ScienceAndTech

వేలిముద్రలు మొహం కాదు గుండె చప్పుడుతో మిమ్మల్ని గుర్తిస్తారు

Americas New Monitoring Laser Jetson Will Detect You Based On Your Heart Beat

వ్యక్తులను గుర్తించడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. బయోమెట్రిక్‌, ముఖ కవళికలు, ఐరిస్‌, డీఎన్‌ఏ .. ఇలా చాలా ఆధునిక పద్ధతులను మనం వినియోగిస్తున్నాం. ఆయా వ్యక్తుల నమూనాలు సేకరించడం లేదా ఆ పరికరాలకు దగ్గరగా ఉన్న సమయంలోనే ఇవి ఉపయోగపడతాయి. అయితే వీటన్నింటికి భిన్నంగా అమెరికా కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసింది. మనుషులు చాలా దూరంలో ఉన్నా.. వారిని తాకకుండానే గుర్తించొచ్చు. ఉగ్రవాదులు, దుష్ప్రవర్తన కలిగిన వారిని గుర్తించేందుకు ఈ ఆయుధాన్ని ఉపయోగించాలని అగ్రరాజ్యం భావిస్తోంది. అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్‌ అత్యాధునిక సాంకేతికతతో ఓ లేజర్‌ను తయారు చేసింది. ‘జెట్‌సన్‌’గా పిలిచే ఈ లేజర్‌.. 200 మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తిని చాలా స్పష్టంగా గుర్తుపడుతుంది. అదీ వారి హృదయ స్పందనల ఆధారంగా..! అమెరికా ప్రత్యేక దళాల అభ్యర్థన మేరకు పెంటగాన్‌ దీన్ని రూపొందించింది. వేలి ముద్రలు, కనుపాపలు ఒక్కొక్కరికి ప్రత్యేకంగా ఎలా ఉంటాయో.. హృదయ స్పందనలు కూడా ప్రతిమనిషికి విభిన్నంగా ఉంటాయి. ఇన్‌ఫ్రారెడ్‌ లేజర్‌ సాయంతో మనిషి హృదయ స్పందనలను అంచనా వేస్తూ ఇది వారిని గుర్తుపడుతుంది. ఈ ఆధునిక సాంకేతికత ద్వారా ముఖ కవళికల పద్ధతి కంటే అత్యంత కచ్చితత్వంతో మనిషిని గుర్తించొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖాలు చూడకుండానే మనుషులను గుర్తించడం దీని ప్రత్యేకత.