Movies

అమ్రిష్‌పూరీకి గూగుల్ ఘననివాళి

Google Doodle Tribute To Yester Years Actor Amrishpuri

లెజండరీ నటుడు అమ్రిష్‌ పురి జయంతి నేడు. ఈ సందర్భంగా ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ ఆయనను గుర్తు చేసుకుంది. అమ్రిష్‌ పురి ఫొటోతో ప్రత్యేక డూడుల్‌ తయారుచేసి ఆయనకు నివాళులర్పించింది. ‘చెడు వ్యక్తిలా చాలా గొప్పగా నటించే కళాత్మకమైన నటుడు ఈయనే’ అని గూగుల్‌ ఇండియా ట్వీట్‌ చేసింది. ‘ఒకసారి విజయం సాధించకపోతే.. మళ్లీ మళ్లీ ప్రయత్నించండి. అప్పుడు మీ జీవితం కూడా ప్రముఖ నటుడు అమ్రిష్‌ పురిలా ఉంటుంది. వెండి తెరపై ఆయన కలను సాకారం చేసుకునేందుకు తొలి నాళ్లలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు’ అని గూగుల్‌ తన పోస్టులో పేర్కొంది. 1932లో పంజాబ్‌లో జన్మించిన అమ్రిష్‌ పురి తన 39వ ఏట సినిమాల్లో అడుగుపెట్టారు. అనేక సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలే పోషించిన అమ్రిష్‌.. తెలుగు సినీ చరిత్రలో గొప్ప విలన్‌గా గుర్తుండిపోయారు. 1954లో ఓ సినిమాలో లీడ్‌ రోల్‌కు అమ్రిష్‌ పురిని తొలుత అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ పాత్ర నుంచి తప్పించారు. చాలా కాలం పాటు డబ్బింగ్‌ చెప్పిన అమ్రిష్‌.. 1971లో రేష్మ ఔర్‌ షెరా సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. హిందీతో పాటు, తెలుగు, తమిళ, మరాఠీ, కన్నడ, పంజాబీ, మలయాళీ భాషల్లో దాదాపు 400లకు పైగా చిత్రాల్లో నటించారు. హాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాల్లో నటించారు. ‘అమ్రిష్‌ పురి నా ఫేవరెట్‌ విలన్‌’ అని హాలీవుడ్‌ డైరెక్టర్‌ స్టీవెన్‌ స్పిల్‌బర్గ్‌ చెప్పడం విశేషం. తెలుగులో ఆయన మేజర్‌ చంద్రకాంత్‌, నిప్పురవ్వ, జగదేకవీరుడు అతిలోక సుందరి, అశ్వమేధం, ఆఖరి పోరాటం తదితర చిత్రాల్లో నటించారు. అనారోగ్యంతో 2005లో అమ్రిష్‌ కన్నుమూశారు.