం వచ్చేలా వ్యాయామాలూ అవసరమే.
**చికిత్సలు ఇలా…
* శొంఠిని నేతిలో వేయించి చల్లారిన తరువాత పొడి చేసుకోవాలి. చెంచా పొడిని గ్లాసు నీటిలో కలిపి, నాలుగోవంతు మిగిలే వరకు మరిగించుకోవాలి. ఈ కషాయాన్ని వడపోయాలి. ఇది వేడిగా ఉండగానే పెద్ద చెంచా గోరు వెచ్చని ఆముదాన్ని కలిపి తాగాలి. ఇలా రోజూ రెండు పూటలా తీసుకోవాలి.
* గ్రాము అశ్వగంధ చూర్ణంలో అరగ్రాము గుగ్గులు, గ్రాము వెల్లుల్లి పొడి కలిపి కప్పు నీళ్లలో మరిగించి కషాయం తయారు చేసుకుని, 30 గ్రా. పరిమాణంలో రెండు పూటలా తాగుతుంటే నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు.
* చెంచా వెల్లుల్లి ముద్దని, కప్పు నువ్వుల నూనెలో వేసి కాచి, వడపోయాలి. ఈ నూనెని నొప్పిగా ఉన్నచోట మృదువుగా రాసుకుంటే నడుము నొప్పి తగ్గుతుంది.
* 25 గ్రా.వాము, 100 మి.లీ. ఆవనూనె, 400 మి.లీ. నీటిని కలిపి నూనె మాత్రమే మిగిలేలా కాచి వడపోసి భద్రపరుచుకోవాలి. నొప్పిగా ఉన్న భాగం వద్ద ఈ నూనెతో మృదువుగా మర్దన చేసి, అరగంట తరువాత వేడి నీటితో కాపడం పెట్టుకోవాలి.