Kids

కాకులు చాలా ధైర్యవంతులైన పక్షులు

Crows are the most daring and smart birds out there in existence-Telugu kids story

ఏమాట కామాటేగానీ ‘కాకీ కాకీ గవ్వల కాకీ..’ అని మీరు పాటలు పాడేస్తుంటే మాకు భలే ముచ్చటగా ఉంటుందర్రా!
* ఇంక మా గురించి చెప్పుకోవడం అని కాదూ… నిజ్జంగానే మేం చాలా తెలివైన వాళ్లం.
* మిగిలిన పక్షుల బుర్రలకంటే మా మెదళ్లు పెద్దవి.
* అందుకే మేం పుల్లల్లాంటి వాటిని పరికరాలుగా వాడుకోగలుగుతాం.
* జపాన్‌లో మా బంధువులు ఆ తెలివితోనే కారు చక్రాల కింద గింజల్ని పెట్టి వాటి పెంకుల్ని బద్ధలయ్యేలా చేస్తుంటాయి.
* పక్షుల్లో చిలకలకు, మాకు మాత్రమే ఇన్ని తెలివితేటలున్నాయి.
* ఇంకో విషయం ఏంటంటే మేం మీ ముఖాల్నీ గుర్తుంచుకో గలుగుతాం. అంటే మా చుట్టుపక్కల ఉండే కొందరి ముఖాలు మాకు పరిచయమన్నట్టే.
* మేమూ మీలా శాకాహారం, మాంసాహారం రెండూ తింటాం. పళ్లూ, గింజలైనా ఓకే.

కావ్‌ కావ్‌ గోల.. అర్థాలు వేరయా!
* మేం కావ్‌ కావ్‌ అంటూ అరిచేస్తామన్నది మీకు తెలిసిందే. మరి మీకు తెలియని రహస్యం ఏమంటే… మా కావ్‌లకు అర్థాలు వేరని. గొంతులో చిన్న మార్పును బట్టి ఓ కావ్‌ పాటవుతుంది. ఇంకో కావ్‌ ఆకలని చెబుతుంది. మరో కావ్‌ ‘శత్రువులున్నారు జాగ్రత్త’ అనే అర్థాన్నిస్తుంది. మరొకటి భోజనముంది రమ్మని పిలుస్తుంది. హమ్మ! ఇంక చెప్పను. మా రహస్యాలన్నీ చెప్పేస్తే మా భాష మీకూ అర్థమైపోదూ!
* మాలో 19, 20 రకాలున్నాయి.
* అంటార్కిటికాలో తప్ప అన్ని ఖండాల్లోనూ మేమున్నాం.
* మా గుంపును ఆంగ్లంలో ‘మర్డర్‌’ అంటారు.

గూటి గుట్టు!
గుడ్లు పెట్టే సమయం వస్తే మేం ఎక్కడైనా గూడు పెట్టేసుకుంటాం. అంటే చెట్టే కావాలి, గుట్టే కావాలి అనేం ఉండదు. టవర్ల మీదైనా, విద్యుత్‌ స్తంభాల మీదైనా… ఎక్కడైనా కట్టేస్తాం. అందులో మూడు నుంచి పది వరకూ గుడ్లు పెడతాం.
* 20 నుంచి 40 రోజుల పాటు వాటిని పొదిగితే బుజ్జి పిల్లలు బయటకొస్తాయి.
* వాటికి బోలెడంత ఆకలి. రెండు మూడు గంటల్లోనే ఒక్కోటీ వంద వరకూ గడ్డి పురుగుల్ని తినేస్తుంది. అంటే వాటి ఆకలి తీర్చేందుకు మేమెంత కష్టపడతామో ఆలోచించండి.
* ఆ కష్టం చాలదన్నట్టు దొంగ కోకిల ముఖాలున్నాయి చూశారూ! వాటి గుడ్లూ మా గూళ్లలో పడేస్తుంటాయి. అవీ మా పిల్లలే అనుకుని మేమేమో వాటికి తెగ ఆహారం ఇచ్చేసి పెంచేస్తుంటాం. పెద్దయితేగానీ వాటి సంగతేంటో మాకు తెలియదు. అప్పటికి అవి రెక్కలు విప్పుకొని గూటి నుంచి వెళ్లిపోతాయి.
* కాస్త పెద్దవయ్యాక మా పిల్లలూ గూటి నుంచి బయటకు వెళ్లిపోతాయి.
* చిన్నగా ఉన్నప్పుడు వాటి ఈకలు, కనుగుడ్లూ కాస్త నీలం రంగులో ఉంటాయి. పెద్దవయ్యే కొద్దీ కారు నలుపులోకి మారుతూ వస్తాయి.
* పెద్దవయ్యాకైనా 500 గ్రాముల్లోపే బరువుంటాయి.
* ఇంక మేమేమో ఏడు నుంచి 14 ఏళ్ల వరకూ బతికేస్తాం. ఇవేనర్రా మా సంగతులు. మరి ఉంటానేం. బైబై.
* మాకు ధైర్యం చాలా ఎక్కువ. అందుకో ఉదాహరణ చెప్పమంటారా? గద్దలు ఆకారంలో మాకన్నా దాదాపు తొమ్మిది రెట్లు పెద్దవి. ఒక్కోసారి అవి మా ఆహారం తీసుకెళ్లి పోతుంటే ఊరుకోం. వెంబడించి దాడికి దిగుతాం. అవీ మా గట్స్‌! అంతెందుకు మీ చేతిలో ఉన్న ఆహారాన్ని లాక్కెళ్లడానికీ మాకెలాంటి భయమూ ఉండదు.