Politics

కార్యకర్తల భద్రత నా బాధ్యత

Chandrababu Says TDP Cadres Security Is His Responsibility

తెదేపా కార్యకర్తలపై వైకాపా దాడులు పెరిగిపోయాయని.. కార్యకర్తల్ని కాపాడుకునే బాధ్యత తనపై ఉందని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులకు ఏ మాత్రం స్థానంలేదని చెప్పారు. చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఆయన మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా కర్ణాటక – ఆంధ్రా సరిహద్దు వద్ద ఆయనకు తెదేపా నేతలు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం రామకుప్పం కూడలి వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘కుప్పం నియోజకవర్గంలో నన్ను గెలిపించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. గత 30 ఏళ్లుగా నా పట్ల మీ ఆప్యాయత చూస్తున్నా. ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా మీ ఇంట్లో బిడ్డగా నన్ను ఆదరించారు. నా జీవితాంతం మీకు రుణపడి ఉంటా. ఎమ్మెల్యేగా, సీఎంగా మీ గౌరవాన్ని పెంచేందుకే నేను పనిచేశా’’ అన్నారు. ‘‘రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కట్టుబట్టలతో అమరావతికి వచ్చినప్పుడు కూర్చోడానికి కూడా స్థలంలేకపోతే.. రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా పాలన అందించాం. లోటు బడ్జెట్‌ ఉన్నా సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఇబ్బంది లేకుండా చేశాం. కుప్పానికి నీళ్లు వచ్చేంతవరకు నేను ప్రయత్నం చేస్తా. ఎన్నికలయ్యాక చాలావరకు సమీక్షలు చేస్తున్నాం. ఏ కారణాల వల్ల పార్టీ ఓడింది? మనమేమైనా తప్పులు చేశామా? వాటిని ఎలా సరిదిద్దుకోవాలనే దానిపై విశ్లేషించుకుంటూ దృష్టిపెట్టాం. ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూనే మన తప్పుల్ని సరిదిద్దుకోవడం.. మరోసారి అలాంటివి జరగకుండా పార్టీపరంగా సమీక్షిస్తున్నాం. నేను కనీసం కుటుంబ సభ్యుల్ని కూడా పట్టించుకోకుండా 24గంటలూ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేశా. నీతిమంతమైన పాలనను అందించాం. మనమంతా కలిసి ఎన్టీఆర్‌ స్థాపించిన తెదేపాను నిలుపుకొనేందుకు కృషిచేయాలి. తెదేపా పేదల పార్టీ. తెలుగు జాతికోసం పెట్టిన పార్టీ. దీన్ని కాపాడుకొనేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తా. మీ అందరి సహకారం ఆశీస్సులు కావాలి’’ అని చంద్రబాబు కోరారు.