Health

వ్యాయామం మానేయద్దు ప్లీజ్!

Please do not stop exercising

ఆరోగ్యంగానే ఉన్నాం కదా. ఎలాంటి సమస్యలు లేవు కదా. కొద్దిరోజులు వ్యాయామం మానేస్తే ఏం? కొంపలేమైనా మునిగిపోతాయా? మనలో చాలామంది ఇలాగే అనుకుంటుంటారు. అప్పుడప్పుడు వ్యాయామం ఆపేసినా ఎలాంటి ఇబ్బందీ ఉండదని భావిస్తుంటారు. కానీ ఇదేమంత మంచి పద్ధతి కాదు. కేవలం 2 వారాల పాటు వ్యాయామం మానేసినా కండరాల మోతాదు తగ్గుతోందని, కొవ్వు శాతం పెరిగిపోతోందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. దీని మూలంగా మధుమేహం, గుండెజబ్బుల వంటి దీర్ఘకాలిక సమస్యల ముప్పూ ఎక్కువవుతోందని చెబుతున్నాయి. ఇంత తక్కువకాలంలోనే ఇలాంటి ప్రభావం కనబడటమనేది ఆశ్చర్యకరమైన విషయమని.. మన సమాజంలో ఊబకాయం, మధుమేహం వంటివి ఎందుకు పెరుగుతున్నాయో అనే సంగతిని ఇది చెప్పకనే చెబుతోందని పరిశోధకులు అంటున్నారు. ఒకవేళ ఎప్పుడైనా వ్యాయామం చేయటానికి తగినంత సమయం లభించకపోతే ఇంట్లో, ఆఫీసుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిదని వివరిస్తున్నారు. రోజుకి కనీసం 5000 అడుగులు.. సెలవుదినాల్లో 10,000 అడుగులు నడిచేలా చూసుకోవటం మంచిది. ఫిట్‌నెస్‌ ట్రాకింగ్‌ పరికరాలు ధరిస్తే ఎంత చురుకుగా ఉన్నామో తేలికగా తెలుసుకోవచ్చు. ఎక్కువసేపు కూచొని పనులు చేసేవారు వీలైనప్పుడల్లా కుర్చీలోంచి లేచి మూడు, నాలుగు నిమిషాల సేపు అటూఇటూ నడవటం మేలు. కావాలంటే వాహనాలను ఆఫీసు, దుకాణ సముదాయాలకు కాస్త దూరంలో నిలిపి నడిచి వెళ్లొచ్చు కూడా. సహోద్యోగులను కలవటానికి వెళ్లేటప్పుడు దూరం దారులను ఎంచుకోవచ్చు. అవసరమైతే తేలికగా కుర్చీలో కూచొని చేసే యోగా పద్ధతులనూ పాటించొచ్చు. ఇలా మనసుంటే మార్గం దొరక్కపోదు. బద్ధకాన్ని వీడి కాళ్లకు పనిచెప్పగలిగితే శారీరక సామర్థ్యాన్ని పెంపొందించుకోవట‌మే కాదు, పనుల్లోనూ మంచి ఫలితాలు సాధించొచ్చు.