ScienceAndTech

ఇక టైర్లు పంచరు కావు

GM And Michellin Aiming To Deliver Puncture Less Tires By 2024

అసలు గాలితో పనే లేని, పంచర్‌ పడే ప్రమాదం లేని ‘గాలి లేని టైర్ల’ను తయారు చేసే పనిలో నిమగ్నమై ఉందీ ఫ్రాన్స్‌ కంపెనీ. ఇప్పటికే ఇటువంటి టైర్లను తయారు చేసి ప్రయోగాత్మక పరీక్షలు కూడా జరుపుతోంది. అమెరికాకు చెందిన జనరల్‌ మోటార్స్‌ (జీఎం)తో జట్టు కట్టి విస్తృత స్థాయిలో జరుపుతున్న ఈ పరీక్షలు సత్ఫలితాలిస్తే 2024 నాటికి ఈ సరికొత్త టైర్లు మార్కెట్లో రాజ్యమేలతాయి. అదే జరిగితే ప్రపంచ వాహన రంగంలో అదొక అద్భుతమే అవుతుంది. జనరల్‌ మోటార్స్‌కు చెందిన ‘జీఎం బోల్ట్‌’ విద్యుత్తు కార్లకు తాను తయారు చేసిన గాలి అవసరం లేని టైర్లను బిగించి మిషెలిన్‌ ఈ ప్రయోగాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న టైర్లతో ప్రయాణం ఎంత సౌకర్యంగా ఉంటుందో, అంతే సౌకర్యం ఈ కొత్త రకం టైర్లతోనూ ఉంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ టైర్లకు అప్‌టిస్‌ (యునీక్‌ పంక్చర్‌ ఫ్రూఫ్‌ టైర్‌ సిస్టమ్‌) అని పేరు పెట్టారు. కారు లేదా మోటార్‌సైకిల్‌ చక్రానికి చువ్వలు (స్పోక్స్‌) ఎలా ఉంటాయో… అదే తరహాలో ఈ టైర్లకు గాలి ఉండాల్సిన ప్రదేశంలో చువ్వల మాదిరి అమరిక ఉంటుంది. ఎంత ఒత్తిడిని అయినా తట్టుకునే విధంగా ఈ ఏర్పాటు ఉంటుంది. గోల్ప్‌ కార్ట్‌లలోనో లేక పెద్దపెద్ద మాల్స్‌లో వస్తువులను అటూఇటూ మోసే యంత్రాలకు ఉండే పూర్తిగా రబ్బరుతో తయారు చేసిన టైర్ల మాదిరిగా ఇవి ఉండవు. ఎంతో వేగంతో ప్రయాణించే కార్లు, ట్రక్కుల చక్రాలకు వాడాలి కాబట్టి… ‘అప్‌టిస్‌’ టైర్ల తయారీకి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, పదార్ధాలను వినియోగించాల్సి ఉంటుంది. ‘అప్‌టిస్‌’ టైర్లు చక్రంలో కలిపి ఉంటాయి. చక్రం, టైరు కలిసి ఒకటే అమరిక. టైర్‌తో కూడిన చక్రాన్ని నేరుగా కారుకు బిగించటమే ఉంటుంది. అల్యూమినియం, కార్బన్‌, రబ్బరు… తదితర పదార్ధాలను ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు. టైర్‌ పంచర్‌ పడి లేదా పేలిపోయి జరిగే వాహన ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు, మరెంతో మంది గాయాల పాలవుతున్నారు. వీటన్నింటికీ ‘అప్‌టిస్‌’ టైరు పరిష్కారం చూపుతుందని భావిస్తున్నారు. అంతేగాక స్పేర్‌ టైర్‌/స్టెఫ్నీ, దాన్ని బిగించటానికి ఒక జాకీ, ఇతర ఉపకరణాలు కూడా అవసరం లేదు. ఆమేరకు కారులో బరువు తగ్గి మైలేజీ కూడా పెరుగుతుంది. మొదట్లో ట్యూబు టైర్లు వచ్చాయి. వేగంగా వెళ్తున్నప్పుడు ట్యూబు పేలిపోయి వాహనం ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. ఆ తర్వాత ట్యూబు లేని టైర్ల వాడకం పెరిగింది. ఇవి కొంత నయం. గాలిపోయినా టైరు పేలదు కాబట్టి ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడవచ్చు. భవిష్యత్తులో అసలు గాలి లేని టైర్లు వస్తే ఈ సమస్యలు కూడా దూరమైపోతాయని వాహన నిపుణులు అంటున్నారు.