Movies

సినీరంగానికి టాటా

Zaira Wasim Bids Farewell To Movies via Instagram

జాతీయ అవార్డు గ్రహీత, దంగల్‌ ఫేమ్‌ జైరా వసీమ్‌ ఇకపై సినిమాల్లో నటించనని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆదివారం వెల్లడించారు. తనకు వచ్చే పాత్రల ద్వారా మా మతవిశ్వాసాన్ని కోల్పోతున్నాని, అందుకే ఇకపై సినిమాల్లో నటించనని స్పష్టం చేశారు. ‘నేను బాలీవుడ్‌లో అడుగుపెట్టి 5 సంవత్సరాలయింది. దంగల్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాకు అనతికాలంలోనే బాలీవుడ్‌లో మంచి పేరు ప్రఖ్యాతలు లభించాయి. సినిమాల్లో నేను పోషించే పాత్రల ద్వారా ఇప్పటి యువతకు ఒక రోల్‌మోడల్‌గా నిలవాలని అనుకున్నాను. అయితే ఈ ఐదేళ్లలో కెరీర్‌ పరంగా సంతృప్తిగా ఉన్నా, నిజ జీవితంలో మాత్రం సంతోషంగా లేను. నాకు వస్తున్న పాత్రల ద్వారా ఎక్కడ నేను మత విశ్వాసాన్ని కోల్పోతానేమోనని భయంగా ఉంది. నిత్యం ఖురాన్‌ను పఠిస్తున్న నాకు జీవితం ముగిసిపోయేలోగా సమాజానికి నావంతుగా ఏదైనా మంచి చేయాలని గట్టిగా సంకల్పించుకున్నాను. సినిమా ఫీల్డ్‌లో ఉంటూ నాకున్న భాద్యతలను సక్రమంగా నిర్వర్తించలేనని, అందుకే సినిమాలను వదిలేస్తున్నాన’ని జైరా వసీమ్‌ పేర్కొన్నారు. 2016లో విడుదలైన దంగల్‌ సినిమాతో బాలీవుడ్‌ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు జైరా వసీమ్‌. మొదటి సినిమాతోనే ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. 2017లో సీక్రెట్‌ సూపర్‌ స్టార్ సినిమాలో నటించి మరో ఘన విజయాన్ని దక్కించుకున్నారు. ప్రెసిడెంట్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ఉత్తమ చైల్డ్‌ ఆర్టిస్టు అవార్డును తీసుకున్నారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా, ఫర్హాన్‌ అక్తర్‌ నటిస్తున్న ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే జైరా వసీమ్‌ సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.