Agriculture

మొక్కజొన్న పంటలో ఎండాకాలం కత్తెర పురుగు నివారణ

Treating corn crops in summer in India-telugu agriculture news

ఎండాకాలంలో ట్రాక్టర్‌తో నడిపే రెక్కనాగలి లేక ఎడ్ల నాగలితో లోతైన దుక్కి చేయాలి. దీనివల్ల నేలలోని కత్తెర పురుగు నిద్రావస్థ దశ అయిన ప్యూపాలు సూర్యరశ్మి బారిన పడి చనిపోతాయి. లేదా పక్షులు ఆశించి తినడం వల్ల పురుగు ఉధృతి పైరుపై చాలావరకు తగ్గించుకోవచ్చు. ప్యూపా నుంచి వచ్చే ఒక్కొక్క తల్లి పురుగు 1500 నుంచి 2000 గుడ్లు పెట్టే అవకాశం ఉన్నది. ప్యూపాలను నాశనం చేయడం ద్వారా వీటిని నివారించవచ్చు. అలానే వర్షపు నీరు ఎక్కువగా ఇంకి పైరు బెట్టకు త్వరగా రాకుండా కాపాడుతుంది. పంటకోత అనంతరం ఉన్న మోడులను సేంద్రియ ఎరువులను వేసి లోతుగా కలియదున్నాలి. దీనివల్ల నేలకు వర్షపు నీరును నిలుపుకునే శక్తి పెరుగుతుంది. అంతేగాక నేల బాగా మాగి సేంద్రి య కర్బనం పెరుగుతుంది. తద్వారా నేల సారవంతమవుతుంది. బెట్టకు గురికాని సారవంతమైన నేలల్లో మక్కజొన్న ఏపుగా పెరిగి కత్తెర పురుగును తట్టుకుంటుంది. వర్షాధారంగా మక్కజొన్నను సాగు చేయడానికి సారవంతంగాని తేలిక నేలలను ఎన్నుకోరాదు. ఇటువంటి నేలల్లో బెట్ట వచ్చే అవకాశం ఎక్కువ. మక్కజొన్న బెట్టకు గురైనప్పుడు కత్తెర పురుగు ఉధృతి ఎక్కువ. వర్షాధారంగా వేసే మక్కజొన్నను జూన్ 15 నుంచి జూలై ఆఖరు వరకు విత్తుకోవచ్చు. కానీ పదును వర్షం లేదా నాగలి మందం వర్షం (50-60 మీ.మీ.) పడిన తర్వాతనే విత్తుకోవాలి. దీనివల్ల మొలక శాతం బాగా ఉండి, ఎకరానికి ఉండవలసినన్ని మొక్కలు ఉండి, అధిక దిగుబడులు సాధించవచ్చు. అంతేకాకుండా కత్తెర పురుగు ద్వారా కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. పదును వర్షం లేదా నాగలి మందం వర్షం (50-60 మీ.మీ.) పడిన వెంటనే ఆ గ్రామంలోని రైతులందరు వారంరోజుల వ్యవధిలో మక్కజొన్న విత్తడం ముగించుకోవాలి. విడతల వారీగా మక్కజొన్నను సాగు చేసినప్పు డు ఆలస్యంగా వేసిన మక్కజొన్నలో కత్తెర పురుగు ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. మక్కజొన్నలో మధ్యకాలిక ఏక సంకర సంకర రకాలైన డి.హెచ్.యం. 117, డి.హెచ్.యం.121, కరీంనగర్ మక్క కరీంనగర్ మక్క-1 అలాగే సిఫారసు చేసిన ప్రైవేట్ రకాలను ఎన్నుకొని సాగుచేసుకుంటే పురుగు ఉధృతి తక్కువగా ఉండే అవకాశం ఉన్నది. విత్తనాన్ని ముందుగా సేకరించుకొని, విత్తుటకు 24 గంటల ముందు ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్.ఎస్. లేక సయాంత్రినిలిప్రోల్+థయామితాగ్జావ్‌ుతో కేజీ మక్కజొన్న విత్తనానికి 4 గ్రా. చొప్పున విత్తనశుద్ధి చేసుకోవాలి. తద్వారా పంటను 15 నుంచి 20 రోజుల వరకు కాపాడుకోవచ్చు. వర్షాధారపు మక్కజొన్నలో తక్కువ కాలపరిమితి గల కంది రకాలైన పి.ఆర్.జి.176, డబ్ల్యు.ఆర్.జి. 97 లేక మారుతి లాంటి రకాలను 2:1 (తేలిక నేలలు) లేదా 4:1 (బరువు నేలలు) సాగు చేసుకోవాలి. మక్కజొన్నలో కందిని అంతరపంటగా సాగు చేయడం వల్ల కత్తెర పురుగు ఉధృతి తక్కువగా ఉండటమే కాక అధిక నికర ఆదాయాన్ని పొందవచ్చు.