Devotional

జూన్ 21న “భక్తులతో భవదీయుడు”

TTD To Conduct Special Devotee Assistance Program On 22nd

తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో జూన్ 21వ తేదినకార్యక్రమం జరుగనుంది. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం అందుబాటులో ఉంటారు. ”భక్తులతో భవదీయుడు” క్తులు ఫోన్‌ ద్వారా నేరుగా జెఈవో గారికి సూచనలు, సలహాలు అందించవచ్చు. ప్రతినెలా మూడో శుక్రవారం ఈ కార్యక్రమం జరుగనుంది. ఇందుకోసం భక్తులు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబరు : 0877-2234777.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కపిలేశ్వరాలయం, శ్రీకోదండరామాలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయం, నారాయణనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయం తదితర టిటిడి స్థానికాలయాలు, తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం, విష్ణునివాసం, సత్రాల్లో సౌకర్యాలకు సంబంధించి సూచనలు, సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేయడమైనది. తద్వారా భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవకాశముంటుంది.టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
2. విజయవాడ కనకదుర్గమ్మ హుండీల ఆదాయం లెక్కింపు బుధవారం ఈవో వీ.కోటేశ్వరమ్మ పర్యవేక్షణలో జరిగింది. గత 15 రోజులకుగానూ 28 హుండీలలో భక్తులు అమ్మవారికి సమర్పించిన కానుకలను లెక్కించగా రూ 2,03,36,039లు నగదు, బంగారం 652 గ్రాములు, వెండి 5 కిలోల 800 గ్రాములు వచ్చినట్టు ఈవో పేర్కొన్నారు.
3. యాదాద్రికి చేరిన కలశాలు-మహాబలిపురంలో తయారీ
ఆలయ గోపురాలు, ద్వారాలకు అమర్చే రాగి కలశాలు, తొడుగులు బుధవారం యాదాద్రికి చేరాయి. 3800 కిలోల బరువున్న వీటిని మహాబలిపురంలో తయారుచేయించారు. యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణంలో భాగంగా సప్తగోపురాలను కృష్ణశిలతో రూపొందించిన విషయం తెలిసిందే. సప్తగోపురాలలో ఆరు రాజగోపురాలపై కలశాలు, దివ్య విమానంపై శ్రీసుదర్శనచక్రం, చుట్టూ స్వర్ణతాపడం చేయాలన్న ప్రణాళికతో ‘యాడా’ నిర్వాహకులు రాగి తొడుగులను మహాబలిపురంలో నిపుణులతో తయారు చేయించారు. 57 తొడుగులను పర్యవేక్షకుడు రవీంద్రాచారి యాదాద్రికి చేర్చారు. కలశాలు, గర్భాలయ ద్వారం, విమానాలకు బిగించే తొడుగులపై స్తంభోద్భవుడైన నారసింహుడు, పద్మం, హంస రూపాలను పొందుపరిచారు. వాటిని విమానం, గోపురాలపై తొడిగి(బిగించి) పరీక్షించే పర్వం ఆలయ శిల్పి ఆనందసాయి, స్థపతి సలహాదారు సుందరరాజన్, ప్రధాన స్థపతి ఆనందాచారి వేలు నేతృత్వంలో గురు, శుక్రవారాల్లో జరగనుంది.
4. తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది 24 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు సర్వదర్శనం భక్తులకు 10 గంటల సమయం పడుతుందినిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 81,77 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 3.71 కోట్లు.
5. చరిత్రలో ఈ రోజు/జూన్ 20చందాల కేశవదాసు
ప్రపంచ శరణార్థుల దినోత్సవం.
1876 : తొలి తెలుగు సినీ గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, మరియు నాటకకర్త చందాల కేశవదాసు జననం(మ.1956).
1939 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు రమాకాంత్ దేశాయ్ జననం.
1945: నోబెల్ శాంతి గ్రహీత అంగ్ సాన్ సూకీ జననం.
1952 : భారతీయ ఆంగ్ల నవలా రచయిత, కవి మరియు పద్మశ్రీ పురస్కార గ్రహీత విక్రమ్ సేఠ్ జననం.
1889: చీరాల-పేరాల ఉద్యమనేత దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జననం (మ.1928).
1957: సోవియట్ రష్యా తొలి ఉపగ్రహం స్పుత్నిక్ 1 ని అంతరిక్షంలోకి పంపింది.
1987: ప్రముఖ భారత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ మరణం (జ.1896).
2003: వికీమీడియా ఫౌండేషన్ స్థాపన.
6. శుభమస్తు
తేది : 20, జూన్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : గురువారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : తదియ
(నిన్న సాయంత్రం 3 గం॥ 38 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 5 గం॥ 11 ని॥ వరకు)
నక్షత్రం : ఉత్తరాషాఢ
(నిన్న మద్యాహ్నం 1 గం॥ 34 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 3 గం॥ 42 ని॥ వరకు)
యోగము : ఐంద్రము
కరణం : వణిజ
వర్జ్యం : (నిన్న రాత్రి 10 గం॥ 16 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 0 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 8 గం॥ 8 ని॥ నుంచి ఈరోజు రాత్రి 9 గం॥ 54 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 8 గం॥ 43 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 27 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 10 గం॥ 5 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 57 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 21 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 13 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 55 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 33 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 8 గం॥ 59 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 37 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 12 గం॥ 16 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 54 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 42 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 52 ని॥ లకు
సూర్యరాశి : మిథునము
చంద్రరాశి : మకరము
విశేషం 20. సంకష్టహరచతుర్థి
7. కాశి దేవాలయ ప్రదక్షిణ మహత్యం..!
పూర్వం హిమాలయ పర్వతాల్లో ఒక చక్రవాకపక్షి ఉండేది. అది ప్రతిరోజూ ఉదయాన్నే ఆహారం కోసం తన నివాసాన్ని వదిలి ఆకాశమార్గాన అలా అలా పయనిస్తూ ఎన్నెన్నో దేశాలను దాటుకుంటూ కాశీ నగరానికి వచ్చి చేరేది.అంత దూరం ప్రయాణించి మిట్టమధ్యాహ్న సమయానికి ఆ చక్రవాక పక్షి కాశీలోని అన్నపూర్ణాదేవి మందిరానికి చేరేసరికి దానికి ఆకలి వేస్తుండేది. ఆకలి తీర్చుకోవటం కోసం అన్నపూర్ణాదేవి మందిరం చుట్టూ పడిఉన్న మెతుకులను ఏరుకొని తింటూ పొట్ట నింపుకొనేది.ఇలా మెతుకులను ఏరి తినేందుకు దానికి తెలియకుండానే అది గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేది.
అలా చాలాకాలం గడిచింది. కాలాంతరంలో ఆ చక్రవాక పక్షి ఆయువు తీరి మరణించింది.ఇతర పక్షులలాగా మరణానంతరం కూడా నరకయాతనలేవీ పడకుండా నేరుగా స్వర్గానికి చేరుకుంది.రెండు కల్పాలపాటు స్వర్గంలో ఆ పక్షి భోగాలను అనుభవించింది.ఆ తర్వాత భూలోకంలో ఓ రాజుగారి ఇంట మగశిశువుగా ఆ చక్రవాక పక్షి జన్మించింది.పెద్దలు ఆ శిశువుకు బృహద్రథుడు అని పేరు పెట్టారు.పెరిగి పెద్దయిన రాకుమారుడికి పెద్ద రాజు రాజ్యాభిషేకం కూడా చేశాడు. బృహద్రథుడికి త్రికాలజ్ఞత ఉండేది. భూత, భవిష్యత్తు వర్తమానాలు ఆయన కళ్లెదుట ఎప్పుడూ కనిపిస్తుండేవి.
బృహద్రథుడు ప్రజారంజకమైన పరిపాలకుడుగా పేరు తెచ్చుకొన్నాడు. యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉత్తముడిగా పెద్దలందరి చేత ప్రశంసలందుకున్నాడు.వీటన్నిటితోపాటు బృహద్రథుడికి పూర్వజన్మ జ్ఞాపకాలు ఉండేవి. అతడి త్రికాలజ్ఞత, పూర్వజన్మ స్మృతి లాంటివి ఆనాడు ఆనోటా ఆనోటా ప్రజల అందరికీ చేరాయి.గొప్ప గొప్ప మునులు సైతం ఆ రాజు మహత్తర శక్తికి ఆశ్చర్యపోతూ అంతటిశక్తి ఆయనకు ఎలా కలిగిందో తెలుసుకోవాలని ఉత్సాహపడుతుండేవారు. లాంటి మునులలో కొందరు పెద్దవారు ధైర్యం చేసి ఒక రోజు రాజు దగ్గరకు బయలుదేరారు. మునులందరి రాకను గమనించిన బృహద్రథుడు తాను రాజునన్న అహంకారభావాన్ని కొంచమైనా మనసులో పెట్టుకోక ఆ మునులకు ఎదురు వెళ్లి నమస్కరించి, పూజించి, అతిథి సత్కారాలను చేసి, ఉచితాసనాలను సమర్పించి సత్కరించాడు.యోగక్షేమపరామర్శలు అయ్యాక మునులు హద్రథుడికి త్రికాలజ్ఞత, పూర్వజన్మ స్మృతి
ఎలా కలిగాయో చెప్పమని అడిగారు.
***ప్రదక్షిణ ఫలితమే…
అప్పుడు బృహద్రథుడు ఎంతో వినయంగా, అందులో పెద్ద రహస్యమేమీ లేదని, తాను ఆ శక్తుల సాధనకోసం ప్రత్యేకించి చేసిన యజ్ఞయాగాలు, క్రతువులు కూడా ఏవీ లేవన్నాడు.ఆ మాటకు మునులకు ఆశ్చర్యం కలిగింది.వారి ఆశ్చర్యాన్ని గమనించి బృహద్రథుడుమళ్లీ చెప్పసాగాడు.గత జన్మలో తాను ఒక చక్రవాక పక్షినని ఆహారాన్వేషణలో తనకు తెలియకుండానే కాశీ మహానగరంలో ఉన్న అన్నపూర్ణాదేవి మందిరానికి ప్రదక్షిణం చేశానని చెప్పాడు. ఆ ఫలితమే తనకు ఎంతో పుణ్యాన్ని చేకూర్చి పెట్టి రెండు కల్పాలపాటు స్వర్గ సుఖాలను ఇచ్చి ఈ జన్మలో మహారాజయోగాన్ని కూడా కలగజేసిందన్నాడు. తనకు లభించిన శక్తులు, భోగాలు అన్నీ కాశీ అన్నపూర్ణాదేవి మందిరానికి చేసిన ప్రదక్షిణల ఫలితమేనని, జగదాంబ అయిన ఆ అన్నపూర్ణాదేవికి అంతటి మాహాత్మ్యం ఉందని బృహద్రథుడు చెప్పాడు. కాశీ అన్నపూర్ణావిశ్వేశ్వర స్వామి ఆలయ దర్శనం, ప్రదక్షిణ నమస్కారాలు ఎంతో విలువైనవి.కాశి నగరంలోని అన్నపూర్ణాదేవి గుడి చుట్టూ చేసిన ప్రదక్షిణల ప్రభావం ఎంత గొప్పదో ఈ కథ సూచిస్తుంది.కాశీ వెళ్లినప్పుడు తప్పకుండా విశ్వనాథ,అన్నపూర్ణమందిర ప్రదక్షిణం చేయండి.కాశీ మహానగరం ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. కాశీలో మరణించిన కుక్క కూడా స్వర్గానికే వెళుతుందన్నది నమ్మకం.కాశీ మహానగరంలో ఉండే అన్నపూర్ణమ్మ తల్లి, విశ్వేశ్వరుడు నమ్మిన భక్తులకు కొంగుబంగారం లాంటివారు.కాశీ నగర మహాత్మ్యాన్ని తెలిపే కథ ఒకటి దేవీభాగవతం పదకొండో స్కంధంలో కనిపిస్తుంది.స్వస్తి..!!ఓం నమః శివాయ..!!సర్వేజనా సుఖినో భవంతు.!
8. బెజవాడ ఇంద్రకీలాద్రిపై వరుణ యాగం
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి సస్యశ్యామలం కావాలన్న ఆకాంక్షతో విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై వరుణయాగం ప్రారంభమైంది. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఈవో కోటేశ్వరమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరుణయాగం ఇవాళ్టి నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు వైదిక కమిటీ సభ్యుడు శివప్రసాదశర్మ తెలిపారు. దుర్గా ఘాట్లో 22 వరకు ఉదయం 6నుంచి 8గంటల మధ్య దేవస్థానం వేద విద్యార్థులు, రుత్వికులు వరుణజపం, వరుణానుపాక, శతానువాక, విరాటపర్వ పారాయణ చేస్తారు. 23న ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మండపారాధనలు, దేవతామంత్ర హవనాలను రుత్వికులు నిర్వహిస్తారు. 24న ఉ దయం 6 నుంచి 11 గంటల వకు కృష్ణా జలంతో మల్లేశ్వరస్వామికి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య అభిషేకం చేస్తారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని యాగం తలపెట్టినట్టు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు సైతం ఈ యాగంలో పాల్గొనవచ్చని ఆయన సూచించారు.