Devotional

పూజారుల వేతనాలు పెంపు

Priests Salaries Hiked In Andhra Pradesh By Minister Vellampalli

1.పూజారుల వేతనాలు పెంపు–ఆద్యాత్మిక వార్తలు
అర్చకుల వేతనాలు పెంచుతూ తొలి సంతకం చేసిన దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు దేవాదాయ శాఖా మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఈ రోజు ఉదయం బాధ్యతలు స్వీకరించారు.. ఈ సందర్భంగా దేవాలయాల్లో అర్చకులకు 25 శాతం వేతనాలు పెంచుతూ తొలి సంతకం చేశారు. అదేవిధంగా దేవాదాయ శాఖలో ఉద్యోగుల ఇళ్ల నిర్మాణం, బదిలీల మార్గదర్శకాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దేవాలయాల్లో సంప్రదాయాలు, ఆచారాలు గౌరవించేలా విధానాలు రూపొందిస్తామన్నారు. సదావర్తి లాంటి దేవాలయాల భూములను కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారని ఆరోపించారు. తమ ప్రభుత్వం దేవాలయాల పరిరక్షణకు ఎల్లవేళలా పాటుపడుతుందని.. ఎవరైనా దేవాలయ భూములను కబ్జా చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని దేవాలయాల్లో ప్రస్తుతం ఉన్న పాలకమండళ్లను రద్దు చేసి కొత్త కమిటీలు నియమిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ వెల్లడించారు.
2.అపచారం .. పూరీ మహాలక్ష్మి ఆలయం లోపలి దృశ్యం చిత్రీకరణ
విశ్వ ప్రసిద్ధ పూరీ శ్రీక్షేత్రంలోని మహాలక్ష్మి మందిరం లోపలి దృశ్యం గురువారం సామాజిడి క మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చింది. దీనికి బాధ్యుడైన పట్రా సేవాయత్ను ఛతీస్తా నియోగుల సంఘం… విధుల నుంచి సస్పెండ్ చేసింది. మహాలక్ష్మి ఆలయం లోపల కొందరు సేవాయత్లు జంధ్యాలు వడుకుతున్న ఫొటోను సదరు పట్రా సేవకుడు స్మార్ట్ఫోన్లో చిత్రీకరించి ప్రచారంలోకి తీసుకురావడాన్ని సంఘం తీవ్రంగా పరిగణించింది. ఆయన్ని సస్పెండ్ చేసిన తర్వాత యంత్రాంగానికి విషయం తెలియజేసింది. శ్రీక్షేత్రంలో కెమేరాలు, చరవాణులు నిషేధం. ఎలాంటి దృశ్యాలూ చిత్రీకరించకూడదు. ఆలయ అధికారులు, సిబ్బంది, సేవాయత్లకూ ఇది వర్తిస్తుంది. ఇటీవల కాలంలో శ్రీక్షేత్రం లోపలి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లోకి వస్తుండడంతో యంత్రాంగం మరోసారి హెచ్చరికలు జారీచేసింది. చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని స్పష్టం చేసింది. స్వామి సేవల్లో అధిక సమయం సేవాయత్లు ఆలయంలోనే ఉంటారు. ఫొటోలు తీసే వీలులేని సాధారణ ఫోన్లను వారికి ఉచితంగా పంపిణీ చేస్తామని లోగడ ఆలయ పాలనాధికారి ప్రదీప్తకుమార్ మహాపాత్ర చెప్పారు. పాలనాధికారి ఆదేశాలను ఖాతరు చేయని కొందరు సేవాయత్లు స్మార్ట్ఫోన్లను వెంట తీసుకెళుతున్నారు. మరికొందరు భద్రతా సిబ్బందిదీ అదే తీరు.
3. నేడు యాదాద్రిలో సుదర్శన నారసింహ హోమం
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు విజయవంతం కావాలంటూ.. శుక్రవారం సుదర్శన నారసింహ హోమం జరిపేందుకు యాదాద్రి దేవస్థానం సిద్ధమైంది. ప్రాజెక్టు ప్రారంభోత్సవ శుభ సందర్భంతో పాటు, తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారిణి గీతారెడ్డి తెలిపారు.
4. వైభవోపేతంగా మహంకాళి బోనాలు
ఉజ్జయిని మహంకాళి ఆషాడ బోనాల జాతరను వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. జూలై 21, 22 తేదీల్లో రెండు రోజులపాటు జాతర జరుగుతుందని, అన్ని రకాల ఏర్పాట్లు చేసి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామన్నారు. గురువారం దేవాలయ ఆవరణలో బోనాల పండుగ ఏర్పాట్లపై పలు శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయ ఆవరణ, పరిసరాల్లో పర్యటించిన ఆయన, చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. తదనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నదని, ఆషాడ బోనాల పండుగ దేశంలోనే కాకుండా, విదేశాల్లో సైతం ప్రఖ్యాతిగాంచిందన్నారు. బోనాల జాతరలో పాల్గొనేందుకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. చిన్న చిన్న ఆలయాలు, దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. బోనాల జాతర కోసం జీహెచ్ఎంసీ నుంచి రూ.27 కోట్లను ఖర్చు చేయనున్నామని, ఈ నిధులతో రోడ్లు, ఫుట్పాత్లు, విద్యుత్ దీపాల ఏర్పాట్లను చేయనున్నామన్నారు. ఆలయ పరిసరాల్లో ఫ్లడ్లైట్లు, పటిష్టమైన బారీకేడింగ్ చేయించనున్నామన్నారు.
5. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా నియమిస్తూ, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఉదయం సంతకం చేశారు. ఆయన నియామకపు ఉత్తర్వులు కొద్దిసేపటి క్రితం వెలువడ్డాయి. నేడు కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరే ముందు వైవీకి కీలక పదవిని ఇస్తూ, జగన్ పత్రాలపై సంతకం చేశారు. ఆ వెంటనే నియమకపు ఉత్తర్వులు టీడీపీ ఈఓ అనిల్ సింఘాల్ కు అధికారులు ఫ్యాక్స్ ద్వారా పంపారు. ఆ పదవిలో కొనసాగుతున్న టీడీపీ నాయకుడు పుట్టా సుధాకర్ యాదవ్, రెండు రోజుల క్రితం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా, రేపు ఉదయం 11 గంటలకు శ్రీవారి సమక్షంలో వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరో నాలుగైదు రోజుల్లో పూర్తి స్థాయిలో పాలకమండలి ఏర్పడుతుందని, సభ్యులుగా ఎవరిని నియమించాలన్న విషయాన్ని జగన్ స్వయంగా పరిశీలిస్తున్నారని వైసీపీ వర్గాలు తెలిపాయి.
6. శుభమస్తుతేది : 21, జూన్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : శుక్రవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : చవితి
(నిన్న సాయంత్రం 5 గం॥ 12 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 7 గం॥ 10 ని॥ వరకు)
నక్షత్రం : శ్రవణము
(నిన్న సాయంత్రం 3 గం॥ 43 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 6 గం॥ 16 ని॥ వరకు)
యోగము : వైదృతి
కరణం : బవ
వర్జ్యం : (ఈరోజు రాత్రి 10 గం॥ 45 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 32 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 6 గం॥ 45 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 31 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 20 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 12 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 12 గం॥ 43 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 35 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 38 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 16 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 20 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 58 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 34 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 12 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 42 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 52 ని॥ లకు
సూర్యరాశి : మిథునము
చంద్రరాశి : మకరము
7. చరిత్రలో ఈ రో/జూన్ 21*జోసెఫ్ ఫోరియర్
*ప్రపంచ సంగీత దినోత్సవం*
1527 : తత్వవేత్త, రచయిత మరియు ఇటలీకి చెందిన రాజకీయవేత్త మాకియవెలీ మరణం(జ.1469).
1768 : ఫ్రాన్సు కు చెందిన భౌతిక మరియు గణిత శాస్త్రవేత్త జోసెఫ్ ఫోరియర్ జననం(మ.1830).
1940 : హిందూ జాతీయవాద సంస్థ అయినటువంటి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్.యస్.యస్.) వ్యవస్థాపకుడు కె.బి.హెడ్గేవార్ మరణం(జ.1889).
1948 : చక్రవర్తి రాజగోపాలాచారి భారతదేశానికి చివరి గవర్నరు జనరల్ గా నియమితుడైనాడు.
1953 : పాకిస్తాన్ యొక్క మొదటి మరియు నేటి వరకు ఏకైక మహిళా ప్రధాన మంత్రి బెనజీర్ భుట్టో జననం(మ.2007).
2011 : తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ మరణం (జ.1934).
2015 : ప్రపంచ యోగ దినం
8. రేపు బాధ్యతలు స్వీకరించనున్న వైవీ సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, లోక్‌సభ మాజీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి శనివారం ఉదయం 11 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. వైవీ సుబ్బారెడ్డి గత లోక్‌సభలో ఒంగోలు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో జరిగిన పోరాటంలో వైవీ పార్టీ తరపున అగ్రభాగాన నిలిచారు. చివరకు సహచర ఎంపీలతో పాటుగా పదవీ త్యాగం చేశారు. 2019 ఎన్నికల్లో పార్టీ అంతర్గతంగా జరిగిన సర్దుబాట్ల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఒంగోలు స్థానం నుంచి పోటీ చేయకుండా ఉండి పోయారు. కాగా టీటీడీ బోర్డు చైర్మథన్‌ పదవికి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ చేసిన రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఆమోదించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి మన్మోహన్‌ సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.