Politics

బ్యాంకు రుణాలు చెల్లించలేదు. ఆస్తులు వేలం వేస్తున్నారు.

Actor Politician Vijayakanth Assets To Be Auctioned By Banks For Not Repaying Loans

బ్యాంకు రుణాలు సక్రమంగా చెల్లించకపోవడంతో డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌, ఆయన సతీమణి ప్రేమలత ఆస్తులను వేలం వేయనున్నట్టు ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు ప్రకటించింది. దీంతో డీఎండీకే కార్యకర్తలు దిగ్భ్రాంతికి గురయ్యారు. కాంచీపురం జిల్లా మామండూర్‌లో 4,38,956 చదరపు అడుగల విస్తీర్ణంలోని శ్రీ ఆండాళ్‌ అళగర్‌ కళాశాల, చెన్నై సాలిగ్రామంలోని 3013 చదరపు అడుగుల నివాసం పేరిట ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకులో డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ రుణం పొందారు. ఇందుకు ఆయనతో పాటు సతీమణి, డీఎండీకే కోశాధికారి ప్రేమలత ష్యూరిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రూ.5,52,73,825 రుణబాకీ ఉన్నారని, దీనికి సంబంధించిన వడ్డీ, ఇతర బాకీలు సక్రమంగా చెల్లించకపోవడంతో వారి ఆస్తులు వేలం వేస్తున్నట్టు ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు ప్రకటించింది. ఇ-వేలం ప్రకటనను శుక్రవారం దినపత్రికల్లో విడుదల చేసింది. జులై 26న శ్రీ ఆండాళ్‌ అళగర్‌ కళాశాల, సాలిగ్రామంలోని నివాసాలను వేలం ద్వారా విక్రయించనున్నట్టు తెలిపింది. కళాశాలను రూ.92,05,05,051, సాలిగ్రామం నివాసాన్ని రూ.3,04,34,344, సాలిగ్రామం వేదవళ్లివీధిలో 4651 చదరపు అడుగుల్లోని మరో నివాసాన్ని రూ.4,25,84,849ల నుంచి పాట ప్రారంభించనుంది. ఇదిలా ఉండగా విజయకాంత్‌ ఆస్తులు వేలానికి వచ్చినట్టు దినపత్రికలు ద్వారా తెలసుకున్న డీఎండీకే నిర్వాహకులు, కార్యకర్తలు దిగ్భ్రాంతికి గురయ్యారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయకాంత్‌ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ కార్యకర్తలను కలుసుకోకపోవడం గమనార్హం.
ఆస్తులను కాపాడుకుంటాం: ప్రేమలత
కెప్టెన్‌ ఆస్తులు కాపాడుకుంటామని విజయకాంత్‌ సతీమణి ప్రేమలత తెలిపారు. వేలం వ్యవహారంపై ప్రేమలత, ఆమె సోదరుడు, పార్టీ ఉప ప్రధానకార్యదర్శి ఎల్కే సుదీశ్‌ సంయక్తంగా విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో పలు ఇంజినీరింగ్‌ కళాశాలలు రుణభారంలోనే ఉన్నాయన్నారు. 20ఏళ్లుగా నిర్వహిస్తున్న తమ కళాశాల అభివృద్ధి కోసం రుణం పొందామని తెలిపారు. అందులో రూ.కోట్ల మేరకు చెల్లించాల్సి ఉండగా గడువు కోరామని పేర్కొన్నారు. అందుకు బ్యాంకు అధికారులు నిరాకరించారని, అందువల్లే వేలం వేయడానికి చర్యలు చేపట్టారని తెలిపారు. రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్‌ కళాశాలలకు ఏర్పడిన పరిస్థితే ప్రస్తుతం అండాళ్‌ అళగర్‌ కళాశాలకు ఏర్పడిందని, నిజాయతీపరులకు కష్టాలు తప్పవని పేర్కొన్నారు. వాటి నుంచి బయటపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయకాంత్‌ సినిమాలలో నటించడం లేదని, కల్యాణమండపం కూడా కూల్చివేయడంతో చాలినమేరకు ఆదాయం లేదని వివరించారు. రుణాన్ని ఆయా దశల్లో చెల్లిస్తూనే వచ్చామని, త్వరలో పూర్తిగా రుణాన్ని చెల్లించి కళాశాలను కాపాడుకుంటామని తెలిపారు. కళాశాలను కొనసాగిస్తామని, రుణ వ్యవహారాన్ని చట్టపరంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు.