Devotional

కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి?

What Is The Rule Of Karma

కర్మ సిద్థాంతం చాలా కఠినమైనది. అది ఎవ్వరికీ అర్థం కాదు. మహాజ్ఞానులను కూడా మోసం చేస్తుంది. “కర్మను అనుభవించాలి, నిందిస్తే ప్రయోజనం లేదు”.రమణ మహాశయులు ప్రతిదినము గంగా స్నానం కొరకు పోతుండేవాడు ఆయన వెంట కృష్ణా అను భక్తుడు పోయెడివాడు. ఒకనాడు రమణమహాశయులుగంగానదికి పోతూ ఉన్నట్టుండి,తన వెనుకనున్న కృష్ణా తో కృష్ణా ! నేనుకట్టుకున్న పంచెను కొంచెం చించు అని అన్నారు,కృష్ణా కు అర్ధం కాలేదు.వారిద్దరూ ఒకరి వెనుక ఒకరు నడుస్తూనే ఉన్నారు.ఇంతలో ఒకఇటుక వచ్చి రమణ మహాశయుల కాలి వేలుద పడినది. కాలి వేలు చితికింది. రక్తం కారుతుంది.ఆ రక్తాన్ని ఆపేందుకు రమణ మహాశయులు పంచెను చింపమన్నారని అర్థంచేసుకున్నాడు. కృష్ణా అప్పుడు గ్రహించాడు.వెంటనే రమణ మహాశయుల పంచెను చింపి, కట్టు కట్టాడు .ఆనుకోకుండా జరిగిన ఆ సంఘటను గుర్తించి,రమణ మహాశయులతో”మహారాజ్ ! ఇటుక వచ్చి మీ కాలివేలు మీదపడుతుందనే విషయము ముందే మీకు తెలుసు కదా ! మరెందుకు ఆ ఇటుక దెబ్బనుంచి తప్పుకోలేదు ? “అని ప్రశ్నించారు. అప్పుడు రమణ మహాశయులు కృష్ణతో ఆలాజరగదు కృష్ణా! పక్కకి తప్పుకొంటే,ఎప్పుడోఒకప్పుడు వడ్డీతో సహా కర్మను మళ్ళీ అనుభవించాల్సిందే.
రుణం ఎంత తొందరగాతీరిపోతే అంత మంచింది కదా ! “అని అన్నారు .కర్మ శేషాన్ని ఎవరయినా అనుభవించాలసిందే.
1. అమర్నాథ్ యాత్రికులకోసం ‘యాప్!
అమర్నాథ్ యాత్రికుల సౌకర్యార్థం ఇప్పుడు సరికొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. ‘శ్రీ అమర్నాథ్జీ యాత్ర’ పేరుతో ఉండే ఈ యాప్ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన ‘నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్’ దీనిని రూపొందించింది. ‘శ్రీ అమర్నాథ్ జీ ఆలయ బోర్డు’(ఎస్ఏఎస్బి) ప్రతినిధి ఒకరు మంగళవారం యాప్ వివరాలను వెల్లడించారు. అమర్నాథ్ ఆలయ పరిసరాల్లో ఉన్న వసతులు, వాతావరణ పరిస్థితుల తాజా సమాచారం వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చునన్నారు. జులై ఒకటోతేదీ నుంచి మొదలయ్యే అమర్నాథ్ యాత్ర ఆగస్టు 15వ తేదీన పరిసమాప్తమౌతుంది.
2. ఆధ్యాత్మిక గురువు సత్యమిత్రానంద అస్తమయం
ఆధ్యాత్మిక గురువు స్వామి సత్యమిత్రానంద గిరి మహారాజ్(87) మంగళవారం కాలధర్మం చెందారు. ‘భారత్మాత జనహిత్ ట్రస్ట్’ సారథిగా ఉన్న ఆయన చాలా కాలం నుంచీ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ట్రస్ట్ ప్రతినిధి తెలిపారు. బుధవారం హరిద్వార్లో అంతిమ సంస్కారాలు జరుగుతాయి. నిరుపేదలకు స్వామి సత్యమిత్రానంద చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు.
3. 61 అడుగుల ఖైరతాబాద్ గణనాథుడు
ఏటా నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేకత చాటే ఖైరతాబాద్ వినాయకుడు ఈ ఏడాది సరికొత్త రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 12 తలలతో ‘శ్రీద్వాదశాదిత్య మహాగణపతి’ నామంతో కొలువు దీరనున్నారు. విగ్రహ నమూనాను మంగళవారం ఖైరతాబాద్లోని వినాయక మండపం వద్ద ఉత్సవ కమిటీ ఛైర్మన్ సింగరి సుదర్శన్, శిల్పి రాజేంద్రన్ తదితరులు విడుదల చేశారు. ఏటా దివ్యజ్ఞాన సిద్ధాంతి (విఠలశర్మ) సూచనలతో విగ్రహ నమూనాతోపాటు నామకరణం చేస్తారు. ఈ ఏడాది సైతం ఆయన సూచనలతో గణనాథుడికి నామకరణం చేశామని కమిటీ సభ్యులు తెలిపారు. ఇప్పటివరకు విగ్రహం ఎత్తు 60 అడుగులే గరిష్ఠం కాగా.. ఈ సారి 61 అడుగులు ఉండనుంది.
* ‘శ్రీద్వాదశాదిత్య మహాగణపతి’ విగ్రహం వెడల్పు 28 అడుగులు.
* వినాయకుడిని తొలిసారిగా 12 తలలతో తయారుచేస్తున్నారు. కుడి, ఎడమల్లో ఐదేసి తలల్ని రూపుదిద్దడంతోపాటు ప్రధాన తల పైభాగంలోనూ మరో తలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 14 చేతులు ఉంటాయి.
* విగ్రహం పైభాగంలో 12 సర్పాలు, విగ్రహం కింది భాగం నుంచి మధ్య 20 అడుగుల ఎత్తులో ఏడు గుర్రాలు ఉంటాయి. అదే మండపంలో వినాయకుడి పక్కనే కుడివైపున మహావిష్ణువుతోపాటు ఏకాదశిదేవి విగ్రహం, ఎడమ వైపున మహాకాళితో పాటు త్రిమూర్తుల విగ్రహాలు ఉంటాయి.
* ఏటా మహాగణపతి మండపానికి రెండు వైపులా మరో రెండు మండపాలను ఏర్పాటు చేసి ఇతర విగ్రహాలను ప్రతిష్ఠించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది వినాయకుడికి కుడివైపున సిద్ధకుంజికాదేవి, ఎడమవైపున దత్తాత్రేయుల విగ్రహాలు కొలువుదీరనున్నాయి.
4. విశాఖ శారదా పీఠాధిపతులకు హైదరాబాద్లో నేడు పుష్పాభిషేకం
విశాఖ పీఠాధిపతులకు హైదరాబాద్ నెక్లెస్రోడ్డులోని జలవిహార్లో బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా పుష్పాభిషేకం జరగనుంది. శారదాపీఠ శంకరాచార్య స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి మహాస్వాముల కోసం ఆయన స్వయంగా ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కేసీఆర్ ఇటీవల విజయవాడకు వెళ్లినప్పుడు, ఆ స్వాములకు పుష్పాభిషేకం నిర్వహిస్తామని ప్రకటించారు. దీనికి అనుగుణంగా కార్యక్రమానికి వేదపండితులను, ఇతర ప్రముఖులను ఆహ్వానించారు. దీన్ని జయప్రదం చేయాలని బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, గ్రేటర్ హైదరాబాద్ నూతన అధ్యక్షుడు శేషం రఘుకిరణాచార్యులు మంగళవారం ప్రకటనలో కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో.. కేసీఆర్, జగన్లు ముఖ్యమంత్రులుగా అధికారం చేపట్టేలా రాజశ్యామల యాగం నిర్వహించిన స్వరూపానందేంద్ర, విశాఖ పీఠ ఉత్తరాధికారిగా ఇటీవలే నియమితులైన స్వాత్మానందేంద్రలకు పుష్పాభిషేకం జరుగుతుందని వారు తెలిపారు.
5. 16న శ్రీవారి ఆలయం మూసివేత
చంద్రగ్రహణం కారణంగా జులై 16వ తేదీ రాత్రి 7 నుంచి 17వ తేదీ వేకువజామున 5 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్లు తితిదే తెలిపింది. 17వ తేదీ తెల్లవారుజామున 1.31 గంటల నుంచి 4.29 గంటల వరకు చంద్రగ్రహణం పడుతుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీ. గ్రహణానంతరం ఉదయం 5 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం తర్వాత శ్రీనివాసుడిని సుప్రభాత సేవతో మేల్కొల్పుతారు. తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలను పూర్తిచేయనున్నారు. ఆణివార ఆస్థానంలో భాగంగా ఉదయం 11 తర్వాత మాత్రమే శ్రీవారి దర్శనం ప్రారంభమవుతుంది
6. శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ సూర్యకాంత్
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. న్యాయమూర్తికి తితిదే ఈవో అనిల్కుమార్ సింఘాల్, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో పండితులతో వేదాశీర్వచనం చేయించి పట్టువస్త్రంతో సత్కరించారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం బహూకరించారు.
7. తిరుమల సమాచారం ఓం నమో వేంకటేశాయ
ఈరోజు బుధ *26-06-2019* ఉదయం *5* గంటల సమయానికి.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ…… శ్రీవారి దర్శనానికి *26* కంపార్ట్ మెంట్ లలో వేచి ఉన్న భక్తులు…
శ్రీ వారి సర్వ దర్శనానికి *18* గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి *4* గంటల సమయం పడుతోంది.. నిన్న జూన్ *25* న *80,064* మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు *₹:3.71* కోట్లు.
8. శుభమస్తుతేది : 26, జూన్ 2019*
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : సౌమ్యవాసరే (బుధవారం)
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : నవమి
(ఈరోజు పూర్తిగా నవమి తిధి ఉన్నది)
నక్షత్రం : ఉత్తరాభాద్ర
(ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 37 ని॥ వరకు ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్నది తదుపరి రేవతి నక్షత్రం)
యోగము : (శోభనం ఈరోజు రాత్రి 11 గం ll 49 ని ll వరకు తదుపరి అతిగండ రేపు రాత్రి 11 గం ll 41 ని ll వరకు)
కరణం : (కౌలవ ఈరోజు తెల్లవారుఝాము 4 గం ll 16 ని ll వరకు)
(తైతుల ఈరోజు సాయంత్రం 4 గం ll 59 ని ll వరకు)
అభిజిత్ : (ఈరోజు మద్యాహ్నము 12 గం ll 19 ని ll )
వర్జ్యం : (ఈరోజు రాత్రి 6 గం॥ 40 ని॥ నుంచి ఈరోజు రాత్రి 8 గం॥ 24 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 18 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 4 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 39 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 31 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 19 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 57 ని॥ వరకు)
గుళికలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 41 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 19 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 7 గం॥ 26 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 4 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 33 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 38 ని॥ లకు
సూర్యరాశి : మిథునము
చంద్రరాశి : మీనము
9. శుభోదయం
మహానీయుని మాట” విజయం సాధించిన వ్యక్తిగా కాదు, విలువలు కలిగిన వ్యక్తిగా మారడానికి ప్రయత్నించు ”
*నేటీ మంచి మాట ” వనరులూ వసతులూ కాదు, ఎవరి విజయానికైనా ఆలోచనా విధానమే మూలం. ”
10. నేటి సుభాషితం*నిన్ను చూసి నవ్వే ప్రపంచాన్ని చూసి నవ్వగలగడమే నీ తొలి విజయం.*
నేటి సామెత *
*జానెడు ఇంట్లో మూరెడు కర్ర వున్నట్లు*తలకు మించిన భారము అన్న అర్థంలో ఈ సామెతనుపయోగిస్తారు.
11. నేటి జాతీయాలు *కళ్లు పెద్దవి కడుపు చిన్నది*ఎక్కువ ఆశ గలవాడ ఉదా: వానికి కళ్లు పెద్దవి కడుపు చిన్నది.
*కళ్లు మసక బారాయా*పొగరెక్కిందా….. ఉదా: ఏరా… కళ్లు మసక బారాయా, చూసి చూడనట్టు పోతున్నావు.
12. నేటి ఆణిముత్యం
మిత్రుండు దనకు విశ్వామిత్రము జేసినను గాని మేలనవచ్చున్‌శాత్రవుడు ముద్దగొన్ననుధాత్రిం దన కదియె కీడు తలప కుమారా!
భావం
ఓ కుమారా! లోకంలో మిత్రుడు మనకు కీడు చేసినా, దానిని మేలు చేసినట్లుగానే భావించాలి. కానీ శత్రువు మన యింట భోజనం చేసినా, మనకు అపకారమే కలుగుతుందని తెలుసుకో.
13. జూలైలో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో జూలై నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. జూలై 2న అమావాస్య సందర్భంగా ఉదయం 6.30 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగనుంది. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) పాల్గొనవచ్చు. రాత్రి 7.00 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది. జూలై 4న పున‌ర్వ‌సు న‌క్ష‌త్రాన్ని పుర‌స్క‌రించుకుని ఉద‌యం 11 గంట‌ల‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం నిర్వ‌హిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీ రామ‌చంద్ర పుష్క‌రిణి వ‌ద్ద‌కు ఊరేగింపుగా తీసుకెళ‌తారు. సాయంత్రం 6.30 గంట‌ల‌కు ఊంజ‌ల్‌సేవ నిర్వ‌హిస్తారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) పాల్గొనవచ్చు. జూలై 6, 13, 20, 27వ‌ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. భక్తులు రూ.20/- చెల్లించి మూలవర్ల అభిషేకంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 6.00 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు, అనంతరం రాత్రి 7.00 గంటలకు ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. రూ.116/- టికెట్ కొనుగోలు చేసి ఊంజ‌ల్‌సేవ‌లో పాల్గొన‌వ‌చ్చు. జూలై 16న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. రూ.50/- చెల్లించి భక్తులు ఈ సేవలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 గంట‌ల‌కు ఆస్థానం చేప‌డ‌తారు. జూలై 28 నుండి 30వ తేదీ వ‌ర‌కు శ్రీ కోదండ‌రామాల‌యంలో ప‌విత్రోత్స‌వాలు ఘ‌నంగా జ‌రుగ‌నున్నాయి.