Agriculture

ఒక్క వర్షం కురిస్తే…రైతన్నకు ఎంతో ఆనందం

No trace of monsoon rains-Lot of sectors are affected in India-Farmers in dismay

ఒక్క వర్షం వస్తే చాలు తమ పంట పొలాలు పదునెక్కుతాయని.. అదునుకు సేద్యం చేసుకోవచ్చని రైతులు భావిస్తున్నారు. కానీ ఈ సారి ‘వాయు’ రూపంలో ఆలస్యం అవుతోంది. గుజరాత్‌పై విరుచుకుపడ్డ ఆ తుపాను కారణంగా నైరుతి రుతుపవనాలు ఈ సారి ఆలస్యమయ్యాయి. సాధారణంగా అయితే జూన్‌ 1నే కేరళ తీరాన్ని తాకే రుతుపవనాలు ఈ సారి జూన్‌ 8కి వచ్చాయి. ఇక అరేబియా సముద్రంలో ఏర్పడ్డ ‘వాయు’ కాస్తా అవి విస్తరించకుండా అడ్డుకున్నాయి. 2016లోనూ ఇలాగే జూన్‌ 8కి కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు జులై 13 కల్లా దేశమంతా విస్తరించాయి. సగటు వర్షపాతాన్న నమోదు చేశాయి. మరి ఈ సారి ఏం చేస్తాయో చూడాలి. ఎందుకంటే మొత్తం ఆర్థిక వ్యవస్థతో పాటు ఎఫ్‌ఎమ్‌సీజీ, ఎరువులు, వాహన, ఎన్‌బీఎఫ్‌సీ వంటి రంగాలపైనా ప్రభావం పరోక్షంగా ఉంటుందన్న సంగతి మనం మరచిపోకూడదు. భూమి నుంచి చీల్చుకురావడానికి విత్తు ఎదురుచూసినట్టు.. తల్లి గర్భం నుంచి బయటకు రావడానికి బిడ్డ ఎదురుచూసినట్టు.. ప్రపంచ కప్‌ను ముచ్చటగా మూడో సారీ ముద్దాడాలని క్రికెట్‌ అభిమాని ఎదురుచూసినట్టు.. ఆకాశం నుంచి వర్షపుచినుకులు రాలిపడాలని ఎందరో ఎదురుచూస్తున్నారు. భారత్‌ వ్యవసాయాధార దేశం. దేశంలో ఏటా కురిసే వర్షపాతంలో 70 శాతం వర్షం నైరుతి రుతుపవనాలే అందిస్తాయి. జీడీపీలో కేవలం 15 శాతం వాటానే వ్యవసాయ రంగం ద్వారా వస్తున్నా.. దేశంలో సగం మందికి ఉపాధినిస్తుందా రంగం. అంతే కాదు.. వ్యవసాయ దిగుబడి పెరిగితే అది పరోక్షంగా ఆర్థిక వ్యవస్థకూ ఊతం లభిస్తుంది. ఎందుకంటే రైతుల చేతిలో నాలుగు డబ్బులు ఆడితే అది కొనుగోలు శక్తిని పెంచుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారు వస్తువుల కొనుగోళ్లు పెరుగుతాయి. అంతే కాకుండా.. సరైన సమయంలో వర్షాలు పడి మంచి పంటలు పండితే.. ద్రవ్యోల్బణం కూడా అదుపులో ఉంటుంది. అది సామాన్యుల జేబు చిల్లుపడకుండా కాపాడుతుంది. ఇంతకీ ఈ వర్షాలు ఏ రంగంపై ఎలా ప్రభావం చూపనున్నాయో చూద్దాం..

* మోదీ ప్రభుత్వంపై..
మోదీ 2.0 ప్రభుత్వం గద్దెనెక్కింది. అందుకు కారణం రైతులకు ప్రకటించిన ఆదాయ పథకం. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఈ హామీ వల్ల మెజారిటీ సీట్లు సాధ్యమయ్యాయి. ఇపుడు సరైన సమయంలో వర్షాలు పడితే తప్ప వచ్చే అయిదేళ్లలో వ్యవసాయ ఆదాయాలను రెట్టింపు చేయాలన్న మోదీ లక్ష్యంలో తొలి అడుగు పడదు. అందుకే అదునులో వర్షాలు పడడం ఇపుడు ప్రధానమంత్రికి చాలా ముఖ్యం. మరో పక్క, వర్షాలు సరిగ్గా పడకపోతే.. ప్రభుత్వ వ్యయాలు కూడా పెరుగుతాయి. కరవు పరిస్థితి వస్తే కూరగాయలు, పప్పుధాన్యాలు ప్రియమవుతాయి. అపుడు సంక్షేమపథకాలపై ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది పరోక్షంగా ద్రవ్యలోటును పెంచుతుంది.

* ఆర్‌బీఐపై..
భారత వినియోగదారు ధరల సూచీ(సీపీఐ)లో సగం ఆహారానిదే వాటా. ఇక ఆర్‌బీఐ ద్రవ్యోల్బణ గణాంకాలపై ఆధారపడే తన పరపతి విధాన ధోరణిని, వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంటుంది. సరిగ్గా వర్షాలు పడితే దిగుబడి పెరిగి ఆహార ధరలు నియంత్రణలో ఉంటాయి. ద్రవ్యోల్బణమూ ఆర్‌బీఐ లక్ష్యమైన 4 శాతం దిగువనే ఉంటుంది. అపుడు కీలక రేట్ల విషయంలో ఆర్‌బీఐకి స్వేచ్ఛ ఉంటుంది. బ్యాంకులకు ద్రవ్యలభ్యత పెంచడానికి వీలుంటుంది.

* ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలపై..
మనం ఇది వరకే చెప్పుకున్నట్లు గ్రామీణ గిరాకీకి వర్షాలే మూలాధారం. సాధారణ వర్షపాతం కురుస్తుందని అంచనాలు వెలువడ్డపుడల్లా ఈ రంగ ఉత్పత్తులు, సేవలకు గిరాకీ పెరుగుతూ వచ్చేది. తద్వారా ముడి పదార్థాల వ్యయాలు తగ్గడంతో పాటు.. ఆర్థిక పనితీరు మెరుగుపడేది. మార్జిన్లు పెరిగేవి. నికర విక్రయాలు జోరందుకునేవి. అయితే ఈ సారి గ్రామీణ గిరాకీ కాస్త స్తబ్దుగా ఉంది. అది హిందుస్థాన్‌ యునిలీవర్‌, డాబర్‌, ఐటీసీ, కోల్గేట్‌ పామోలివ్‌ ఇండియా వంటి కంపెనీల ఆర్థిక ఫలితాల్లో ఇప్పటికే కనిపించింది. సరైన వర్షాలు కురిస్తే మాత్రం ఆయా కంపెనీలు తిరిగి పుంజుకోవచ్చు.

* బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలపై..
ప్రస్తుతం బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు మొండి బకాయిలను ఎదుర్కొంటున్నాయి. ద్రవ్యలభ్యత తక్కువగా ఉంటోంది. మంచి వర్షాలు కురిస్తే వ్యవసాయ ఉత్పాదక పెరుగుతుంది. రుణాల చెల్లింపులు సరైన సమయంలో జరుగుతాయి. అది బ్యాంకుల, ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తుల నాణ్యత మెరుగుపడేలా చేస్తుంది. గత కొన్నేళ్లుగా అధిక ఒత్తిడిలో ఉన్న ఆస్తులు, కేటాయింపుల కారణంగా రుణ వృద్ధి సరిగా లేక.. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతోన్న సంగతి తెలిసిందే.

* ఎరువుల కంపెనీలు..
ఈ రంగం మొత్తం వర్షాలపైనే ఆధారపడి ఉంది. ఎందుకంటే వర్షాలు కురిస్తేనే కదా.. రైతులు పంటలను పండించేది. వాటి సంరక్షణ కోసం ఎరువులు వాడేది. ఈ కంపెనీల మార్జిన్లు, ఆదాయాలు మొత్తం రైతుల గిరాకీపైనే ఆధారపడి ఉంటుంది. మరో పక్క, పురుగు మందుల కంపెనీలు కూడా వానల కోసం ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా బేయర్‌ క్రాప్‌, ధనూకా అగ్రి, పీఐ ఇండస్ట్రీస్‌, ర్యాలీస్‌ ఇండియా, శారదా క్రాప్‌, యూపీఎల్‌ వంటి విక్రయాలు వాటిపైనే ఆధారపడి ఉన్నాయి.

* విద్యుదుత్పత్తిపై..
సాధారణంగా వర్షపాతం పెరిగినపుడల్లా.. భారత్‌లో విద్యుదుత్పత్తి పెరుగుతూ ఉంటుంది. మన దేశంలో సాగుకే కాకుండా.. విద్యుదుత్పత్తికి కూడా నీటిని అత్యధికంగా ఉపయోగిస్తాం. ముఖ్యంగా ఎన్‌టీపీసీ, టాటా పవర్‌ కంపెనీ, రిలయన్స్‌ పవర్‌, అదానీ పవర్‌లు కూడా ఇపుడు వర్షాల కోసం ఎదురుచూస్తున్న కంపెనీలే.

* వాహన కంపెనీలు..
మంచి వర్షాలు కురిస్తే ద్విచక్ర వాహనాలకు గిరాకీ పెరుగుతుంది. తక్కువ ధర కార్లకూ డిమాండ్‌ వస్తుంది. ఇక రైతులకు అవసరమైన ట్రాక్టర్లు కూడా వేగాన్ని అందుకుంటాయి. వాహన రంగం ఇప్పటికే విక్రయాల విషయంలో స్తబ్దుగా ఉంది. ప్యాసింజరు వాహనాలైతే మే నెలలో గత 18 ఏళ్లలోనే అత్యధికంగా విక్రయాల్లో క్షీణతను నమోదు చేశాయి. 2011-12; 2008-09 తరహాలోనే పరిశ్రమకు సహాయం చేయమని ఇప్పటికే వాహన కంపెనీ ప్రభుత్వాన్ని కోరుతోంది. దీనికి తోడుగా వర్షాలు గట్టిగా కురిసి గిరాకీ కూడా రాణిస్తే తప్ప ఈ రంగం కోలుకోలేదు.

* స్టాక్‌మార్కెట్లపై..
ఓ వైపు ఈ ఏడాది సాధారణ వర్షపాతం కురవవచ్చని ఐఎమ్‌డీ వంటి సంస్థలు చెబుతున్నా.. స్కైమెట్‌ వంటివి మాత్రం సగటు కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా వేస్తున్నాయి. ఈ అంచనాలకు స్టాక్‌ మార్కెట్లకు సంబంధం ఉంది. వర్షాలు సగటు కంటే తక్కువగా కురుస్తాయని ఐఎమ్‌డీ అంచనా వేసినపుడల్లా మార్కెట్లు ప్రతికూలంగానే స్పందించాయి. ఇక విత్తనాలు, వ్యవసాయ రసాయనాలు, ఎరువుల వంటి కంపెనీల షేర్లు వర్షపాతం ఆధారంగానే కదలాడుతాయి. ఎఫ్‌ఎమ్‌సీజీ, వాహన వంటి కంపెనీల స్క్రిప్‌లు పరోక్షంగా రుతుపవనాలపైనే ఆధారపడి ఉంటాయి. బ్యాంకింగ్‌, ఎన్‌బీఎఫ్‌సీ, సూక్ష్మ రుణ సంస్థలకూ వర్షాలు కీలకం కానున్నాయి. బ్యాంకులు, ఎఫ్‌ఎమ్‌సీజీ, వాహన కంపెనీలు నిఫ్టీ-50లో సగం వెయిటేజీని కలిగి ఉన్నాయి. ఈ రంగాల ఆర్థిక ఫలితాలన్నీ రుతుపవనాలపై ఆధారపడి ఉంటాయి కాబట్టి.. మొత్తం మార్కెట్‌ కదలికలు కూడా రుతుపవనాలు ఎటు వెళితే అటు వెళ్లే అవకాశం ఉంది.