WorldWonders

సిడ్నీ విమానాశ్రయంలో పర్సు కోట్టేసిన ఎయిరిండియా డైరక్టర్

Air India Suspends Director Who Stole Wallet From A Store In Sydney Airport

ఆస్ట్రేలియాలోని సిడ్నీ విమానాశ్రయంలో ఉన్న ఓ దుకాణంలో చోరీ చేసిన ఆరోపణల కింద ఎయిర్‌ ఇండియా విమానయాన సంస్థ.. తమ సీనియర్‌ పైలట్‌ రోహిత్‌ భాసిన్‌ను సస్పెండ్‌ చేసింది. AI 301 విమాన పైలట్‌గా ఆయన ఉన్నారు. శనివారం ఉదయం 10.45 గంటలకు సిడ్నీ విమానాశ్రయం నుంచి దిల్లీకి ఆ విమానం బయల్దేరాల్సి ఉంది. అంతకు ముందు ఆయన ఈ చోరీ చేశారు. ‘‘కెప్టెన్‌ రోహిత్‌ తూర్పు రీజనల్ డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్నారు. సిడ్నీలోని ఓ దుకాణం నుంచి ఆయన ఓ వాలెట్‌ను చోరీ చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై మా సంస్థ విచారణ ప్రారంభించింది. ఆయనను సస్పెన్షన్‌లో ఉంచింది’’ అని ఆ విమానయాన సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ‘‘AI 301 విమానం బయల్దేరే ముందు మీరు చోరీ చేశారని ఆస్ట్రేలియా ప్రాంతీయ మేనేజర్‌ నుంచి మాకు సమాచారం అందింది. దీనిపై విచారణ జరుపుతున్నాం. దీంతో వెంటనే మిమ్మల్ని సస్పెండ్‌ చేస్తున్నాం’’ అని ఆ పైలట్‌కు ఇచ్చిన నోటీసుల్లో ఎయిర్‌ ఇండియా పేర్కొంది. ‘‘ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్న సిబ్బంది ప్రవర్తన సరైన రీతిలో ఉండాలన్న విషయానికి మేము ప్రాధాన్యతనిస్తాం. నేరపూరిత చర్యలకు పాల్పడితే ఉపేక్షించబోము’’ అని ఆ సంస్థ ప్రతినిధి అన్నారు. కాగా, ఇటీవల ఎయిర్‌ ఇండియాకు చెందిన ఓ పైలట్‌.. టిఫిన్‌ బాక్సులో తెచ్చుకున్న ఆహారం తిని.. అనంతరం టిఫిన్‌ బాక్సును కడగాలని సిబ్బందిని కోరగా గొడవ చెలరేగిన విషయం తెలిసిందే. AI 772 విమానం బెంగళూరు నుంచి కోల్‌కతాకి వెళ్లాల్సి ఉండగా, ఆ గొడవ కారణంగా దాదాపు రెండు గంటలు ఆలస్యంగా విమానం బయలుదేరింది. ఆ పైలట్‌ చర్యను మర్చిపోకముందే ఇదే విమానయాన సంస్థ పైలట్ ఇటువంటి చర్యకు పాల్పడ్డారు.