WorldWonders

హిమాలయాలు సాగరంలో కరిగిపోతున్నాయి

Himalayas Are Melting At Faster Pace-21st Century In Big Problem

వాతావరణ మార్పుల కారణంగా ఏటికేడు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు హిమాలయ పర్వతాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 21వ శతాబ్దం మొదలుకుని హిమాలయ పర్వతాల్లోని హిమానీనదాలు రెట్టింపు వేగంతో కరిగిపోతున్నాయని తాజా పరిశోధన వెల్లడించింది. ఏటా అడుగున్నర ఎత్తున ఇవి కరిగిపోతున్నాయని, భవిష్యత్తులో భారత్ సహా కోట్ల మంది నీటికొరతతో ఇబ్బంది పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 1975-2000తో పోలిస్తే 2000 తరువాత రెట్టింపు స్థాయిలో ఏటా మంచు కరిగిపోతోందని తేల్చింది. భారత్, చైనా, నేపాల్, భూటాన్ మీదుగా వ్యాపించిన హిమాలయ పర్వతాలపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని పరిశోధకులు అధ్యయనం చేశారు. తూర్పు నుంచి పశ్చిమం వరకు 2000 కి.మీ పరిధిలో విస్తరించిన 650 హిమఖండాల ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించారు. అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ ఇటీవల విడుదల చేసిన ఒకప్పటి రహస్య ఉపగ్రహ ఛాయాచిత్రాలు సహా మొత్తం 40 ఏళ్ల ఉపగ్రహ చిత్రాలను అధ్యయనం చేశారు. వాతావరణ మార్పుల వల్ల హిమానీనదాలు కరిగిపోతున్నాయని తేల్చారు. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన పీహెచ్డీ విద్యార్థి జోషువా మౌరెర్ నేతృత్వంలో నిర్వహించిన పరిశోధన ఫలితాలు ‘సైన్స్ అడ్వాన్సెస్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
* ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్న 1975-2000 వరకు ఏటా 0.25 మీటర్ల మేర మంచు కరిగింది. 1990 నుంచి ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభించింది మొదలు 2000 తరువాత ఈ కరుగుదల వేగం పుంజుకుని ఏటా అర మీటరు మంచు కరుగుతోంది.
* ఇటీవల హిమానీనదాలు నుంచి ఏటా 8 బిలియన్ టన్నుల నీరు వస్తోంది. ఇది 32 లక్షల ఒలింపిక్ సైజు స్విమ్మింగ్ పూల్స్తో సమానం.
* ఆసియా దేశాల్లో మునుపెన్నడూ లేనంతగా శిలాజ ఇంధనాలు, బయోమాస్ వాడకం పెరిగింది. వీటి కారణంగా హిమానీనదాలు ఎక్కువగా సౌరశక్తి ప్రతాపానికి గురై, కరిగిపోతున్నాయి.
* ఆసియాలోని పామీర్, హిందూ కుష్ లేదా టియాన్ షాన్లపై పరిశోధకులు అధ్యయనం చేయలేదు. కానీ ఇక్కడా హిమానీనదాలు కరుగుతున్నాయని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి.
* హిమాలయాల నుంచి వచ్చే నీటిపై ఆధారపడి సుమారు 80కోట్ల మంది జీవిస్తున్నారు. సాగు-తాగు నీరు, జలవిద్యుచ్ఛక్తికి ఇదే ప్రధానం.