Devotional

భద్రాద్రి లడ్డూ మరింత ప్రియం కానుంది

Price of bhadrachalam laddu has been increased

1.భద్రాచలం లడ్డూ ప్రీయం – తదితర ఆద్యాత్మిక వార్తలు
రామాలయంలో 100 గ్రాముల బెల్లం లడ్డూని రూ.20కి విక్రయిస్తుండగా దీన్ని 80 గ్రాములకు తగ్గించడంతో పాటు ధరను రూ.25 చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించగా ఆ శాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో బెల్లం ప్రసాదాలను కొద్ది రోజులుగా విక్రయిస్తుండగా ఇందులో లడ్డూ ధర విషయంలో స్పష్టత లేదు. ఎవరికి అనుకూలమైన ధరతో వాళ్లు విక్రయాలు చేపడుతున్నారు. ఇక నుంచి అన్ని ఆలయాల్లో ఒకే ధర అమలు కానుంది. భద్రగిరిలో లడ్డూలకు వాడే బెల్లం ధర పంచదార కన్నా ఎక్కువ ఉంటుంది. నెయ్యి కూడా ఎక్కువ పడుతుందని అంచనా. ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశంతో వీటిని తయారు చేస్తుండగా చాలా తక్కువ మొత్తంలో భక్తుల నుంచి కొనుగోళ్లు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీ రోజు వందల సంఖ్యలోనే తయారు చేస్తున్నారు. 80 గ్రాముల లడ్డూని రూ.25కి విక్రయిస్తేనే ఆలయానికి ప్రతీ లడ్డూపై కొంత లాభం ఉండే వీలుంది. 100 గ్రాములను రూ.20కి విక్రయిస్తే నష్టాలు వస్తాయని అంచనా వేశారు. కొత్త ధరలు నేడో రేపో అమల్లోకి వచ్చే వీలుందని ఆలయ వర్గాలు తెలిపాయి. బెల్లం ప్రసాదాల తయారీ అమల్లోకి వచ్చాక ఇక్కడ చక్కెర పొంగలి విషయంలో మార్పులు చోటుచేసుకున్నాయి. 150 గ్రాముల చెక్కర పొంగలిని ఈ మధ్య వరకు రూ.10కి విక్రయించారు. దీనిపై ఆలయానికి నష్టం వస్తోందని భావించిన అధికారులు సమాలోచనలు చేసి చెక్కర పొంగలికి ధర పెంచకుండా 150 గ్రాముల నుంచి 100 గ్రాములు చేశారు. ఈ నేపథ్యంలో మిగతా ప్రసాదాల ధరలు యథావిధిగా ఉంటాయా లేక మార్పులు చోటు చేసుకుంటాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రసాదాల ద్వారా గతేడాది రూ.6.68 కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది రూ.7.84 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తంగా చూస్తే ప్రసాదాల విభాగం లాభాల్లోనే సాగుతోంది.
2. తితిదే శ్రీవాణి ట్రస్టుకు దాతల సహకారం
తిరుమల, తిరుపతి దేవస్థానం నూతనంగా ప్రారంభించిన శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్టు(శ్రీవాణి)కి దాతలు తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఈ ఏడాది మే నెల 25న ట్రస్టు కార్యక్రమాలు ప్రారంభించగా ఇప్పటివరకు రూ.25 లక్షలు దాతలు అందించారు.శ్రీవాణి ట్రస్టుపై తితిదే ఈవో అనిల్కుమార్ సింఘాల్ తిరుపతిలో సమీక్షించారు.
3. త్వరలో తితిదే నూతన పాలకమండలదేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌
తిరుమల శ్రీవారిని ఏపీ దేవాదాయశాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న మంత్రికి.. తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ… ఆర్డినెన్స్‌ ద్వారా తితిదే ప్రస్తుత పాలకమండలిని రద్దు చేసి త్వరలో నూతన బోర్డును నియమిస్తామన్నారు. శ్రీవారి ఆభరణాల భద్రతపై ఉన్న అపోహలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని, త్వరలోనే తితిదే అధికారులతో సమీక్షిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో వంశ పారపర్యంగా వస్తున్న అర్చకత్వానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి ప్రకటించారు.
4. తిరుమల సమాచారం ఓం నమో వేంకటేశాయ
ఈరోజు బుధవారం 19-06-2019 ఉదయం 5 గంటల సమయానికి. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ…… శ్రీవారి దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్ లు నిండి బయట వేచి ఉన్న భక్తులు… శ్రీ వారి సర్వ దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.. నిన్న జూన్ 18 న 83,840 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది. నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹:3.34 కోట్లు.
5. చరిత్రలో ఈ రోజు జూన్, 19
** సంఘటనలు
1829: లండను పోలీసు లకు, జీతం, యూనిఫాం లను అనుమతిస్తూ చేసిన ‘ద మెట్రోపాలిటన్ పోలీసు చట్టం’ బ్రిటిషు రాజు అనుమతి పొందింది.
2009: 32 సంవత్సరముల అనంతరం భారతదేశపుద్రవ్యోల్బణం ఋణాత్మకం (సున్నా కంటే తక్కువ) గా నమోదైనది.
1953: అమెరికా కు చెందిన అణుశక్తి రహస్యాలను సోవియట్ రష్యా కు చేరవేసిన ‘జూలియస్’, ‘ఎథెల్ రోసెన్ బెర్గ్’ అనే ఇద్దరిని న్యూయార్క్ నగరంలో శిక్షించారు.
1964: అమెరికా సెనేట్ సివిల్ రైట్స్ చట్టం 1964 ను ఆమోదించింది.
1989: ఇ.ఎస్. వెంకట రామయ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా ప్రమాణస్వీకారం (1989 జూన్ 19 నుంచి 1989 డిసెంబరు 18 వరకు).
**జననాలు
1623: బ్లేజ్ పాస్కల్, పాస్కల్ సూత్రం కనిపెట్టిన శాస్త్రవేత్త. (మ.1662)
1728: రెండవ షా ఆలం, మొఘల్ చక్రవర్తి. (మ.1806)
1928: భద్రిరాజు కృష్ణమూర్తి, ద్రావిడ భాషా పరిశోధకులు, భాషాశాస్త్ర అధ్యాపకులు. (మ.2012)
1939: నూతలపాటి సాంబయ్య, నాటకరంగ ప్రముఖుడు.1985: కాజల్ అగర్వాల్, భారతీయ చలనచిత్ర నటీమణి.
**మరణాలు
2001: జంధ్యాల, సుప్రసిద్ధ తెలుగు సినిమాదర్శకుడు, మాటల రచయిత. (జ.1951)
2018: ప్రముఖ ధ్వన్యనుకరుణ కళాకారుడు, పద్మశ్రీ పురస్కారగ్రహీత నేరెళ్ళ వేణుమాధవ్ వరంగల్లు లో స్వగృహంలో మరణం (జ.1932).
6. శుభమస్తు – నేటి పంచాంగం తేది : 19, జూన్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
వారము : బుధవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : విదియ
(ఈరోజు సాయంత్రం 2 గం॥ 14 ని॥ వరకు)
నక్షత్రం : పూర్వాషాడ
(ఈరోజు మద్యాహ్నం 12 గం॥ 50 ని॥ వరకు)
యోగము : బ్రహ్మము
కరణం : గరజ
వర్జ్యం : (ఈరోజు రాత్రి 9 గం॥ 26 ని॥ నుంచి 11 గం॥ 09 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 8 గం॥ 25 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 7 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 36 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 24 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 38 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 16 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 7 గం॥ 20 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 58 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 42 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 52 ని॥ లకు
7. సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడి ప్రకాశం
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన బుధ‌వారం ఉదయం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనసేవ ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారబ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం స్వామివారు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ భక్తులను ఆరోగ్యవంతులను చేస్తూ సూర్యప్రభ వాహనంలో కటాక్షించాడు. సూర్యుడు సకలరోగ నివారకుడు. ఆరోగ్యకారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, పండే పంటలు, ఓషధీపతి అయిన చంద్రుడు సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాయి. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే శ్రీ ప్రసన్న సూర్యనారాయణుడిని దర్శించే భక్తులకు ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతానసంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. అనంతరం ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు. రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
**చంద్రప్రభ వాహనం
రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీవారు దర్శనమిచ్చి తన చల్లని అమృత కిరణాలతో భక్తులను అమృతస్వరూపులను చేస్తారు. నక్షత్రాలకు చంద్రుడు అధిపతి అయితే శ్రీవారు సమస్త విశ్వానికీ అధిపతి. వాహనం చంద్రుడు ఆహ్లాదకారి. శ్రీవారు చంద్రమండల మధ్యస్థుడై పరమాహ్లాదకారి అయ్యాడు. సర్వకళాసమాహారాత్మకుడైన ఆదినారాయణుడు తన కళల నుండి 16 కళలు చంద్రునిపై ప్రసరింపజేసినందున చంద్రుడు కళానిధి అయ్యాడు. చంద్రదర్శనంతో సముద్రం ఉప్పొంగినట్టు, చంద్రప్రభామధ్యస్థుడైన శ్రీకల్యాణచంద్రుణ్ణి దర్శించడంతో భక్తుల హృదయ క్షీరసాగరాలు ఉత్తుంగప్రమోద తరంగాలతో పొంగి ఆనందిస్తాయి. చంద్రప్రభ వాహనంలో శ్రీవారిని దర్శించడం సకలతాపహరం, పాపహరం.
* 20న రథోత్సవం
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన గురువారం రథోత్సవం వైభవంగా జరుగనుంది. ఉదయం 9.15 గంట‌ల‌కు మిథున‌ లగ్నంలో స్వామివారు రథారోహణం చేస్తారు. ఉదయం 9.30 నుండి 11.00 గంటల వరకు రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ గోపాలకృష్ణా, కంకణభట్టార్‌ శ్రీసూర్యకుమార్‌ ఆచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు, ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
8. శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులను అలరిస్తున్న ఆధ్యాత్మిక, సంగీత కార్యక్రమాలు
శ్రీ ప్ర‌స‌న్న‌ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా ఆల‌యంలో నిర్వ‌హిస్తున్న ధార్మిక‌, సంగీత‌, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు, దాస‌సాహిత్య ప్రాజెక్టు, శ్రీ‌వేంక‌టేశ్వ‌ర సంగీత‌, నృత్య క‌ళాశాల ఆధ్వర్యంలో ఈ కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా బుధ‌వారం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల వివ‌రాలిలా ఉన్నాయి. అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య మండ‌పంలో ఎస్‌.వి.సంగీత కళాశాల ఆధ్వ‌ర్యంలో ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు మంగళధ్వని, ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు డి.పి.పి. ఆధ్వార్యంలో శ్రీ విష్ణుస‌హ‌స్ర‌నామ పారాయణం నిర్వహించారు. ఉదయం 11.00 నుండి 12.00 గంటల వరకు గుంటూరు చెందిన శ్రీ పి.వి.గౌరిశంక‌ర్‌ ధార్మికోప‌న్యాసం చేశారు. సాయంత్రం 4.00 నుండి 6.00 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ ఎం.ల‌క్ష్మీకుమారి బృందం హ‌రిక‌థ పారాయ‌ణం చేయ‌నున్నారు. సాయంత్రం 6.00 నుండి 8.00 గంట‌ల వ‌ర‌కు ఊంజల్‌ సేవలో తిరుప‌తికి చెందిన శ్రీ దంతు ర‌విశంక‌ర్‌ బృందం అన్న‌మ‌య్య సంకీర్తన‌ల‌ను ఆల‌పిస్తారు.