Politics

తెదేపాకు నలుగురు ఎంపీలు గుడ్‌బై-భాజపాలో జేరిక

Four TDP Rajyasabha MPs Announce Being Separate From Telugudesam

తెదేపాకు షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు తెదేపాను వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. తమను ప్రత్యేకమైన గ్రూప్‌గా పరిగణించాలంటూ ఎంపీలు సీఎం రమేశ్‌, సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేశ్‌ రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ అందజేశారు. తెదేపాను విభేదించి బయటకు వచ్చామని.. ఆ పార్టీతో ఇకపై తమకు ఎలాంటి సంబంధం లేదని రాజ్యసభ ఛైర్మన్‌కు అందజేసిన లేఖలో ఎంపీలు పేర్కొన్నారు. ఏ పార్టీకీ తమను అనుబంధ గ్రూపుగా పరిగణించొద్దని విజ్ఞప్తి చేశారు. తెదేపా నుంచి మాత్రమే తాము దూరమయ్యామని.. ఎంపీలుగా మిగిలిన కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని ఎంపీలు తమ లేఖలో వివరించారు. నలుగురు ఎంపీల రాజీనామాతో రాజ్యసభలో తెదేపా బలం రెండుకు పడిపోయింది. ప్రస్తుతం ఆ పార్టీకి తోట సీతారామలక్ష్మి, కనకమేడల రవీంద్రకుమార్‌ మాత్రమే మిగిలారు. ఈరోజు ఉదయం భేటీ అయిన రాజ్యసభలో తెదేపా పార్లమెంటరీ పార్టీ.. కీలక తీర్మానం చేసింది. మోదీ నేతృత్వంలో జరుగుతున్న దేశాభివృద్ధి రాజకీయాల పట్ల ఆసక్తికరంగా ఉన్నామని.. రాజ్యసభలో తెదేపా పార్లమెంటరీ పార్టీని భాజపాలో వెంటనే విలీనం చేయాలని ఎంపీలు తీర్మానించారు. ఆ తీర్మానం ప్రతిని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడుకు అందజేశారు. 10వ షెడ్యూల్‌లోని 4వ పేరాలోని నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. 10వ షెడ్యూల్ ప్రకారం భాజపా పార్లమెంటరీ పార్టీలో తమను విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు తెదేపా విలీనంపై భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కూడా ఒక తీర్మానం చేసి రాజ్యసభ ఛైర్మన్‌కు అందించాలని నిర్ణయించినట్లు సమాచారం.