WorldWonders

భారతీయుల నల్లధనం విలువ ₹34,00,000 కోట్లు

Indian Black Money Abroad Is 34lakh Crore INR

తాజాగా సాక్షాత్తూ పార్లమెంటరీ స్థాయీ సంఘం పేర్కొన్న అంచనా ప్రకారం.. రూ15,00,000 కోట్ల నుంచి రూ.34,00,000 కోట్లు!! అంటే ఎంతో తెలుసా?

ఇది మన దేశ వార్షిక బడ్జెట్ (రూ.27,84,200 కోట్లు) కన్నా చాలా ఎక్కువ! ఇక విదేశాల్లో ఉన్న ఈ మొత్తంతో పోలవరం వంటి భారీ ప్రాజెక్టులు కనీసం 30, కాళేశ్వరం వంటివైతే 19 కట్టొచ్చు.
పోలవరం ప్రాజెక్టు వ్యయ అంచనా: రూ.55,548 కోట్లు
కాళేశ్వరం అంచనా: రూ.80,499 కోట్లు!!

మన దేశం నుంచి తరలివెళ్లిన నల్లధనంపై విస్తుగొల్పే వివరాలు వెలుగులోకి వచ్చాయి. రూ.లక్షల కోట్లు మన తీరాలను దాటి వెళ్లాయని వెల్లడయింది. భారతీయులు 1980 నుంచి 2010 మధ్య వివిధ సమయాల్లో విదేశాల్లో దాచిన అక్రమ సంపద దాదాపు 216.48 బిలియన్ డాలర్ల నుంచి 490 బిలియన్ డాలర్ల వరకు (ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే సుమారు రూ.15లక్షల కోట్ల నుంచి రూ.34 లక్షల కోట్ల వరకు) ఉందని అగ్రశ్రేణి సంస్థలైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ ఫైనాన్స్ (ఎన్ఐపీఎఫ్పీ), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసర్చ్ (ఎన్సీఏఈఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ (ఎన్ఐఎఫ్ఎం) నిర్వహించిన మూడు వేర్వేరు అధ్యయనాల్లో తేలింది. సోమవారం ఆర్థిక వ్యవహారాల స్థాయీ సంఘం ఈ వివరాలతో ఒక నివేదికను లోక్సభ ముందు ఉంచింది. ప్రధానంగా రియల్ ఎస్టేట్, గనులు, ఔషధాలు, పాన్ మసాలా, గుట్కా, పొగాకు, బంగారం, కమోడిటీలు, సినిమాలు, విద్యా రంగాలలో ఇలా లెక్కల్లోకి రాని ఆదాయం ఉన్నట్లు అధ్యయనాలు పేర్కొన్నాయి.అయితే నల్లధనం ఎక్కడి నుంచి వస్తోంది, ఎక్కడ పోగుపడుతోందన్న విషయమై కచ్చితమైన అంచనాలు లేవని, అలాంటి అంచనాలు వేయడానికి కచ్చితమైన, ఆమోదయోగ్యమైన పద్ధతి కూడా లేదని ‘దేశం లోపల, వెలుపల లెక్కల్లోకి రాని ఆదాయం/ఆస్తుల పరిస్థితి- ఓ శాస్త్రీయ విశ్లేషణ’ అనే పేరుతో రూపొందించిన నివేదికలో స్థాయీ సంఘం పేర్కొంది. అంచనాలన్నీ పలు సర్దుబాట్లను పరిగణనలోకి తీసుకొని ఊహల ఆధారంగానే రూపొందించారని వివరించింది. ఇందుకు ఉపయోగించాల్సిన అత్యుత్తమ పద్ధతి లేదా విధానంపై ఏకరూపత, ఏకాభిప్రాయం రాలేదని తెలిపింది. నల్లధనంపై వివిధ సంస్థలు వేరువేరుగా కట్టిన అంచనాల వివరాలు ఈ నివేదికలో ఉన్నాయి.ఎన్సీఏఈఆర్ విశ్లేషణ: 1980-2010 మధ్య విదేశాల్లో మూలుగుతున్న భారతీయుల అక్రమ సంపద రూ.26.65 లక్షల కోట్ల నుంచి రూ.34 లక్షల కోట్ల వరకు ఉండొచ్చు. ప్రస్తుత విలువల ప్రకారం చూస్తే 1990-2008 మధ్య అక్రమంగా దేశం వెలుపలకు తరలిన నల్లధనం సుమారు రూ.15 లక్షల కోట్లు. లెక్కల్లోకి రాని ఆదాయంలో దేశం వెలుపలకు వెళ్తున్న అక్రమాదాయం సుమారు 10 శాతం ఉండొచ్చు. 1997 నుంచి 2009 మధ్య కాలంలో అక్రమంగా దేశం వెలుపలకు వెళ్లిన సొమ్ము స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 0.2 శాతం నుంచి 7.4 శాతం. దేశం లోపల, వెలుపల ఉన్న అక్రమ ఆదాయంపై విశ్వసనీయ అంచనాలు కట్టడం చాలా కష్టసాధ్యమని స్థాయీ సంఘం నివేదిక తెలిపింది. ఈ మూడు సంస్థలు వేసిన లెక్కల్లో తీవ్ర వైరుద్ధ్యమున్న అంచనాలు రావడమే ఇందుకు నిదర్శనమని వివరించింది. ఆ సంస్థలిచ్చిన మూడు నివేదికలను కలగలపడం ద్వారా ఒక అంచనాను ఖరారు చేయడానికి ఆస్కారం లేదని ముఖ్య ఆర్థిక సలహాదారు అభిప్రాయపడినట్లు పేర్కొంది. కొందరు సాక్షులనూ విచారించాల్సి ఉందని తెలిపింది. ఈలోగా దేశం లోపల, వెలుపల ఉన్న నల్లధనం/ సంపదను వెలికి తీయడానికి కేంద్ర ఆర్థిక శాఖ తీవ్రంగా కృషి చేయాలని కోరింది. నల్లధనంపై ఏర్పడ్డ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇచ్చిన ఏడు నివేదికలపైన, తాజా మూడు నివేదికలపైన తదనంతర చర్యలు తీసుకోవాలని సూచించింది. దేశంలోని ప్రత్యక్ష పన్నుల చట్టాన్ని సరళీకరించి, హేతుబద్ధీకరించే ఉద్దేశంతో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రత్యక్ష పన్నుకోడ్ను సాధ్యమైనంత త్వరగా ఖరారు చేసి, పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కోరింది.ఈ స్థాయీ సంఘానికి ఎం.వీరప్ప మొయిలీ అధ్యక్షత వహించారు. ఈ ఏడాది మార్చి 28న స్థాయీ సంఘం లోక్సభ స్పీకర్కు తన నివేదికను సమర్పించింది. దేశం లోపల, వెలుపల లెక్కల్లోకి రాకుండా పోతున్న ఆదాయం, సంపద ఎంతో లెక్కించాలని 2011 సంవత్సరంలో ఈ మూడు సంస్థలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కోరింది.