Business

PNB కుంభకోణం విదేశాల్లోని భారతీయ బ్యాంకుల్లోనూ చేశారు

PNB Scam Has Surpassed India And Extended Into Indian Banks Abroad Too

బ్యాంకింగ్‌ రంగంలో సంచలనం సృష్టించిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) కుంభకోణం గుర్తుంది కదా.. ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, ఆయన బంధువు మెహుల్‌ ఛోక్సీ తదితరులు కలిసి పీఎన్‌బీ బ్యాంకును దాదాపు రూ. 12వేల కోట్లకు మోసగించారు. అయితే ఇప్పుడు అంతకంటే పెద్ద కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్‌ బయోటెక్‌ లిమిటెడ్‌ ప్రమోటర్లయిన సందేసరా సోదరులు పలు బ్యాంకులకు రూ. 14వేల కోట్లకు పైగా కుచ్చుటోపీ పెట్టినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తాజాగా వెల్లడించింది. స్టెర్లింగ్‌ కంపెనీ, దాని ప్రమోటర్లు నితిన్‌ సందేసరా, చేతన్‌ సందేసరా, దీప్తి సందేసరా రూ. 5,393కోట్ల బ్యాంకు రుణాల మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2017లో వీరిపై ఈడీ, సీబీఐ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగుచూసినట్లు ఈడీ వర్గాల సమాచారం. భారత్‌లోని బ్యాంకుల నుంచే కాకుండా.. విదేశాల్లోని భారతీయ బ్యాంకుల బ్రాంచీల నుంచి కూడా సందేసరా గ్రూప్‌ దాదాపు రూ. 9000 కోట్ల రుణాలు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలిందట. భారతీయ బ్యాంకుల నుంచి దేశీయ, విదేశీ కరెన్సీల్లో స్టెర్లింగ్‌ రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రాబ్యాంక్‌, యూకో బ్యాంక్‌, ఎస్‌బీఐ, అలహాబాద్‌ బ్యాంక్‌, బ్యాంక్ ఆంఫ్‌ ఇండియా తదితర బ్యాంకుల కన్సోర్షియం నుంచి ఈ రుణాలు పొందినట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. తప్పుడు పత్రాలతో ఈ రుణాలు పొంది వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని దర్యాప్తులో తేలినట్లు సమాచారం. స్టెర్లింగ్‌ బయోటెక్‌ కేసులో ఇటీవల ఈడీ రూ. 9,778 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన విషయం తెలిసిందే. ఇందులో నైజీరియాలోని నాలుగు చమురు రిగ్గులు, ఓఎంఎల్‌ 143 అనే చమురుక్షేత్రం, తుల్జాభవాని, వరింద, భవ్య, బ్రహ్మణిఈటీసీ అనే పేర్లతో పనామాలో రిజిస్టరైన నాలుగు నౌకలు, సైబ్‌ఎల్‌ఎల్‌సీ పేరుతో అమెరికాలో రిజిస్టరైన ఓ విమానం, లండన్‌లోని విలాసవంతమైన ఫ్లాట్‌ ఉన్నాయి. ఈడీ జారీ చేసిన అతిపెద్ద ఆస్తుల జప్తు ఆదేశాల్లో ఇదొకటని అధికారులు తెలిపారు. ఇందులో ఎక్కువ భాగం విదేశాల్లోని ఆస్తులే ఉన్నాయి.