Editorials

వై.ఎస్.జగన్‌కు తిరుమల భక్తుల బహిరంగ లేఖ-TNI ప్రత్యేకం

Fraud And Nepotism At Peaks In Tirumala-A Request To YS Jagan

ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో పరిపాలన పూర్తిగా గాడితప్పింది. భక్తులకు సేవలందించవల్సిన అధికారులు అధికారంలో ఉన్న రాజకీయ నేతలకు మాత్రమే భజనలు చేస్తూ వారి సేవలో తరిస్తున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ భక్తులను విస్మరిస్తున్నారు.

*** గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉత్తరాదికి చెందిన ఒక ఐఏఎస్ అధికారిని కార్యనిర్వాహణాధికారిగా నియమించారు. తెలుగుజాతికే ఇది అవమానకరం. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌కు సలహాదారుగా ఉన్న అజయ్ కల్లం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ.సుబ్రహ్మణ్యం వంటి సమర్థులైన అధికారులు టిటిడీ ఈవోలుగా పనిచేశారు. తమదైన పంథాలో భక్తులకు సేవచేస్తూ తిరుమల ప్రతిష్ఠను గణనీయంగా పెంచారు. ఉత్తరాది రాష్ట్రానికి చెందిన ప్రస్తుత ఈవో పరిపాలన అడ్డగోలుగా సాగుతోంది. లడ్డూ, వడ ధరలను దొడ్డిదారిన భారీగా పెంచేశారు. గతంలో ₹70 ఉన్న పెద్ద లడ్డూ ధరను ₹200లకు పెంచారు. చిన్న లడ్డూ ధర ₹50కి పెంచారు. గతంలో ₹20 ఉన్న వడ ధరను ₹100 చేశారు. గదుల అద్దెలను సైతం గణనీయంగా పెంచారు.

*** జేఈవోగా పనిచేస్తున్న శ్రీనివాసరాజు గత తొమ్మిదేళ్ల నుండి కొండపైనే తిష్టవేశారు. ఎవరు అధికారంలో ఉంటే వారిని ప్రసన్నం చేసుకుని జేఈవో తనకు బదిలీ రాకుండా చూసుకుంటున్నారు. భక్తులకు ఆయన ఏ సమయంలోనూ దర్శనం ఇవ్వడం లేదు. తిరుమల వెంకన్న దర్శనం అవుతుంది గాని శ్రీనివాసరాజు దర్శనం మాత్రం భక్తులకు లభించడం లేదు. సామాన్య భక్తులను దర్శన సమయం 24గంటలు పడుతూ ఉండగా, అధికార పార్టీ నేతలకు మాత్రం జేఈవో దగ్గర ఉండి ఇరవై నిముషాల్లో స్వామి దర్శనం చేయిస్తున్నారు. రాష్ట్రంలో సమర్థులైన పరిపాలనా దక్షత కలిగిన సీనియర్ ఐఏఎస్ అధికారులు చాలా మంది ఉన్నారు. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈవో, జేఈవోలను తక్షణమే బదిలీ చేసి వారి స్థానంలో యోగ్యులైన ఐఏఎస్ అధికారులను నియమించాలి.

*** దేవుని సాక్షిగా దోపిడీ
తిరుమలలో అవినీతి అక్రమాలు అడ్డగోలుగా జరుగుతున్నాయి. కొంతమంది ప్రెవేట్ వ్యక్తులు, దేవాలయ సిబ్బంది భక్తుల బలహీనతను గమనించి అడ్డగోలుగా నిలువు దోపిడీ చేస్తున్నారు. ₹500 ధర పలికే వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్లు ₹5000 నుండి ₹10000 వరకు అమ్ముకుంటున్నారు. జేఈవో కార్యాలయంలో వీఐపీ దర్శనం, ఇతర సేవా టిక్కెట్ల జారీ అడ్డగోలుగా జరుగుతోంది. మంత్రి, ఎమ్మెల్యే గానీ ఫోన్ చేస్తేనే జేఈవో కార్యాలయం లోపల అనుమతి ఇస్తున్నారు. సామాన్య భక్తులను గేటు వద్దే నిలిపి వేస్తున్నారు.

*** వెంకన్నా ఇదేం దోపిడీ అన్నా?
ఉదయం సేవల సమయంలో దేవుని దర్శనం అనంతరం ప్రసాదాల కౌంటర్ వద్ద భక్తులను దేవాలయ సిబ్బంది నిలువు దోపిడీ చేస్తున్నారు. కొందరు సిబ్బంది రెండు పెద్ద లడ్డూలు, మూడు వడలున్న కవర్లను ₹1500లకు కౌంటర్ ముందే బహిరంగంగా విక్రయిస్తున్నారు. దేవాలయంలో నెలకొని ఉన్న అవినీతికి ఈ దోపిడీ ప్రత్యక్ష నిదర్శనం.

*** చంద్రబాబుకు శాపం తగిలిందా?
బ్రాహ్మణులు శాపం పెడితే అది తప్పనిసరిగా తగులుతుంది అంటారు. తరతరాల నుండి శ్రీనివాసుడి సేవలో తరిస్తున్న రమణదీక్షితులు, ఆయన కుమారులను ఆలయం నుండి బయటకు గెంటి వేశారు. ఆ కుటుంబం పెట్టిన శాపమే చంద్రబాబుకు తగిలింది ఆయన వ్యతిరేకులు అంటున్నారు. వెంటనే రమణ దీక్షితులను ఆలయంలోకి అనుమతించి ఆయనకు పూర్వ బాధ్యతలను అప్పగించాల్సిన అవసరం ఉంది.

*** కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి వైఎస్.జగన్ అవినీతిని నిర్మూలిస్తానని ప్రతిన బూనారు. అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే ఆయన బాబాయ్ సుబ్బారెడ్డిని టిటిడీ పాలకమండలి ఛైర్మన్‌గా నియమించారు. అదే విధంగా తిరుమల నుండే అవినీతి , అవకతవకల ప్రక్షాళన కార్యక్రమాన్ని జగన్ చేపట్టాలని తిరుమల సందర్శించే కోట్లాది మంది భక్తులు కోరుకుంటున్నారు.

ఇట్లు
తిరుమల భక్త బృందం.

భక్త బృందం తరపున
కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు,
ఫోన్ నంబర్: 9440231118.