Movies

చలాకీ చతుర్లు

Deepika Padukone Teases Photographers To Come Sit In Her Car

ఫొటోగ్రాఫర్‌లు వెంట పడుతున్నప్పుడు సినీ సెలబ్రిటీలు వీలైనంతవరకు నవ్వుముఖంతో ఉండేందుకే ప్రయత్నిస్తారు. మరీ ఇబ్బందిగా అనిపించినప్పుడే కాస్త రుసరుసలాడతారు. దీపికా పడుకోన్‌ సోమవారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయి, తన కారు సిద్ధంగా ఉన్న చోటుకు నడుచుకుంటూ వెళుతున్నంతసేపూ ఫొటోజర్నలిస్టులు తమ కెమెరాలను క్లిక్‌.. క్లిక్‌ మనిపిస్తూనే ఉన్నారు. సిల్వర్‌ కలర్‌ ప్యాంట్, వైట్‌ టీ షర్ట్‌లో ‘టక్‌’ చేసుకుని, నల్ల కళ్లద్దాలు పెట్టుకుని స్టెయిల్‌గా అడుగులు వేస్తున్న దీపిక.. వాళ్ల వైపు చూసీ చూడనట్లు, నవ్వీ నవ్వనట్లు నడుస్తూ కారు దగ్గరికి రాగానే.. కారు వైపు చేతిని చూపిస్తూ.. నవ్వు ముఖంతో ‘‘ఆజా.. బైట్ జా’’ అని అనడంతో ఫొటో జర్నలిస్టుల ముఖాలు కూడా ఫ్లాష్‌ అయ్యాయి.ఈ వీడియో గత ఇరవై నాలుగు గంటలుగా వైరల్‌ అవుతోంది. ఎక్కువ శాతం మంది దీపిక గొప్పతనాన్ని ప్రశంసిస్తుంటే.. కొంతమంది మాత్రమే ‘దీపిక.. ఫొటో జర్నలిస్టులను అవమానించారు. తన కోపాన్ని చిరునవ్వుతో వ్యక్తం చేశారని ఈజీగా తెలిసిపోతోంది. ‘ఎంతసేపని నన్ను ఫాలో అవుతారు. వచ్చి కారులో కూడా కూర్చుంటారా ఏంటీ..!’ అని అర్థంలో దీపిక అలా ‘రండి.. వచ్చి కూర్చోండి’ అన్నారు’’ అని ఆమెను విమర్శిస్తున్నారు.