Devotional

భద్రాద్రి లడ్డూలతో భారీ ఆదాయం

Bhadrachalam Temple Sees Huge Profits From Laddus Sale

రామాలయంలో ప్రసాదాల తయారీతో లాభాలు
దిట్టంలో అనూహ్య మార్పులు
భద్రాద్రిలో రూ.కోట్లలో వార్షిక లావాదేవీలు
*** లడ్డూ ప్రసాదం భద్రాద్రి రామాలయానికి ఆదాయం తెచ్చిపెడుతోంది. తయారీకి పెట్టే ఖర్చులు పోను కొంత మిగులుతుండటంతో ఈ విభాగాన్ని విస్తరిస్తున్నారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సూచనలతో ఆ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని పెద్ద ఆలయాల్లో కొత్తగా బెల్లం ప్రసాదాలను విక్రయించేందుకు ఆయా కార్యనిర్వాహణ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఈ దిశగా విక్రయాలు ప్రారంభించి లాభాలు గడించేందుకు వ్యూహాలను రచిస్తున్నారు. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఇప్పటికే ఉన్న పంచదార ప్రసాదాలకు తోడు కొత్తగా బెల్లం ప్రసాదాలకు అవసరమైన వంటకాలు చేస్తున్నారు. ఈ విభాగం ఏటా రూ.కోట్లలో లావాదేవీలను సాగిస్తోంది. భవిష్యత్తులో ఇది ఇంకా పెరిగే వీలుంది. ఆలయానికి ఏటేటా భక్తుల తాకిడి పెరగడంతోపాటు ప్రసాదాల విక్రయాలు పెరుగుతున్నాయి. ప్రసాదాల విభాగంలో 2016-17లో రూ.6.68 కోట్ల ఆదాయం రాగా 2017-18లో రూ.7.84 కోట్లకు చేరింది. 2018-19లో రూ.8 కోట్లు దాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం ఇంకా పెరిగే అవకాశాలున్నాయని నిర్వాహకులు భావిస్తున్నారు.
*** అంతా కట్టు దిట్టం..
ప్రసాదాల తయారీకి వాడే సరకుల జాబితాను దేవాదాయశాఖ ‘దిట్టం’ అనే పదంతో పిలుస్తుంది. ఇది కట్టుదిట్టంగా ఉంటేనే నష్టాలను అధిగమించి లాభాల బాట పట్టవచ్చని అంచనా వేస్తూ మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఏ మార్పు చేయాలన్నా ఈ ప్రతిపాదనలను పరిశీలించి రాష్ట్రస్థాయిలోని ఉన్నతాధికారులు ఆమోదించాల్సిందే. శనగ పిండి, పంచదార, నెయ్యి, జీడిపప్పు, ఎండుద్రాక్ష, యాలకులు, కలకండ క్రిస్టల్‌, పచ్చ కర్పూరం, జాజికాయ, వంట సోడాను నిర్ణీత పరిమాణంలో కేటాయించి మొత్తంగా 10 కిలోల సరకులు కేటాయిస్తారు.
*** కల్యాణలడ్డూ
వీటి విక్రయం (అర కిలో) లాభసాటిగా సాగుతోంది. 10 కిలోల సరకుల దిట్టానికి రూ.100 విలువైన 84 లడ్డూలను తయారు చేయగా దీనికి రూ.6,407.41 ఖర్చు అవుతుంది. వీటిని విక్రయిస్తే రూ.8,400 ఆదాయం వస్తుంది. ఖర్చులు పోను రూ.1,992.59 లాభం వస్తుంది. ప్రతీ 500 గ్రాముల లడ్డూ విక్రయంపై రామాలయానికి రూ.23.72 ఆదాయం సమకూరుతుంది.
*** పులిహోరా
దీన్ని తయారు చేయడానికి అవసరమైన సరకులు ఒక కిలో ఇస్తారు. దీన్ని పులిహోర దిట్టం అంటారు. ఈ దిట్టంతో 200 గ్రాముల బరువున్న 19 పొట్లాలు తయారు చేస్తారు. దీనికి రూ.153.56 ఖర్చు అవుతుంది. ప్రతీ పులిహోర ప్యాకెట్‌ ధర రూ.10. వీటిని విక్రయించగా రూ.190 ఆదాయం వస్తుంది. ఖర్చులు పోను రూ.36.44 లాభం వస్తుంది. ప్రతీ పొట్లంపై రూ.1.92 లాభం వస్తుంది.గ్యాస్‌ వాడకంతోపాటు కార్మికుల కూలీ ఖర్చుని కలుపుతారు. గుత్తేదారు తరఫున కూలీలు చేసే ప్యాకింగ్‌ ప్రక్రియ ఇందులో భాగంగా ఉంటుంది. మొత్తంగా దీన్ని పంచదార లడ్డూ దిట్టం అని పిలుస్తారు. ఈ దిట్టంతో 100 గ్రాముల బరువు ఉన్న 400 లడ్డూలను తయారు చేయాల్సి ఉంటుంది. దీనికోసం రూ.5,805.10 ఖర్చు అవుతుంది. ప్రతీ లడ్డూ ధర రూ.20. ఇలా 400 లడ్డూలను విక్రయించగా రూ.8 వేల ఆదాయం వస్తుంది. ఖర్చులు పోను రూ.2,194.90 లాభం మిగులుతుంది. అంటే ఒక్క లడ్డూ మీద రామాలయానికి వచ్చే లాభం రూ.5.49.
*** చక్కెర పొంగలి
దీన్ని తయారు చేసేందుకు అవసరమైన సరకులు కిలో ఇస్తే 33 పొట్లాలు తయారు చేస్తారు. దీనికి రూ.347.75 ఖర్చు అవుతుంది. 150 గ్రాముల పొట్లం ధర రూ.10. వీటిని విక్రయిస్తే రూ.330 వస్తుంది. ఇందులో నష్టం రూ.17.75. ప్రతీ పొట్లం మీద ఇది 54 పైసల నష్టాన్ని తెస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ ప్రసాదంలో మార్పులు చేశారు. ధర పెంచాలంటే ఉన్నతాధికారుల అనుమతితోపాటు భక్తుల నుంచి అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకొచ్చిన తలనొప్పి అని భావించిన అధికారులు ప్రసాదం విక్రయించే ధరను ఏమాత్రం మార్చకుండా పరిమాణాన్ని 150 గ్రాముల నుంచి 100 గ్రాములకు తగ్గించారు. ఈ పరిస్థితి వల్ల నష్టాలు రావు. ఎంతోకాలంగా చక్కెర పొంగలి నష్టాల్లో నడుస్తుండగా తాజా నిర్ణయంతో ఇది సైతం లాభాల బాట పట్టింది. ప్రతీ పొట్లంపై ఎంత లాభం వస్తుందనే లెక్కలు కడుతున్నారు.
*** బెల్లం ప్రసాదాలపై దృష్టి
కొత్తగా ఇక్కడ మూడు రకాల బెల్లం ప్రసాదాలను తయారు చేస్తున్నారు. వీటిలో లాభ నష్టాలను బేరీజు వేసుకుని అవసరమైన విధంగా దిట్టం మార్చుతున్నారు. ప్రసాదాల ద్వారా నష్టాలు రాకుండా ఉండాలన్నదే ప్రధాన ధ్యేయంగా కనిపిస్తోంది. బెల్లం పొంగలి 100 గ్రాములు రూ.10కి విక్రయిస్తుండగా ప్రతీ పొట్లం మీద 51 పైసల లాభం ఆర్జిస్తున్నారు. 100 గ్రాముల రవ్వ కేసరిని రూ.10కి విక్రయిస్తుండగా ప్రతీ ప్యాకెట్‌పై రూ.1.33 నష్టం వస్తోంది. దాదాపు 40 రోజులపాటు 100 గ్రాముల బెల్లం లడ్డూని రూ.20కి విక్రయించగా దీనిపై నష్టం వస్తుందని ఒక అంచనా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఒకే ధర ఒకే పరిమాణం ఉండేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ఇక నుంచి 80 గ్రాముల బెల్లం లడ్డూ ధర రూ.25 అయింది. దీనివల్ల లాభం బాగానే ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పుడున్న ఆరు రకాల ప్రసాదాలలో కొత్తగా ప్రవేశ పెట్టిన రవ్వ కేసరి ఒక్కటే స్వల్పంగా నష్టం తెస్తుంది. దీన్ని కూడా రానున్న కాలంలో ధర పెంచకుండా కొంత పరిమాణం తగ్గిస్తారా? అనే కోణంలో చర్చలు సాగుతున్నాయి. ఆస్థాన గుత్తేదారులుగా గుర్తింపు పొందిన ఇద్దరు వ్యక్తులు ఇటీవల ప్రసాదాల తయారీ కోసం టెండర్లను దాఖలు చేయగా ఇందులో ఒక్కరికి టెండర్‌ ఖరారు కానుందని తెలిసింది. ప్రసాదాల విభాగాన్ని ఆర్థికాంశంగా మాత్రమే చూస్తే భక్తుల నుంచి వ్యతిరేకత వచ్చే వీలుంది. తయారీలో నాణ్యతతోపాటు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది.