Business

BSNL నుండి మూడు ఉచిత హాట్‌స్టార్ ఛానెళ్లు

BSNL Offers Three Free HotStar Channels For Its Customers

ప్రపంచకప్‌ సంబరాల్లో మునిగి తేలుతున్న క్రికెట్‌ ప్రేమికులకు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ తీపికబురు అందించింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌స్టార్‌ 300 ప్లాన్‌తో మూడు హాట్ స్టార్‌ ఛానళ్లను ఉచితంగా సబ్‌స్క్రైబ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో ఏడాది పాటు హాట్‌స్టార్‌లో ప్రసారమయ్యే మూడు ఛానళ్లను ఉచితంగా వీక్షించే వెసులుబాటు ఉంటుంది. ఈ ప్లాన్‌లో భాగంగా రూ.749తో రీఛార్జ్‌ చేసుకుంటే 50 ఎంబీపీఎస్‌ వేగంతో నెలకు 300జీబీ డేటా ఇస్తారు. అయితే బీఎస్‌ఎన్‌ఎల్‌ తీసుకున్న తాజా నిర్ణయంతో వినియోగదారులు ఈ ప్లాన్‌లోకి మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సంస్థ యాజమాన్యం భావిస్తోంది. ఐసీసీ క్రికెట్‌ ప్రపంచకప్‌ అధికారిక స్ట్రీమింగ్ భాగస్వామిగా హాట్‌స్టార్‌ ఉన్న సంగతి తెలిసిందే. ‘‘ ఈ మధ్య కాలంలో క్రికెట్‌ మ్యాచ్‌లన్నీ ఎక్కువగా మొబైల్స్‌లోనూ, ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌, స్మార్ట్‌ టీవీల్లోనే చూస్తున్నారు. దీనికి డేటా వేగం ఎక్కువగా ఉండాలి. దేశ వ్యాప్తంగా క్రికెట్‌ వేడి రాజుకుంటున్న సమయంలో హాట్‌స్టార్‌తో ఒప్పందం కుదర్చుకోవడం సంతోషంగా ఉంది. సూపర్‌స్టార్‌ 300 వినియోగదారులకు మరిన్ని చక్కనైన సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ అనుపమ్‌ శ్రీవాత్సవ మీడియాకు తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇలాంటి ఆఫర్లు ప్రకటించడం కొత్తేం కాదు. ఇది వరకే కొద్ది మంది వినియోగదారులకు ఉచిత అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యత్వం కల్పిస్తూ గతంలో నిర్ణయం తీసుకుంది. ఇతర టెలికం నెట్‌వర్క్‌లు కూడా ఇటీవల కాలంలో వినియోగదారులను ఆకర్షించేందుకు ఇలాంటి ఆఫర్లే ప్రకటిస్తున్నాయి.