Devotional

జూలై 4 నుండి తెలుగు రాష్ట్రాల్లో శ్రీనివాస కళ్యాణాలు

TTD To Conduct Sreenivaasa Kalyanam In Telugu States From July 4th

టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జూలై 4 నుండి 27వ తేదీ వరకు 17 ప్రాంతాలలో శ్రీవారి కల్యాణాలు వైభవంగా నిర్వహించనున్నారు.
***తెలంగాణ రాష్ట్రం…
జూలై 4వ తేదీన మంగపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీవారి కల్యాణం జరుగనుంది. జూలై 5న భూపాలపల్లి మండల కేంద్రంలోని సింగరేణి క్రీడా మైదానంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. జూలై 6న రేగొండ మండలం కొడవతంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు. జూలై 7న ములుగు మండల కేంద్రంలోని స్థానిక శ్రీరామాలయంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది. జూలై 8న పరకాల మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. జూలై 10న జంగాన్ మండల కేంద్రంలోని పాత బీట్ బజార్లో శ్రీనివాస కల్యాణం జరుగనుంది. జూలై 11న స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల మైదానంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు. జూలై 12న ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లీకార్జున స్వామివారి ఆలయ ప్రాంగణంలో స్వామివారి కల్యాణం జరుగనుంది. జూలై 13న మహబూబాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నారు. జూలై 14న తొర్రూర్ మండల కేంద్రంలోని విజిటేబుల్ మార్కేట్ ప్రాంగణంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. జూలై 15న ఖిలా వరంగల్ రూరల్ మండలంలోని వరంగల్ కోట(పడమర)లో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.
***ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం…
జూలై 23న వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామంలోని శ్రీ రామాలయం ప్రాంగణంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు. జూలై 24న మాచర్ల మండలం ఏకోనాంపేట గ్రామంలోని శ్రీ మహలక్ష్మీ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో స్వామివారి కల్యాణం జరుగనుంది. జూలై 25న రెంటచింతల మండలం తుమ్మురుకోట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో స్వామివారి కల్యాణం జరుగనుంది. జూలై 26న గురజాల మండలం గంగవరం గ్రామంలోని కొత్త అంబాపురంలోని మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్ ప్రాంగణంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. జూలై 27న పిడుగురాళ్ళ మండలం జానపాడు గ్రామంలోని శ్రీ రామాలయం ప్రాంగణంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు. జూలై 28న వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నారు. శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి పలు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు కానున్నాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
1. చినజీయర్స్వామిని కలిసిన తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం ఉదయం శంషాబాద్ శ్రీరామనగరంలో చినజీయర్ స్వామిని కలిశారు. ఈ సందర్భంగా దివ్యసాకేతంలో పండితులు వైవీ సుబ్బారెడ్డికి శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. మైహోం గ్రూప్ సంస్థల ఛైర్మన్ జె.రామేశ్వర్రావు, ఎండీ జె.జగపతిరావులతో కలిసి దివ్యసాకేతంలో వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఇక్కడ కొనసాగుతున్న ధార్మిక సంస్థలు, అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద వైద్య సేవలు, రామానుజాచార్యుల భారీ విగ్రహం నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం సుబ్బారెడ్డికి చినజీయర్స్వామి శాలువా కప్పి తీర్థప్రసాదాలు, మంగళశాసనాలు అందజేశారు. అరగంటపాటు చినజీయర్ స్వామితో ఆయన మాట్లాడారు. తితిదే అభివృద్ధి కోసం చేపట్టాల్సిన అంశాలపై చర్చించినట్లు తెలిసింది. అనంతరం ఆయన తిరుపతికి బయలుదేరి వెళ్లినట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు.
2. జులై తొలివారంలో నామినేటెడ్ పదవుల భర్తీ!
ప్రభుత్వ నామినేటెడ్ పదవులు జులై మొదటి వారంలో భర్తీ కానున్నాయి. రెండోవారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలున్నందున మొదటి వారంలోనే కొన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయించినట్లు వైకాపా వర్గాలు చెబుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని కూడా పూర్తిస్థాయిలో నియమించాల్సి ఉంది. పాలకమండలి ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే బాధ్యతలు స్వీకరించారు. సభ్యుల నియామకానికి రెండు మూడు వారాలు పట్టే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తమ్మీద జులైలో నామినేటెడ్ పదవుల పంపకాలు కొనసాగనున్నాయి. నామినేటెడ్ పదవుల్లో 50శాతం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారికిస్తామని గతంలో జగన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ వర్గాలకు చెందిన పలువురు ఆశావహులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఏపీఐఐసీ ఛైర్పర్సన్గా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, సీఆర్డీఏ ఛైర్మన్గా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (సీఆర్డీఏ ఛైర్మన్గా ముఖ్యమంత్రి ఉంటారు. ఇతరులను ఛైర్మన్గా నియమించాలంటే సీఆర్డీఏ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది.), మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా వైకాపా అధికారి ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పేర్లు దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర గిరిజన సలహామండలి ఛైర్మన్ పదవికి ఎమ్మెల్యేలు పి.రాజన్నదొర (సాలూరు), టి.బాలరాజు (పోలవరం) పేర్లు పరిశీలనలో ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతున్నప్పటికీ స్పష్టత రాలేదు. నామినేటెడ్ పదవుల్లో ఎమ్మెల్యేలు కాకుండా ఇతర నేతలు, ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ప్రాధాన్యమిచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నదని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.