Editorials

భారతీయ స్విస్ బ్యాంకర్ల వివరాల వెల్లడికి రంగం సిద్ధం

Indian swiss banker information to be released by switzerland government

స్విస్ బ్యాంక్ ఖాతాదారులపై ఉచ్చు మరింత బిగిసింది. దీని ఫలితంగా స్విస్ బ్యాంక్‌ల్లో ఖాతాలు ఉన్న కనీసం 50 మంది భారతీయుల గుట్టు వెల్లడి కానుంది. వారి ఖాతాల వి వరాల వెల్లడికి స్విస్ అధికారులు రంగ ం సిద్ధం చేస్తున్నారు. భారత్, స్విట్జర్లాండ్‌ల్లోని ద్రవ్య నియంత్రణ, ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలకు ఈ ఖాతాల వివరాల వినిమయానికి అధికారులు సంసిద్ధత వ్యక్తం చేశారు. దీనితో అతి త్వరలోనే స్విస్ బ్యాంక్‌ల్లో నల్లధనం దాచుకున్న భారతీయులెవరు? అనేది బహిరంగం కానుంది. తమ దేశం విదేశాల గుప్తనిధులకు ఆలవాలంఅయిందనే విమర్శల ధాటితో స్విస్ ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతినకుండా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే సమాచార వెల్లడికి చర్యలు చేపట్టారు. కంపెనీలతో లావాదేవీలు ఉన్న వ్యాపారవేత్తలు, నకిలీ పేర్లతో ఉన్న ఖాతాల వివరాలు కూడా వెలుగులోకి వస్తాయి. భారతదేశంలో రియల్ ఎస్టేట్, ఆర్థిక సేవలు, టెక్నాలజీ, టెలికం మొదలుకుని పెయింట్స్, గృహాలంకరణ, వస్త్రాలు, ఇంజనీరింగ్ పరికరాలు, వజ్రాలు నగలు వంటి పలు రంగాలకు చెందిన ప్రముఖుల స్విస్ ఖాతాల వివరాలు ఇప్పుడు సిద్ధం అవుతున్నాయి.ఆయా దేశాలతో విషయ వినిమయ ప్రక్రియలతో సంబంధం ఉన్న అధికారులు ఇప్పుడు తెరవెనుక జరుగుతున్న చర్యల గురించి వార్తా సంస్థలకు తెలిపారు. భారతదేశంలో నల్లకుబేరులు చాలా మంది స్విస్ బ్యాంక్ ఖాతాలతో దర్జాగా తమ ఆర్థిక లావాదేవీలు సాగిస్తున్నారని సూత్రప్రాయంగా నిర్థారణ కావడం రాజకీయంగా భారతదేశంలో అత్యంత సున్నితమైన క్లిష్టమైన అంశంగా మారింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లకు పడగలెత్తడం, అక్రమార్జనను స్విస్ బ్యాంక్ ఖాతాల్లోకి తరలించడం జరుగుతోందని ప్రచారం జరగడంతో స్విస్ ప్రభుత్వం చాలా ఇరకాట పరిస్థితిని ఎదుర్కొంటోంది. 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చిన తరువాత మోడీ ప్రభుత్వం నల్లధనాన్ని ఆటకట్టిస్తామని శపథం పట్టింది. స్విస్ బ్యాంక్‌లలో డబ్బు దాచుకున్న వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపింది. ఇందులో భాగంగానే అప్పటి నుంచి భారత్, స్విస్ ప్రభుత్వాలు ఆర్థిక అక్రమ కార్యకలాపాల ఉదంతాలకు సంబంధించిన సమాచార మార్పిడికి మౌలిక ఏర్పాట్లకు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు అవసరం అయిన గ్లోబల్ ఆటోమొటిక్ ఎక్సేంజీ ప్రక్రియను ప్రారంభించారు. అక్రమంగా ధనార్జనకు దిగే వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వారిపై కేసులు పెట్టేందుకు వీలుగా సమాచారం రాబట్టుకునేందుకు రంగం సిద్ధం అయింది. దీనికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు కూడా జరిగాయి. అప్పటి నుంచి ఇటువంటి అక్రమార్జనపరులపై ఆర్థిక నిఘా వ్యవస్థ తీవ్రతరం అయింది.ఇప్పటికీ భారతదేశంలోని కనీసం 50 మందికి తాము గత కొద్ది రోజులలో నోటీసులు పంపించినట్లు స్విస్ ప్రభుత్వం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్ ప్రాతిపదికగా అధికారులు తెలిపారు. భారతీయ ఆర్థిక అధికారులకు ఈ ఖాతాల వివరాలు తెలియచేయాలనుకుంటున్నామని, దీనిని వ్యతిరేకించాలనుకుంటే అందుకు సరైన కారణాలు చూపుతూ వివరణలు ఇచ్చుకోవాలని, ఇందుకు తుది గడువు ఇస్తున్నామని ఈ నోటీసులలో తెలిపారు. ఈ గడువు ముగిసేలోగా సంబంధిత ఖాతాదారులు స్పందించకపోతే, సరైన కారణాలను తెలియచేయలేకపోతే ఇక వారి వివరాలు భారత ప్రభుత్వానికి అందుతాయి.ఈ విధంగా స్విస్ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న భారతీయ ఖాతాదారుల సంగతి వెల్లడవుతుంది.