Business

ఇజ్రాయీలీ మద్యం సీసాలపైకి ఎక్కిన మహాత్ముడు

Mahatma Gandhi Images On Alcoholic Beverages In Israel

ఇజ్రాయెల్‌కు చెందిన ఓ కంపెనీ మద్యం సీసాలపై జాతిపిత మహాత్మాగాంధీ చిత్రాన్ని ముద్రించి విక్రయిస్తున్నారని దాఖలైన ఫిర్యాదు ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ మేరకు కేరళలోని పాలెం కేంద్రంగా పనిచేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ సంస్థ ఛైర్మన్‌ ఎబీ జే జోస్‌ ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుకు లేఖ రాశారు. ఇజ్రాయెల్‌కు చెందిన మకా బ్రూవరీ అనే మద్యం కంపెనీ బీరు సీసాలపై ప్రముఖుల బొమ్మలను ముద్రిస్తోందని, అందులో భాగంగా భారత జాతిపిత మహాత్మా గాంధీ చిత్రాన్ని కూడా ముద్రించారని లేఖలో పేర్కొన్నారు. దీన్ని తీవ్ర తప్పిదంగా పేర్కొన్న జోస్‌.. గాంధీ చిత్రాన్ని అమిత్ శిమోనీ అనే వ్యక్తి రూపొందించినట్లు తెలిపారు. కూలింగ్ గ్లాస్‌, టీ షర్ట్‌, దానిపై ఓవర్‌కోట్‌ ధరించినట్లు ఉన్న గాంధీ చిత్రాన్ని అమిత్ రూపొందించారని జోస్‌ పేర్కొన్నారు. ఈ చిత్రాల్ని హిప్‌స్టోరీఆర్ట్‌.కామ్‌ అనే వెబసైట్‌లోనూ వివిధ రూపాల్లో విక్రయిస్తున్నట్లు లేఖలో తెలిపారు. వెంటనే మద్యం సీసాలు, వెబ్‌సైట్ల నుంచి ఈ చిత్రాల్ని తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మకా బ్రూవరీ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని నెతన్యాహును అభ్యర్థించారు. మద్యం, మాంసం వినియోగాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన గాంధీ చిత్రాన్ని ఇలా వాడడం నిజంగా విచారకరమని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.