Editorials

వై.ఎస్.జగన్‌కు తిరువూరు ప్రజల బహిరంగ లేఖ

Krishna District Tiruvuru People Writes Heart Quenching Letter To AP CM YS Jagan --- వై.ఎస్.జగన్‌కు తిరువూరు ప్రజల బహిరంగ లేఖ

అయ్యా!

నమస్కారం.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గారికి కృష్ణాజిల్లాలో  వెనుకబడిన తిరువూరు నియోజకవర్గ ప్రజల విన్నపం.

ముందుగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మీకు అభినందనలు. మీరిచ్చిన హామీల్లో అవినీతిని కూకటివేళ్లతో నిర్మూలిస్తా అంటూ చేసిన ప్రకటన మమ్ములను బాగా ఆకట్టుకుంది. ఎందుకంటే గడిచిన అయిదు సంవత్సరాల్లో తిరువూరు నియోజకవర్గంలో వివిధ శాఖల్లో అవినీతి తారాస్థాయిలో జరిగింది. కోట్లాది రూపాయల నిధులు వివిధ శాఖల్లో దుర్వినియోగం అయ్యాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పునాదులతో సహా నిధులను మింగేశారు. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకువచ్చే ఉద్దేశంతో ఈ లేఖను మీ పరిశీలనకు సమర్పిస్తున్నాం.

* అయిదు సంవత్సరాల క్రితం తిరువూరు గ్రామ పంచాయతీని నగర పంచాయతీగా మార్పు చేశారు. అప్పటి నుండి తిరువూరు ప్రజలకు నరకం కనిపిస్తోంది. ఇప్పటికి అయిదుగురు కమీషనర్లు మారారు. ఈ మున్సిపాల్టీలో పెద్ద ఎత్తున కోట్లలో నిధులు దుర్వినియోగం జరిగాయి. నలుగురు సిబ్బందిని అవినీతి ఆరోపణలపై సస్పెండ్ చేశారు. అయినప్పటికీ అవినీతి ఏమాత్రం తగ్గకపోగా విచ్చలవిడిగా పెరిగిపోయింది. కొత్తగా ఉద్యోగంలో చేరిన యువకుడైన ఒక ప్రధాన అధికారి భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత నాలుగేళ్ల నుండి ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఒక అధికారి కోట్లాది రూపాయలు మూట కట్టుకున్నట్లు కౌన్సిలర్లే ఆరోపిస్తున్నారు. ఇక్కడి మున్సిపల్ కాంట్రాక్టర్లు విజయవాడలో ఒక బంగ్లానే కోట్ల రూపాయలతో ఇంజినీర్‌కు కట్టించి ఇచ్చినట్లు సమాచారం.

* యువకుడైన సదరు కమీషనర్ ఏ మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. ఇటీవల వచ్చిన ఒక మహిళా శానిటరీ ఇన్స్పెక్టర్ సైతం విధుల పట్ల, ప్రజలపట్ల, సమస్యల పట్ల, అలసత్వ పూరిత నిర్లక్ష్య ధోరణితో దుండుకుగా వ్యవహరిస్తున్నారు. కార్యాలయానికి మొక్కుబడిగా వస్తూ ఇంటి నుండే విధులు నిర్వహిస్తున్నారు. తిరువూరు అంతటా పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉంది. తిరువూరు చుట్టూ 7 వాగులు , 7 చెరువులు ఉన్నప్పటికీ ఈ మండు వేసవిలో పట్టణ ప్రజలు బిందెడు నీటి కోసం తమిళనాడు ప్రజలతో పోటీగా అలమటిస్తున్నారు.

* నగర పంచాయతీలో ఉన్న తెదేపా, వైకాపా కౌన్సిలర్లు సమావేశాలప్పుడు పత్రికల్లో ఫోటోల కోసం పైకి పోట్లాడుకుంటున్నట్లు నటిస్తూ కాంట్రాక్టుల్లో మాత్రం కలిసిమెలిసి వాటాలు పంచుకుంటున్నారు. సంవత్సరం క్రితం వేసిన సిమెంట్ రోడ్డులు కూడా చితికి దుర్భర స్థితికి చేరాయి. సిమెంట్ రోడ్ల పేరుతో కోట్లకు కోట్లు దిగమింగారు.

* ఇక్కడ అధికారులు ఏ స్థాయికి ఎదిగారో మరొక ఉదాహరణ ఇది. నూతనంగా ఎన్నికైన వైకాపా ఎమ్మెల్యే రక్షణనిధిను సైతం లెక్కచేయడం లేదు. గత మే30వ తేదీన ఎమ్మెల్యే రక్షణనిధికి తెలియకుండానే కమిషనర్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తీరా ఎమ్మెల్యే నిలదీస్తే ఆ రోజున సెలవు పెట్టి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రిగా మీరు అవినీతి నిర్మూలించాలని కంకణం కట్టుకున్నందున తిరువూరు మున్సిపాల్టీలో జరిగిన అవినీతి అక్రమాల పై ఏసీబీ వంటి సంస్థతో దర్యాప్తు జరిపించాలని తిరువూరు ప్రజలైన మేము హృదయపూర్వకంగా, దీనంగా, ఆశతో కోరుకుంటున్నాం.

*** మచ్చుక్కి  మరికొన్ని కుంభకోణాలు

* తిరువూరు నియోజకవర్గంలో నీరు-చెట్టు పథకం కింద పనులను పర్యవేక్షించిన ఇంజనీర్ ₹5ఖోట్ల రూపాయలు కేవలం తన వాటా కింద తెదేపా నాయకుల నుండి వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆయన కార్యాలయానికి రాకుండా ఆయన నివాసం ఉంటున్న మైలవరం నుండి తిరువూరు బైపాస్‌రోడ్డులోని ఒక హోటల్‌కు వచ్చి అక్కడ గదిలో కూర్చొని చేయని పనులకు బిల్లులు చేసి కోట్లాది రూపాయలు అతిసులువుగా కొల్లగొట్టినట్లు సమాచారం.

* సాగర్ కాల్వల మరమ్మత్తుల్లోనూ భారీ ఎత్తున పనులు చేయకుండానే కోట్లకు కోట్లు దిగమింగారు.

* నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండల రెవెన్యు కార్యాలయాలు అవినీతి అడ్డాలుగా మారాయి. అటెండర్‌కు ₹5వేలు, వీఆర్వోకు ₹25వేలు, ఎమ్మార్వోకు ₹50వేలు కనీస మొత్తాలుగా ఇస్తేనే పనులు జరుగుతున్నాయి. ఎన్నికలకు ముందు తిరువూరు మండల రెవెన్యు అధికారిగా పని చేసిన ఒక అధికారి ఒక్కొక్క పాస్ పుస్తకానికి ₹1లక్ష రూపాయల వరకు వసూలు చేశారు. స్థానికులైన వీఆర్వోలను, బయట మండలాలకు బదిలీ చేస్తేనే గాని రెవెన్యు వ్యవస్థలో మార్పు రాదని మా అందరి నమ్మకం. దాన్ని మీరు వమ్ము చేయరని ఆశిస్తున్నాము.

* తిరువూరు, గంపలగూడెం మండల పరిషత్ కార్యాలయాల్లో గత అయిదేళ్లల్లో కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం జరిగాయి. మూడు నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన మండల పరిషత్ సమావేశాలను కాగితాల మీదనే చూపించారు. ఉపాధి హామీ పథకంలో అడ్డగోలుగా పనులు జరిగాయి. భారీ ఎత్తున నిధులు మింగేశారు.

* తిరువూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌గా ఉండవలసిన ఎమ్మెల్యేను పక్కన పెట్టారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది పేరుతో భారీ ఎత్తున నియామకాలు జరిపి నేతలు డబ్బులు దండుకున్నారు. ప్రెవేట్ ఆస్పత్రులు నిర్వహించే డాక్టర్లను ప్రభుత్వ ఆస్పత్రల్లో వైద్యులుగా నియమించి ఒక్కొక్కరికి నెలకు ₹1లక్ష రూపాయల చొప్పున చెల్లిస్తున్నారు. వైద్య సౌకర్యాలు ఇక్కడ చాలా అధ్వాన్నంగా ఉన్నాయి.

* ఒకప్పుడు రాష్ట్రంలో అధిక ఆదాయాన్ని సమకూర్చి పెట్టిన తిరువూరు ఆర్టీసీ బస్సు డిపోలో పరిస్థితులు దారుణానికి అతి దగ్గరగా ఉన్నాయి. గత నాలుగేళ్లల్లో ఈ బస్సు డిపో పరిస్థితిని అధికారులు పూర్తిగా దిగజార్చారు. హైదరాబాద్‌కు పగటి పూట నడుపుతున్న ఆరు బస్సు సర్వీసులను అర్ధాంతరంగా రద్దు చేసినప్పటికీ ప్రయాణీకుల గోడు పట్టించుకునే వారే లేరు. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల సరిహద్దుల్లో దాదాపు రెండు వందల గ్రామాలకు సేవలందిస్తున్న తిరువూరు ఆర్టీసీ బస్సు డిపోకు పూర్వ వైభవం తీసుకురావాలి.

* పోలీస్ శాఖపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. తిరువూరు పోలీస్ సిఐ పోస్టుకు, నాలుగు మండలాలలోని ఎస్సై పోస్టులకు భారీ డిమాండ్ ఉంది. గడిచిన అయిదేళ్లల్లో నలుగురు సిఐలు మారారు. ఎస్సైలదీ ఇదే పరిస్థితి. తెదేపా ముఖ్య నేతలకు ముడుపులు ఇచ్చి పోలీస్ శాఖలో బదిలీలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. సరిహద్దుల్లో ఉన్న తిరువూరులో ప్రతి సంవత్సరం కోడిపందేలు, నిత్యం జూదాలు జరుగుతూ ఉంటాయి. ఎన్నికలప్పుడు పోరాడుకున్నట్లు నటించే తెదేపా, వైకాపా నేతలు కోడిపందేలు మాత్రం సోదరభావంతో కలిసిమెలిసి నిర్వహించి లాభాలు చెరిసగం పంచుకుంటారు. జూదశాలలు నిర్వహించడంలో ప్రసిద్ధులుగా తిరువూరుకు చెందిన కొందరు వైకాపా నేతలు పేరు గడించారు. మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కన్నా అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. శాంతి భద్రతలను పరిరక్షించడంలో మీరు శ్రద్ధ చూపాలి.

* విద్యుత్ శాఖలోనూ భారీగా అవకతవకలు, అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఒక మోటారు కనెక్షన్ కావాలంటే భారీగా ముడుపులు ఇవ్వవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

* ఇసుక, మట్టి నిల్వలు నియోజకవర్గంలో గత అధికార పార్టీ నేతల అక్రమాలకు ఆవిరయి పోయాయి. పొరుగునే ఉన్న తెలంగాణ జిల్లాలకు తరలించి కోట్లు గడించారు. ఉన్న నిల్వలనైన కాపాడాలి. పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, సాంఘిక సంక్షేమ వసతి గృహల్లోనూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ పరిస్థితులు దీనంగా ఉన్నాయి. నిధులు దుర్వినియోగం అవుతున్నాయి.

చివరిగా ఒక మాట. గత అయిదేళ్లల్లో అప్పటి అధికార పార్టీ నేతల దందాలు, అధికారుల అక్రమాలతో ప్రజలు విసుగెత్తిపోయారు. అవినీతి మచ్చలేని, మంచి వ్యక్తిగా పేరున్న రక్షణనిధిని ఇక్కడి ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు. అందరితో సామరస్య ధోరణితో ఉండే మా ఎమ్మెల్యే రక్షణనిధికి తప్పనిసరిగా మీ సారథ్యంలో కొంత శిక్షణ ఇవ్వాలని, అవినీతి విషయంలో కటువుగా ఉండే విధంగా ఆయన్ను తీర్చిదిద్దాలని మా కోరిక. దీనితో పాటు తోట్లవల్లూరు నుండి తిరువూరుకు మా శాసనసభ్యులు రక్షణనిధిని పూర్తి స్థాయిలో బదిలీ చేసి తనను నమ్ముకున్న ప్రజల మధ్యనే ఉండే విధంగా మీరు చొరవ చూపవల్సిందిగా విజ్ఞప్తి.

ముఖ్యమంత్రిగా మీకున్న సర్వ, సకల, సమస్త అధికారాలను పాశుపతాస్త్రాలుగా ప్రయోగించి, అవినీతి నిర్మూలించి, వ్యవస్థను మెరుగుపరిచి తిరువూరు నియోజకవర్గాన్ని రాష్ట్రం మొత్తానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని మిమ్మలను రెండు చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాము.

ఇట్లు
గత అయిదేళ్ల నుండి పీడనలకు, వేదనలకు గురైన తిరువూరు నియోజకవర్గ ప్రజలు.

కిలారు ముద్దుకృష్ణ
సీనియర్ జర్నలిస్ట్
Ph; +91-9440231118
Email: kilarumuddukrishna@yahoo.com