ScienceAndTech

వీవో 5జీ ఫోను-5నిముషాల్లో 50శాతం ఛార్జింగ్

Vivo to release new 5G phone at 2019 MWC super quick charge

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ వివో తన తొలి 5జీ ఫోన్‌ను తీసుకురాబోతోంది. జూన్‌ 26 నుంచి 29 వరకు షాంఘైలో జరిగే ఎండబ్ల్యూసీ-2019 (మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌)లో దీన్ని ప్రదర్శించనుంది. ఈ ఏడాది జనవరిలో ఆవిష్కరించిన అపెక్స్‌-2019 కాన్సెప్ట్‌ ఫోన్‌నే ఇందులో ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు వివో 120W సూపర్‌ ఫ్లాష్‌ఛార్జ్‌ టెక్నాలజీని కూడా ఆవిష్కరించనుంది. ఇది 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీని కేవలం 13 నిమిషాల్లోనే ఛార్జ్‌ చేస్తుందని కంపెనీ చెబుతోంది. వివో తీసుకొస్తున్న ఈ ఫోన్‌ ప్రస్తుతం కాన్సెప్ట్‌ ఫోన్‌ మాత్రమే. దీనికి కాస్త అటు ఇటూగా మార్పులతో ఈ ఏడాది చివర్లో ఫోన్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. వివో అపెక్స్‌ 2019 ఫోన్‌లో డిస్‌ప్లేపై ఎక్కడా నాచ్‌గానీ, పంచ్‌ హోల్‌ గానీ ఉండదు. డ్యూయల్‌ కెమెరా కూడా వెనుక భాగంలో ఉంటుంది. ఛార్జింగ్‌కు సంబంధించిన హోల్స్‌ కూడా ఫోన్‌ వెనుక భాగంలో ఉంటాయి. 5జీతో వస్తున్న ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాన్‌ 855 ప్రాసెసర్‌, 256 జీబీ స్టోరేజీ, 12జీబీ ర్యామ్‌ ఉంటాయి. ఇక కంపెనీ చెబుతున్న సూపర్‌ ఫ్లాష్‌ ఛార్జ్‌ టెక్నాలజీని కూడా ఎండబ్ల్యూసీలోనే పరిచయం చేయనుంది. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ కలిగిన ఫోన్‌ను 5 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జ్‌ చేస్తుంది. పుల్‌బ్యాటరీని 13 నిమిషాల్లోనే ఛార్జ్‌ చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఇప్పటికే మరో చైనా కంపెనీ ఒప్పో సూపర్‌ వూక్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీని తీసుకొచ్చింది. ఇది 3,400 ఎంఏహెచ్‌ బ్యాటరీని కేవలం 35 నిమిషాల్లో ఛార్జ్‌ చేస్తుంది. దీంతో పోలిస్తే వివో కొత్త టెక్నాలజీ మరింత వేగంగా ఛార్జ్‌ చేస్తుందన్నమాట! మరిన్ని విషయాల కోసం ఎండబ్ల్యూసీ ఈవెంట్‌ వరకు వేచి చూడాల్సిందే!