Agriculture

తమిళనాడులో తీవ్ర నీటి ఎద్దడి

The future of Indian water crisis is evident in Tamilnadu

నీటి ఎద్దడితో తమిళనాడు అల్లాడిపోతోంది. చెన్నై నగరంలో బిందెడు నీళ్లు దొరకడం కష్టంగా మారింది. వాటర్ ట్యాంకర్ల వద్ద ప్రజలు యుద్ధాలు చేస్తున్నారు. నీటి తగదాల్లో ప్రాణాలు కూడా పోతున్నాయి. చెన్నైలో చాలా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. ఐటీ కంపెనీలు హోమ్ టు వర్క్ అమలు చేస్తున్నాయి. నీటి ఎద్దడి నివారణకు నగరంలో బోర్లు వేయిస్తోంది వాటర్ బోర్డు. నీటి వనరులను దుర్వినియోగం చేయడం వల్లే సమస్య తీవ్రమైందంటూ తమిళనాడు సర్కార్ పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.చెన్నైలో నీటికష్టాలు మరింత తీవ్రమయ్యాయి, రిజర్వాయర్లు ఖాళీ కాగా.. బోర్లు ఎండిపోయాయి. వాటర్ ట్యాంకర్ బుక్ చేసినా.. వస్తుందో రాదో తెలియని పరిస్థితి. ఆఖరికి కాలకృత్యాలు తీర్చుకుందామన్నా ఎక్కడా నీళ్లు దొరకట్లేదు. వంటలకు నీళ్లు లేక హోటల్స్ మూతపడుతున్నాయి. ఇక కూలీ నాలీ చేసుకుంటూ చిన్న చిన్న బస్తీల్లో నివసించేవారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ట్యాంకర్ల ద్వారా వచ్చే నీటి కోసం పొద్దంతా పడిగాపులు కాస్తున్నారు.చెన్నై నగర నీటి అవసరాలను తీర్చే పూంది, పుజల్, చోళవరం, చెంబరంబక్కం జలాశయాలు ఎండిపోయాయి. వానలు కురవకపోవటం, భూగర్భజలాలు పడిపోవడం, తెలుగు గంగ పథకం కింద చెన్నైకి రావాల్సిన కండలేరు జలాలు కూడా సరఫరా కాకపోవడంతో నీటి ఎద్దడి తారాస్థాయికి చేరింది. చోళవరం, సెంగుండ్రం చెరువుల నుంచి నీటి తరలింపును మే ఆరంభంలోనే అధికారులు ఆపేశారు. తర్వాత చెన్నై శివార్లలోని క్వారీల్లో లభించే నీటిని శుభ్రం చేసి సరఫరా చేశారు. ఇప్పుడు ఆ నీరు కూడా తగినంత లభ్యం కావట్లేదు. ప్రస్తుతం తమిళనాడులోని పెద్ద జలాశయాల్లో ఒకటైన వీరణం సరస్సు నుంచి 15 కోట్ల లీటర్ల నీటిని తీసుకుంటున్నారు. ఇవికూడా చెన్నై డిమాండ్ కు ఏ మాత్రం సరిపోవటం లేదు.నీటి కొరతతో చాలా హోటళ్లు, రెస్టారెంట్లను మూసేశారు. ట్రిప్లికేన్, చెపాక్, రాయపేట ప్రాంతాల్లో వెయ్యికి పైగా ఉన్న మెస్సుల్లో సగానికి పైగా బందయ్యాయి. చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ అండర్ గ్రౌండ్ రైల్వే స్లేషన్లలోని ఏసీని నిలిపివేసింది. చాలా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల్ని ఇంటి నుంచి పని చేయాలని కోరాయి. నీళ్ల ట్యాంకర్లకు అధిక డిమాండ్ ఏర్పడింది. నీళ్ల కోసం అక్రమ మార్గాలు వెతుక్కుంటుండటంతో రాష్ట్ర ప్రభుత్వం నీటి కనెక్షన్లను కట్ చేసింది.తమిళనాడులో నీటికోసం ఏకంగా యుద్ధాలే జరుగుతున్నాయి. ఒక ట్యాంకరు వస్తే చాలు నీళ్ల కోసం పెద్ద క్యూలలో ప్రజలు నిలబడుతున్నారు. గంటలకొద్దీ నీటికోసం క్యూలో నిలబడి సహనం కోల్పోయి గొడవలు పడుతున్నారు. తంజావూరులో నీటిని అక్రమంగా నిల్వ చేసుకుంటున్నారని ప్రశ్నించిన సామాజిక కార్యకర్త ఆనంద్ బాబును కొట్టి చంపారు. చెన్నైలో నీళ్ల పంపకాల విషయంలో జరిగిన గొడవలో మహిళపై పదునైన పరికరంతో దాడి చేశారన్న ఆరోపణలతో…అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ కారు డ్రైవర్ ఆదిమూలంను పోలీసులు అరెస్ట్ చేశారు.నీటి ఎద్దడిని అధిగమించేందుకు చెన్నై మెట్రో వాటర్ బోర్డు ప్రత్యామ్నాయాలు వెతుకుతోంది. నగరంలో పెద్దఎత్తున బోర్లు వేస్తోంది. గతంలో వేసిన బోర్లను మరింత లోతు తవ్వుతున్నారు. ఇతర చోట్ల నుంచి చెన్నైకి నీటిని ట్యాంకుల్లో తరలిస్తోంది. మినీ ట్యాంకుల ద్వారా చిన్న చిన్న కాలనీలకు నీరు సరఫరా చేస్తున్నారు అధికారులు.నీటి సంక్షోభంతో చెన్నైకి వెళ్లాలనుకునేవారు భయపడుతున్నారు. ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడంలేదని చెన్నైవాసులు మండిపడుతున్నారు. మరోవైపు మున్సిపల్ మంత్రి వేలుమణి మాత్రం నీటి కొరతతో హోటల్స్ మూతపడుతున్నాయన్న వార్తలను ఖండించారు. వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి కొరతను తీర్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. హోటల్స్ లో ప్లేట్లకు బదులు అరటి ఆకులను వినియోగిస్తే నీటి వినియోగం తక్కువవుతుందని సలహా ఇచ్చారు. మున్సిపల్ మంత్రి వ్యాఖ్యలపై డీఎంకే చీఫ్ స్టాలిన్ మండిపడ్డారు. తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.