Politics

రూ.400 కోట్లతో నూతన సచివాలయం

KCR Performs Bhumi Puja For New Secretariat Of Telangana

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించనున్న సచివాలయం కోసం డీ బ్లాక్ వెనుక భాగంలో పోర్టికో ఎదురుగా ఉన్న గార్డెన్‌లో భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, హోంమంత్రి మహమూద్ అలీ, హరీశ్ రావు, కేటీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఉదయం తొమ్మిది గంటలకు సచివాలయానికి చేరుకున్నారు. కొద్దిసేపు తన చాంబర్‌లో ఉండి.. అనంతరం సచివాలయ ప్రాంగణంలో కలియతిరిగారు. ఏపీ ఆధ్వర్యంలోని పలు బ్లాకులను పరిశీలించారు. అనంతరం ఎర్రమంజిల్‌లోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయం పాత భవనం దగ్గర నూతన అసెంబ్లీ భవన నిర్మాణానికి భూమిపూజ చేయడానికి వెళ్లారు. ఈ కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేటలోని ప్రగతిభవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లకు సీఎం కేసీఆర్ విందు ఇస్తారు. రూ.400 కోట్లతో నూతన సచివాలయ భవనాన్ని ఇదివరకే సీఎం కేసీఆర్ ప్రకటించారు. సచివాలయం భవన నమూనాను కూడా మీడియాకు విడుదలచేశారు. అధికారులతో సమీక్షలకు వీలుగా కాన్ఫరెన్స్ హాల్‌తోపాటు, కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ను ముఖ్యమంత్రి సచివాలయంలోనే నిర్వహించేలా నిర్మాణాలు రాబోతున్నాయి. దాదాపు ఆరు లక్షల చదరపు అడుగుల్లో నిర్మించే కొత్త సచివాలయంలో మంత్రులు, సంబంధిత శాఖల కార్యదర్శులు, సెక్షన్లు అన్నీ ఒకేచోట వచ్చేలా ఏర్పాట్లు చేయనున్నారు. కొత్త సచివాలయాన్ని చరిత్రలో నిలిచిపోయేలా, అన్ని సౌకర్యాలతో పూర్తి వాస్తు ప్రకారం నిర్మించనున్నారు. సచివాలయ కార్యాలయాలను ఎక్కడకు తరలించాలనే విషయంపై క్యాబినెట్ సబ్‌కమిటీ అన్నింటినీ పరిశీలించి, నివేదిక ఇస్తుంది. దాని ఆధారంగా తరలింపు ప్రక్రియ చేపడుతారు.