Business

అమెరికా బాదంపప్పుపై భారతీయ బాదుడు

India begins tariff on american almonds

అమెరికా నుంచి దిగుమతి అవుతున్న 29 రకాల ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు వసూలు చేసే తేదీని ఎట్టకేలకు ప్రభుత్వం ఖరారు చేసింది. పలుమార్లు వాయిదా వేసిన అనంతరం, ఈనెల 16 నుంచి అదనపు కస్టమ్స్‌ సుంకాలు వసూలు చేయాలని నిర్ణయించింది. బాదం, వాల్‌నట్‌, పప్పుదినుసులు కూడా ఉన్న జాబితాను ఆర్థిక శాఖ అతిత్వరలో నోటిఫై చేయనుంది. తాజా సుంకాల వల్ల అమెరికా ఎగుమతిదార్లపై భారం పడనుండగా, భారత్‌కు అదనంగా 217 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1520 కోట్ల) ఆదాయం లభించనుంది. భారత్‌ నుంచి తమ దేశంలోకి దిగుమతి అవుతున్న కొన్ని రకాల స్టీల్‌ ఉత్పత్తులపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10 కస్టమ్స్‌ సుంకాన్ని అమెరికా గత మార్చిలో పెంచింది. ఏటా 1.5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.10,500 కోట్ల) విలువైన ఈ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. సుంకాల పెంపు వల్ల భారతీయ ఎగుమతిదార్లపై 240 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1680 కోట్ల) భారం పడుతుంది. దీనికి ప్రతీకారంగా అమెరికా నుంచి వస్తున్న 29 రకాల ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధించాలని మన ప్రభుత్వం 2018 జూన్‌ 21నే నిర్ణయించినా, అమలును పలుమార్లు వాయిదా వేసింది. ఇరు దేశాలు చర్చించుకుని, అదనపు సుంకాలు అమలుకాకుండా చూడాలని ప్రయత్నించింది. అవేమీ సఫలం కాలేదు. పైగా జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌ (జీఎస్‌పీ) కింద భారత ఎగుమతిదార్లకు, ఎగుమతి ప్రోత్సాహకాలు ఈనెల 5 నుంచి నిలిపి వేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇందువల్ల భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న 5.5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.38,500 కోట్ల) విలువైన ఉత్పత్తులపై ప్రభావం పడనుంది. దీంతో ఏడాది క్రితం తీసుకున్న నిర్ణయాన్ని ఈనెల 16 నుంచి అమలు చేస్తున్నట్లు తాజాగా అమెరికా ప్రభుత్వానికి మన ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. వాల్‌నట్‌పై సుంకం 30 శాతం నుంచి 120 శాతానికి పెరగనుంది. చిక్‌ బఠానీలు, సెనగలు, మసూర్‌ పప్పుపై కూడా సుంకం 30 శాతం నుంచి 70 శాతానికి చేరనుంది.
కాయధాన్యాలపై సుంకం 40 శాతానికి పెరుగుతుంది బోరిక్‌ యాసిడ్‌, ఫౌండ్రీ మౌల్డింగ్‌లో వాడే బైండర్లపై సుంకం 7.5 శాతానికి చేరుతుంది. వీటిపై దేశీయ కారకాలపైనా 10 శాతానికి పెంచారు. రొయ్యల్లోని ఒక రకమైన ఆర్టెమియాపై సుంకం 15 శాతానికి పెరుగుతుంది. కొన్ని రకాల గింజలు, ఇనుము-స్టీల్‌ ఉత్పత్తులు, ఆపిల్‌-పియర్‌ పళ్లు, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌లోని ఫ్లాట్‌ రోల్డ్‌ ఉత్పత్తులు, స్టీల్‌ మిశ్రమాలు, ట్యూబ్‌, పైపు ఫిట్టింగులు, స్క్రూలు, బోల్టులు, రివెట్‌ల మీదా పన్ను అధికమవుతుంది.