Sports

క్రిస్ గేల్ గుడ్‌బై

Chris Gayle To Bid Good Bye After Match With India

వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్ క్రిస్‌ గేల్ రిటైర్మెంట్‌పై తన నిర్ణయాన్ని ప్రకటించారు. స్వదేశంలో ఆగస్టు-సెప్టెంబరులో భారత దేశంతో జరిగే వన్డే, టెస్ట్ సిరీస్‌ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించారు. ఈ 39 ఏళ్ల క్రికెటర్ కొద్ది రోజుల క్రితం ప్రపంచ కప్ అనంతరం తాను క్రికెట్ నుంచి తప్పుకోనున్నట్లు తెలిపాడు. అయితే గురువారం మాంచెస్టర్‌లో భారత్‌తో మ్యాచ్‌ ఉన్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ..తాను మనసు మార్చుకున్నట్లు తెలిపాడు. ‘ఇది ఇప్పటికీ ముగిసినట్లు కాదు. ఇంకా కొన్ని మ్యాచ్‌లు ఆడతాను. మరో సిరీస్‌ కూడా ఆడొచ్చు. ప్రపంచకప్‌ తరవాత భారత్‌తో టెస్టు, వన్డే మ్యాచ్‌లు ఆడతాను. టీ20లు ఆడే ఉద్దేశం లేదు. ఇదే ప్రపంచ కప్‌ తరవాత నా ప్రణాళిక’ అని గేల్ మీడియాకు వెల్లడించాడు. ఈ ప్రకటనను వెస్టిండీస్‌ మీడియా మేనేజర్ ఫిలిప్ స్పూనర్ ధ్రువీకరించారు. గేల్ దేశం తరఫున స్వదేశంలో భారత్‌తో ఆడే మ్యాచులే చివరివని స్పష్టం చేశారు. వెస్టిండీస్‌తో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఆగస్టు మూడు నుంచి సెప్టెంబరు మూడు వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. గేల్ ఇప్పటివరకు 103 టెస్టు మ్యాచ్‌లు ఆడగా, 42.19 సరాసరితో 7,215 పరుగులు చేశాడు. 295 వన్డే మ్యాచుల్లో 10,345 పరుగులు, 58 టీ20ల్లో 1,627 పరుగులు చేశాడు. తన ఆటతీరుతో మెప్పించి, అభిమానులతో ‘యూనివర్సల్ బాస్‌’ అని పిలిపించుకోవడంతో పాటు, ఆట గతిని మారుస్తాడన్న పేరు తెచ్చుకున్నాడు.