Fashion

అసలు ఈకాలం ఫ్యాషన్ మొత్తం జాకెట్లదే

Blouse Fashion Is The Newest Trend In Market

ఆమె నడుచుకుంటూ వెళ్తుంటే నడుముపైన పల్లకీల ఊరేగింపు కదిలినట్లుంటుంది. ఆ వీపు మీద ఆలయ శిఖరం అందంగా అతుక్కుపోయిందా అనిపిస్తుంది. ఇక, ఆమె వయ్యారంగా పక్కకు తిరిగితే ఆ భుజం మీద వేలాడే నగల తళుకులు చెక్కిలి మెరుపులకు పోటీ వచ్చినట్లే. ఇదేదో జవరాలికోసం జతగాడు రాసిన కవితేమో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే, ఈ వర్ణనలు కొత్తతరం అమ్మాయిలు వేసుకుంటున్న సరికొత్త జాకెట్ల ముచ్చట్లు. రవికల ఫ్యాషన్‌లో 2018లో వచ్చినన్ని సోకులు మునుపెన్నడూ రాలేదుమరి! పట్టు, ఫ్యాన్సీ, క్రేప్‌… జర్దోసీ, చమ్కీ వర్కు, పెయింటింగ్‌… చీరేదైనా వాటిమీద ఎన్నిరకాల డిజైన్లు వచ్చినా జాకెట్టులో మాత్రం పెద్ద తేడా ఉండేది కాదు ఒకప్పుడు. కానీ ఇపుడు హవా అంతా జాకెట్లదే. చీరకు మ్యాచింగ్‌ రవిక అన్నది పోయి చీర అందాన్ని పెంచేది జాకెట్టు అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. చీరకట్టు… పదహారణాల తెలుగుదనానికి ప్రతీక. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు రూపం. ఎన్నిరకాల ఆధునిక దుస్తులున్నా చీర అందం చీరదే. అందుకే, కొత్త ఫ్యాషన్లు ఎన్ని వచ్చినా చంటిగాడు లోకల్‌ అన్నట్లూ చీర స్థానం ఎప్పుడూ పదిలమే. కానీ ఎప్పటికపుడు అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌లు కోరుకునే ఈతరం అమ్మాయిలు డిజైనర్‌ బ్లౌజుల రూపంలో చీరకూ కొత్త ఫీచర్లు అద్దడం మొదలుపెట్టారు. అలా హెవీ ఎంబ్రాయిడరీ జాకెట్లు రంగంలోకి దిగాయి. మొదట్లో పువ్వులూ ఏనుగుల్లాంటి వాటిని జాకెట్ల మీద ఎంబ్రాయిడరీ చేసి మధ్యమధ్యలో కుందన్లనూ మెరుపు రాళ్లనూ అంటించేవారు. తర్వాత వాటి స్థానంలోకి దేవతా మూర్తుల రూపాలు వచ్చి చేరాయి. వేంకటేశ్వర స్వామి, వినాయకుడు, బృందావనంలోని కృష్ణుడి ఫొటోలనే తెచ్చి వీపు మీద అంటించారా అన్నంతగా అచ్చుగుద్దినట్లూ చేసే ఈ ఎంబ్రాయిడరీ పనితనం చూస్తే ఎవరైనా వీపువైపు చూస్తుండిపోవాల్సిందే. చెయ్యెత్తి దండం పెట్టాల్సిందే.


ఫలానావారి పెండ్లిపిలుపు అంటూ వధూవరుల ఫొటోలను కళ్యాణ మండపం బయట పెట్టడం తెలిసిందే. ఇప్పుడవి అమ్మాయిల వీపు మీదా దర్శనమిస్తున్నాయి. ఇది ఫొటో జాకెట్ల ఫ్యాషన్‌ మరి. వధూవరుల ఫొటోలను జాకెట్ల మీద ప్రింట్‌ లేదా పెయింటింగ్‌ వేయించీ ఎంబ్రాయిడరీ చేయించీ వస్తున్న ఈ జాకెట్లు కూడా చూడ్డానికి ప్రత్యేకంగా ఉంటున్నాయి. ఇక, ఒకప్పుడు పెళ్లిళ్లలో పెళ్లికూతుర్ని పల్లకీలో తీసుకెళ్లడం ఓ మధుర ఘట్టం. ఆ జ్ఞాపకాలూ అందంగా జాకెట్లమీదికి ఎక్కేస్తున్నాయిప్పుడు. మెరిసే దారాలతో వీపు వెనక భాగంలో చూడచక్కగా కుట్టే ఈ పల్లకీల ఊరేగింపు సరికొత్త ఫ్యాషన్‌గా బాగా క్లిక్‌ అయింది. మిగిలిన జాకెట్ల డిజైన్ల సంగతేమో గానీ జ్యువెల్‌ ఎంబ్రాయిడరీ బ్లౌజులైతే మగవారికి తెగ నచ్చేస్తున్నాయట. వీటి పుణ్యమా అని వాళ్లకు బంగారు నగల్ని కొనే ఖర్చు తగ్గిందన్నది వారి ఆనందమట. అచ్చంగా అసలైన నెక్లెసులూ అరవంకీలూ చెవిదుద్దులను జాకెట్టు మీద వేలాడదీసినట్లూ ఎంబ్రాయిడరీ చేస్తున్న ఈ రవికలు వేసుకుంటే ఒంటిమీద బంగారు నగలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు మరి. రంగురంగుల రాళ్లూ మెరుపు దారాలతో బంగరు హారాలూ రాళ్ల నెక్లెసుల్ని తలదన్నేలా చేస్తున్న ఆ ఎంబ్రాయిడరీ జాకెట్లు వేసుకుని ముద్దుగుమ్మలు నడిచొస్తుంటే పుత్తడి బొమ్మల్లా ఎంతందంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్నట్లూ వీపు వెనక భాగంలో ముత్యాల దండలు వేలాడదీసి ఉండే రవికలు జ్యువెల్‌ బ్లౌజుల్లో మరోరకం. వీటిని వేసుకుంటే ఎంచక్కా వీపునీ గొలుసులతో సింగారించొచ్చు. పెళ్లిళ్లూ ఫంక్షన్లకే కాదండోయ్‌ పండుగలూ పేరంటాలూ వ్రతాలక్కూడా ప్రత్యేకంగా రవికల్ని డిజైన్‌ చేస్తున్నారు. ఆలయ గోపురాల మాదిరి ఎంబ్రాయిడరీ చేస్తున్న టెంపుల్‌ బ్లౌజులు ఆ తరహావే. వీటితో పాటు దేవతా మూర్తులున్నవి కూడా పూజా కార్యక్రమాలకు బాగుంటాయి. జాకెట్లలో వస్తున్న కొత్త ట్రెండ్‌ల గురించి చెప్పాలంటే పెద్ద చరిత్రే అవుతుంది. రోజువారీ దుస్తులుగా సౌకర్యంగా ఉండే చుడీదార్లూ జీన్సులూ వేసుకునే అమ్మాయిలు ఒక్కసారే ఫంక్షన్ల సమయంలో బాగా వర్కు చేసిన చీరల్ని కట్టుకోవాలంటే ఇబ్బందే. బరువుండే వాటితో నడవడమూ కష్టమే. అదే జాకెట్టైతే చిన్నగా ఉంటుంది కాబట్టి ఎంత వర్కు చేసినా ఎంచక్కా తొడిగేసుకోవచ్చు. పైగా చీరకన్నా జాకెట్‌లో బోలెడన్ని ఫ్యాషన్లను సృష్టించొచ్చు, వేసుకోవచ్చు. అలా అటు అందంగా ఇటు సౌకర్యంగా సంప్రదాయంగా ఉండడంతో డిజైనర్‌ బ్లౌజులొచ్చాక ఈతరం అమ్మాయిలు వేడుకల్లో చీరకట్టడం పెరిగింది కూడా. సో మొత్తమ్మీద ఒకప్పుడు ఆలయాలూ భవనాల మీద కనిపించే అందమైన కళాకృతులన్నీ ఇపుడు ఎంబ్రాయిడరీ రూపంలో అమ్మాయిల రవికల మీద తళుకులీనుతున్నాయన్నమాట.