Politics

కార్యకర్తలను ఓదార్చమని నాయకులకు చెప్పి ఐరోపా వెళ్లిన బాబు

Chandrababu Naidu leaves to Europe trip along with family

పార్లమెంటులో ప్రాతినిథ్యం వహిస్తున్న వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులతో పార్లమెంటరీ వ్యవహారాలశాఖ బుధవారం దిల్లీలో నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి తెదేపా జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కావడం లేదు. ఈ సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరగనుంది. చంద్రబాబు బుధవారం వేకువజామునే కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్తున్నారు. ఇది ముందే నిర్ణయించుకున్న పర్యటన కావడంతో అఖిలపక్ష సమావేశానికి వెళ్లడం లేదు. అయితే సమావేశం ఎజెండాలోని అంశాలపై తెదేపా వైఖరిని తెలియజేస్తూ పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషికి ఆయన మంగళవారం లేఖ రాశారు. ఆ లేఖను తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకులు బుధవారం దిల్లీలో అందజేయనున్నారు. ‘సమావేశానికి ఆహ్వానం పలుకుతూ ఈ నెల 14న మీరు రాసిన లేఖ నాకు అందింది. కీలకమైన అంశాలపై జరుగుతున్న సమావేశం తేదీ దగ్గరకు వచ్చాక ఆహ్వానం పంపినప్పటికీ ఎజెండాలోని వివిధ అంశాలపై మా అభిప్రాయాలను తెలియజే(స్తూ ఈ లేఖ రాస్తున్నాను’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

పార్లమెంటు పనితీరును మెరుగుపరచడంపై…
‘పార్లమెంటు సమావేశాలకు ఇటీవల అంతరాయాలు, ప్రతిబంధకాలు పెరిగిపోయాయి. వాటిని అధిగమించేందుకు కమిటీల వ్యవస్థను పటిష్ఠం చేయాలి. కొన్ని దేశాల్లో చట్టాలు, విధానాలను రూపొందించే ముందే సంబంధిత మంత్రి కమిటీ ఎదుట హాజరై ప్రభుత్వ విధానాల్ని విశదీకరించి ఆమోదం పొందుతారు. అటువంటి విధానాల్ని మన పార్లమెంటు అనుసరించాలి. మేలైన చట్టాల్ని రూపొందించేందుకు కమిటీల వ్యవస్థ దోహదపడుతుంది’ అని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

ఒకే దేశం- ఒకే ఎన్నికపై..
‘ఇది రాజ్యాంగ కోవిదులు, న్యాయ నిపుణులు, సమాజంలోని వివిధ వర్గాలతో విస్తృతంగా చర్చించాల్సిన అత్యంత ముఖ్యమైన, సున్నితమైన అంశం. మన రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రవేశపెట్టడంపై చాలా మేధోమథనం జరిగింది. ఇందులో సహకార సమాఖ్య విధానం అన్నది అత్యంత కీలకాంశం. ఒకే దేశం- ఒకే ఎన్నిక అన్నది న్యాయ, రాజకీయ, ప్రాక్టికల్‌ అంశాలతో ముడిపడినది. జాతి హితాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని పార్టీలు ఈ అంశంపై విస్తృత చర్చ జరుపుతాయని భావిస్తున్నా’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయిన సందర్భంలో నవ భారత నిర్మాణంపై..
‘2022లో మనం 75వ స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించుకుంటాం. 2022లోనే జీ-20 సదస్సుకు భారత్‌ ఆతిథ్యమిస్తోంది. ఆ సదస్సుకు ముందే… మత, కుల, ఉగ్రవాద, అవినీతి, క్రోనీ క్యాపిటలిజం వంటి దుర్లక్షణాల నుంచి విముక్తమైన నవ భారతాన్ని మనం ఆవిష్కరించాలి. దీనిని సాధించేందుకు ప్రజల మధ్య సమష్టి సంకల్పం కావాలి. రైతుల కష్టాలు తీర్చడం, యువతకు ఉపాధి కల్పన, మహిళా సాధికారత, సమాజంలోని వివిధ వర్గాల మధ్య అంతరాల్ని తొలగించడంపై దృష్టి పెట్టాలి’ అని సూచించారు.

గాంధీ 150వ జయంత్యుత్సవాల నిర్వహణపై..
‘మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల్లో మా పార్టీ మనస్ఫూర్తిగా పాల్గొంటుంది. 20వ శతాబ్దంలో ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసిన మహనీయుడు ఆయన. ఆయన స్ఫూర్తి ఎప్పటికీ కొనసాగుతుంది. ఆయన ఆలోచనలు, భావజాలాన్ని భవిష్యత్తు తరాలకు అందజేసేలా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలి’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

పురోగమించాలన్న ఆకాంక్ష ఉన్న జిల్లాల అభివృద్ధిపై…
‘దేశంలోని జిల్లాల మధ్య పోటీ వాతావరణం సృష్టించడంవల్ల వివిధ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలు వివక్షకు గురయ్యే అవకాశం ఉందన్నది మా అభిప్రాయం. దేశంలోని అన్ని జిల్లాల సమతులాభివృద్ధికి ఈ కార్యక్రమాన్ని సమీక్షించాల్సి ఉంది’ అని అభిప్రాయపడ్డారు.

కార్యకర్తలకు అండగా నిలవండి
తెదేపా కార్యకర్తలపై దాడులు జరిగిన ప్రాంతాలకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొన్ని బృందాలుగా ఏర్పడి వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. శాసనమండలిలో తెదేపా పక్ష నేత యనమల రామకృష్ణుడు, ఉభయ సభల్లోని పార్టీ ఉపనాయకులు ఈ బృందాలకు సారథ్యం వహించాలని, కార్యకర్తలకు అండగా నిలవాలని పేర్కొన్నారు. ఆయా జిల్లాల నాయకుల్ని వెంట తీసుకెళ్లి ఎస్పీలను కలిసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

నేడు విదేశాలకు చంద్రబాబు
చంద్రబాబు బుధవారం వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి ఐరోపా దేశాల పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 24 వరకూ పర్యటన సాగనుంది.

అందరూ సంయమనం పాటించండి
ప్రత్యర్థులు కవ్వించినా ఆవేశ పడొద్దని, దీనివల్ల కక్షలతో కుటుంబాలు రోడ్డున పడతాయని కార్యకర్తలకు చంద్రబాబు సూచించారు. అందరూ సంయమనం పాటించాలని, గ్రామాల్లో ప్రశాంత పరిస్థితులు నెలకొనేలా చూడాలని చెప్పారు. గుంటూరు జిల్లా వినుకొండ, గురజాల, మాచవరం మండలం పిన్నెల్లికి చెందిన తెదేపా కార్యకర్తలు మంగళవారం ఉండవల్లిలో చంద్రబాబును కలిసేందుకు వచ్చారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి తమపై దాడులు పెరిగాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఊళ్లు ఖాళీ చేయాలని దౌర్జన్యాలకు దిగుతున్నారని, మరోసారి తెదేపా గెలిచాకే గ్రామంలోకి రావాలని బెదిరిస్తున్నారని వాపోయారు. భూములు సాగుచేసుకోనివ్వకుండా అడ్డం పడుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారందరినీ సముదాయించారు.