Sports

ఐపీఎల్ ఆడొద్దంటే వినలేదు….

South African Cricket Captain Du Plessis Blames IPL For Their Loss In CWC 2019

ప్రపంచకప్‌లో సఫారీల జట్టు మరోసారి ఇంటిముఖం పట్టింది. కప్పు గెలవాలన్న ఆశ ఆ జట్టుకి కలగానే మిగిలిపోయింది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన కీలక పోరులో దక్షిణాఫ్రికా 49 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీంతో ఎనిమిదోసారి మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదిలా ఉండగా ఆ జట్టు ఓటమికి ఐపీఎల్‌ పరోక్ష కారణమని సఫారీల సారథి ఫా డు ప్లెసిస్‌ ఆరోపించాడు. ప్రపంచకప్‌లో ఈ వైఫల్యానికి రబాడ ప్రదర్శనే దారితీసిందా అని ప్రశ్నించగా ఆయన వివరణ ఇచ్చాడు. మరోవైపు ఈ ఏడాది ప్రారంభం నుంచి రబాడ మొత్తం 303 ఓవర్లపాటు బౌలింగ్‌ వేశాడు. ఇక ఐపీఎల్‌లో ఏకంగా 47 ఓవర్లపాటు బౌలింగ్‌ చేశాడు. దీనిపై స్పందించిన డు ప్లెసిస్‌.. ప్రపంచకప్‌ ముందు ఐపీఎల్‌లో ఆడకుండా తగిన విశ్రాంతి తీసుకోమని రబాడాకు చెప్పామని, అయినా అతడు దిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఐపీఎల్‌ ఆడాడని తెలిపాడు. ఐపీఎల్‌ ప్రారంభమయ్యాక కూడా మధ్యలో వచ్చేయమని కోరినట్లు పేర్కొన్నాడు. అయినా రబాడ వినకుండా ఏప్రిల్‌ చివరి వరకూ ఆడాడని చెప్పాడు. అక్కడ ఆడడం ముఖ్యం కాదని.. ప్రధాన ఆటగాళ్లకు సరైన విశ్రాంతి అవసరమని సఫారీల సారథి వివరించాడు. అయితే ప్రపంచకప్‌లో రబాడ ప్రదర్శనకు ఐపీఎల్‌ని కారణం అనే అంశాన్ని విస్మరించలేమని.. తన స్థాయికి తగ్గ ప్రదర్శన చెయ్యలేదని పేర్కొన్నాడు. రబాడా కెరీర్‌లో ఈ ప్రపంచకప్‌ ఓ మాయని మచ్చగా మిగిలిపోతుందని డుప్లెసిస్‌ తీవ్రంగా వ్యాఖ్యానించాడు.