Movies

అలనాటి నటీమణి విజయనిర్మల ఇకలేరు

Superstar Krishnas Wife Vijayanirmala Passes Away At 73

ప్రముఖ నటి, దర్శకురాలు, ప్రముఖ నటుడు కృష్ణ సతీమణి విజయనిర్మల(73) కన్నుమూశారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. గత కొంత కాలంగా విజయనిర్మల అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1946 ఫిబ్రవరి 20న ఆమె తమిళనాడులో స్థిరపడ్డ ఓ తెలుగు కుటుంబంలో జన్మించారు. విజయ నిర్మల అసలు పేరు నిర్మల. తనకు సినీ పరిశ్రమలో మొదటిసారి అవకాశమిచ్చిన విజయ స్టూడియోస్‌కు కృతజ్ఞతగా విజయ నిర్మలగా పేరు మార్చుకున్నారు. అంతేకాక అప్పటికే నిర్మలమ్మ పరిశ్రమలో నిలదొక్కుకొని ఉండడం కూడా ఓ కారణం. ప్రముఖ నటుడు కృష్ణకు సతీమణి అయిన విజయనిర్మల.. నటుడు నరేశ్‌కు తల్లి. నటి జయసుధకు ఈమె పిన్ని. 1950లో మత్య్సరేఖ తమిళ చిత్రం ద్వారా విజయనిర్మల తన ఏడో ఏటనే బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేశారు. పదకొండో ఏట ‘పాండురంగ మహత్యం’ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. తెలుగులో ‘రంగులరాట్నం’ చిత్రం ద్వారా కథానాయకిగా అరంగేట్రం చేశారు. అక్కడి నుంచి సుమారు 200కు పైగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిగా మెప్పించారు. అనంతరం పెళ్లి కానుక సీరియల్‌తో బుల్లితెర ప్రవేశం చేసి అలరించారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు (44) దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా ఆమె 2002లో గిన్నీస్‌ బుక్‌లో చోటు సంపాదించారు. తొలిసారి ఆమె ‘మీనా’ అనే చిత్రాన్ని 1971లో తెరకెక్కించగా.. అప్పటి నుంచి 2009 వరకూ మొత్తం 44 సినిమాలు తీశారు. దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్‌ రాబర్ట్‌ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, లంకె బిందెలు, కలెక్టర్‌ విజయ, ప్రజల మనిషి, మొగుడు పెళ్లాల దొంగాట, పుట్టింటి గౌరవం, రెండు కుటుంబాల కథ వంటి చిత్రాలకు ఆమె దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో సూపర్‌ స్టార్‌ కృష్ణ హీరోగా తెరకెక్కిన నేరము-శిక్ష చిత్రం దర్శకురాలిగా ఆమె చివరి చిత్రం.