Health

కరీంనగర్‌లో రూపాయికే వైద్యపరీక్షలు

Kareemnagar Mayor Announces Health Tests For 1Rupee To Poor People

పేద ప్రజలకు భారం కలగకుండా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రూపాయికే పలు రకాల రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కరీంనగర్‌ నగర మేయర్‌ రవీందర్‌సింగ్‌ తెలిపారు. కరీంనగర్‌లో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. స్మార్ట్‌సిటీ పథకంలో భాగంగా పలు నగరాలు కొత్త విషయాలతో ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు చేపడుతున్నాయని చెప్పారు. అందులో భాగంగా నగరవాసుల కోసం కొత్త పథకాలు రూపొందించామన్నారు. ఇప్పటికే రూపాయికే అంత్యక్రియల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. తెరాస కార్యానిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ సూచనల మేరకు మరో పథకానికి ముందడుగు వేశామని చెప్పారు. రూపాయికే రక్త, మూత్ర, బీపీ, షుగర్‌ పరీక్షలు చేసి ఇస్తామని వెల్లడించారు. ఇందుకోసం ప్రయోగశాల, పరికరాల కొనుగోలుకు స్థాయీ సంఘం సమావేశంలో రూ.25లక్షల మంజూరుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. నగరపాలికలో ఆరోగ్య కేంద్రం, ఆరోగ్య అధికారి నియామకం అయిన వెంటనే దీన్ని అమల్లోకి తీసుకొస్తామన్నారు. పేదల కోసం బూట్‌ హౌజ్‌ (చెప్పుల కేంద్రం) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పనికి రాని చెప్పులను ఆ కేంద్రంలో ఇస్తే వాటిని పేదలకు అందజేస్తారని చెప్పారు.