Movies

శరణార్థులపై వ్యాసాలు

Angelina Jolie To Contribute For TIME Magazine On Refugees

హాలీవుడ్‌ నటి ఏంజెలినా జోలీకి సరికొత్త అవకాశం లభించింది. ప్రముఖ టైమ్‌ మ్యాగజైన్‌ జోలీని తమ కంట్రిబ్యూటింగ్‌ ఎడిటర్‌గా ప్రకటించింది. ఇక నుంచి ప్రతినెల ఆమె శరణార్థులపైన వ్యాసాలు రాయనున్నారు. ఆమె మొదటి వ్యాసం ‘శరణార్థులకు మనం ఎలా రుణపడి ఉన్నాం’ అనే పేరుతో టైమ్‌ ఆన్‌లైన్‌ సైట్లో బుధవారం ప్రచురితమైంది. జులై 1న విడుదలయ్యే మ్యాగజైన్‌లో అందరూ దాన్ని చూడవచ్చు. మనుషులు ప్రతి ఒక్కరూ గౌరవంగా, అందరితో సమానంగా జీవించేందుకు అర్హులని ఆమె వ్యాసంలో పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం శరణార్థులను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అందులో వెల్లడించారు. ఈ సందర్భంగా టైమ్‌ సీఈఓ ఎడ్వర్డ్‌ ఫెల్సెంతల్‌ మాట్లాడుతూ.. జోలీ 18 సంవత్సరాలుగా ఐక్యరాజ్యసమితి శరణార్థుల కమిషన్‌లో పని చేసిన అనుభవంతో ఆమె రాయగలరని పేర్కొన్నారు. జోలీ 2010లో యూఎన్‌ శరణార్థి కమిషన్‌ ప్రత్యేక రాయబారిగా నియమితులయ్యారు. ఇందులో భాగంగా ఆమె పెరూ, బంగ్లాదేశ్‌, కొలంబియా తదితర దేశాల్లో శరణార్థులకు మద్ధతుగా 60కిపైగా కార్యక్రమాలు నిర్వహించారు.