Editorials

ఇరాన్‌పై దెబ్బ చైనాకు తగులుతోంది

Trump targetting iran to make china bleed

ట్రంప్‌ అధ్యక్షుడు కాకాముందు వ్యాపారం చేసేవారు.. ఆయనో పేద్ద బిజినెస్‌ టైకూన్‌. అధ్యక్షుడు అయ్యాక కూడా ఆయనకు వ్యాపారం చేసే అలవాటు.. బేరాలాడే బుద్ధి మారలేదు. ఆయన ఇప్పుడు ఇరాన్‌ సంక్షోభాన్ని కూడా వ్యాపారంగా మార్చేశారు.. చైనాతో వాణిజ్య యుద్ధంలో బేరం అడటానికి దీన్నో పాశుపతాస్త్రం వలే ఎక్కుపెట్టారు. తుపాకీ ఇరాన్‌కు గురిపెట్టినా తూటా మాత్రం చైనాకు తగలాలని భావిస్తున్నారు. తన మనసులో మాటను ట్విటర్‌లో బయటపెట్టారు. ‘‘చైనా 91శాతం , జపాన్‌ 62శాతం చమురు ట్యాంకర్లు హర్మూజ్‌ జలసంధి నుంచే వెళుతున్నాయి. అలాంటప్పుడు ఇతర దేశాల కోసం ఈ జలసంధిలోని నౌకామార్గాలను మేము ఫ్రీగా ఎందుకు కాపాడాలి? నిత్యం ప్రమాదకరంగా ఉండే ఈ మార్గంలో ఆ దేశాలే వారి నౌకలను రక్షించుకోవాలి. అసలే ఇది ప్రమాదకరమైన ప్రయాణం. ఇక్కడ ఉండాల్సిన అవసరం మాకైతే లేదు. అసలు ప్రపంచంలో అత్యధిక ఇంధనాన్ని మేమే ఉత్పత్తి చేస్తున్నాం. మేము ఇరాన్‌ను సింపుల్‌గా కోరేదేంటంటే..? అణ్వాయుధాలు వద్దు.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించొద్దు..!’’ అని ట్రంప్‌ సోమవారం ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌తో ట్రంప్‌ వ్యూహం చైనాకు అర్థమైపోయింది. ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా చమురు ఆక్సిజన్‌ వంటిది. చమురు సరఫరాలో సమస్యలొస్తే ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. ఇప్పుడు ఇరాన్‌-అమెరికా మధ్య యుద్ధం మొదలైతే రక్తమోడేదీ మాత్రం అత్యధిక చమురు దిగుమతిదారైన చైనానే. వాణిజ్య యుద్ధం పుణ్యమా అని ఇప్పటికే చైనా వృద్ధి రేటు కొన్నేళ్ల వెనక్కి పోయింది. భారత్‌తో యుద్ధం వస్తే.. మలక్కా జలసంధి వద్ద చైనాకు చమురు రవాణాను అడ్డుకొంటారనే భయంతోనే దీనికి ప్రత్యామ్నాయంగా పాక్‌లో సీపెక్‌ ప్రాజెక్టును ప్రారంభించింది. హర్మూజ్‌ నుంచి తీసుకొచ్చే చమురును పాక్‌లోని గ్వాదర్‌ పోర్టు నుంచి సీపెక్‌ మీదుగా చైనాకు తరలిస్తుంది. కానీ, ఇప్పుడు హర్మూజ్‌లోనే సంక్షోభం తలెత్తితే డ్రాగన్‌కు చమురు కొరత తప్పదు. ఈ విషయం గ్రహించిన ట్రంప్‌ ఇరాన్‌తో యుద్ధం వాకిటి వరకు వచ్చి ఆగిపోయారు. వాణిజ్య యుద్ధం ముగించేందుకు చైనాతో జరుపుతున్న చర్చలు ఇప్పటి వరకు ఒక కొలిక్కి రాలేదు. చైనా కూడా ఇక్కడ మొండిగా వ్యవహరిస్తోంది. దీంతో ఇరాన్‌తో ఘర్షణ వాతావరణాన్ని పెంచి చైనాకు చమురు సరఫరాలో చిక్కులు సృష్టిస్తానని ట్రంప్‌ పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. ఇక్కడ ఉద్రిక్తత పెరిగే కొద్దీ ట్యాంకర్లకు బీమా రేట్లు, సరఫరా వ్యయాలు భారీగా పెరిగిపోతాయి. ఇది చైనా ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టాన్ని కలిగిస్తాయి. మరోపక్క జపాన్‌ నుంచి కూడా కొంత ఆదాయం పొందేలా ఈ వ్యూహాన్ని రూపొందించారు. భారత్‌ ఇప్పటికే తమ నౌకలను రక్షించేందుకు ‘ఆపరేషన్‌ సంకల్ప్‌’ను ప్రారంభించింది. దీంతో ట్రంప్‌ భారత్‌ పేరును ప్రస్తావించలేదు. ఇరాన్‌-అమెరికా ఘర్షణ భారత్‌కు ఇంధన సరఫరాపై కూడా ప్రభావం చూపిస్తుంది. కాకపోతే మన నౌకలను రక్షించుకోవడానికి వీలుగా మనకు తగినన్ని బలగాలు అరేబియా సముద్రంలో ఉన్నాయి. ఇవే పర్షియన్‌ గల్ఫ్‌కు వెళ్లి మన ఆయిల్‌ ట్యాంకర్లను రక్షించుకొంటాయి. ఆపరేషన్‌ సంకల్ప్‌ పేరుతో ఇప్పటికే భారత్‌ ఈ పనిని మొదలుపెట్టింది. కానీ, చైనాకు ఈ ప్రాంతంలో పెద్దగా నౌకాదళం లేదు. అందుకే ఇప్పుడు ట్రంప్‌ తుపాకీ ఇరాన్‌వైపు పెట్టి చైనా వైపు చూస్తున్నారు..!