Fashion

మహిళామణులకు ఆదర్శం-మాంటిస్సోరి కోటేశ్వరమ్మ

The Inspiring Life Story Of Montessori Koteswaramma

వ్యవసాయం నుంచి విమానం వరకూ.. ఆటో డ్రైవర్‌ నుంచి అంతరిక్షయానం దాకా మహిళలు ముందున్నారు. సమాజంలో సగభాగం స్త్రీ. ఆమెకు ఆర్థిక స్వాతంత్య్రం కలిగినప్పుడే నిజమైన ఆధునిక మహిళ అవతరిస్తుందన్నారు ప్రయోక్తలు. కానీ మహిళలు గడపదాటని కాలంలోనే సాధారణ కుటుంబం నుంచి వచ్చి అత్యున్నత స్థాయికి ఎదిగిన ఉక్కుమహిళ కోటేశ్వరమ్మ. అసాధారణ వ్యక్తిత్వంతో ఎందరికో స్ఫూర్తిదాయినిగా నిలిచిన ఆమె భౌతికంగా దూరమైనా ఆస్ఫూర్తి ఎప్పటికీ పదిలమే. ప్రజాతంత్ర భావజాలంతోనూ, ఉద్యమాలతోనూ సంబంధాలు కలిగి మహనీయుల మాటలనే తన జీవితానికి బాట వేసుకొన్నారు. పలువురికి విద్యను అందించిన విద్యలవాడ విజయవాడకు చెందిన మాంటిస్సోరి కోటేశ్వరమ్మ యానమిది…
****మహిళ గడపదాటని కాలమది. సాధారణ కుటుంబాన్నుంచి వచ్చిన ఆమె.. బెజవాడలో గ్రాడ్యుయేషన్‌ చేసిన తొలి మహిళగా నిలిచారు. పీజీ చదవాలనే ఆకాంక్షను వదులుకొని, ఆరాధ్య నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్యగారిచ్చిన సలహా మేరకు బిఇడి చేశారు. తన చుట్టూ సమాజంలో ఉన్న ఛాందస భావాలు.. అజ్ఞానం.. మూఢ నమ్మకాలు.. అనాచారాలతో మహిళను బానిసగా ఉంచిన ఈ వ్యవస్థను మార్చాలనీ, సగభాగంగా ఉన్న స్త్రీలు విద్యావిజ్ఞాన వికాసాలు పొందడంలో వెనుకబడితే ఏ దేశమూ ముందుకు వెళ్లబోదని భావించారామె. అలాంటి స్త్రీలలో విద్యా విజ్ఞాన వికాసాలు కలిగించడానికి ఏదైనా విద్యాసంస్థ పెట్టాలని తలిచారు. అప్పటికే ఒకరు పెట్టి నడపలేక వదిలేసిన విద్యాసంస్థను పునరుద్ధరించి.. క్రమేపీ దానిని వివిధ సంస్థలుగా విస్తృతపరిచి, అత్యున్నత విద్యాసంస్థలుగా తీర్చిదిద్ది.. హిమాలయమంత ఉన్నత స్థితికి తీసుకువెళ్లిన దీక్షాదక్షతలుగల ధీర ఆమె. తమ సంస్థల ద్వారా ఇప్పటికి లక్ష మంది ఆడపిల్లలకు చదువు అందించి, మహిళా సాధికారతకు తన వంతు కృషి చేస్తున్నారు. పట్టుదలతో జీవితంలో ఉన్నతస్థానానికి చేరుకుని, సమాజంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు.
***సమానత్వ భావనే సముజ్వలమై
మహిళల్లో విద్యా విజ్ఞాన వికాసాలు పెంపొందించాలనే ఆశయం కేవలం బిఇడి చదవడంతోనే కోటేశ్వరమ్మలో ఏర్పడలేదు. మహిళ ఇతర పురుషులకు కనబడరాదనే సామాజిక అనాచారం పాతుకుపోయిన కాలంలో అమ్మానాన్నల ప్రోత్సాహంతో తాను చదువుకోవడమూ, ఆ రోజుల్లో విద్యార్థి, మహిళాసంఘాల్లో పనిచేయడం ద్వారా నేర్చుకున్న సమభావమే తననీ బాట పట్టించిందని అంటారు డాక్టర్‌ వి.కోటేశ్వరమ్మ. అందుకే విద్యాసంస్థ పెట్టి.. మహిళలను తమ కాళ్లపై తాము నిలబడేలా చేసి, వారి జీవన అభ్యున్నతికి తోడ్పడాలనే సంకల్పాన్ని తన కార్యాచరణతో నెరవేర్చగలిగారు.
***ఆరోజుల్లో పదమూడేళ్లకే పెళ్లిళ్లు..
కోటేశ్వరమ్మ స్వగ్రామం గోసాల. విజయవాడకు పదిమైళ్ల దూరం. ఆమె పుట్టిన సందర్భంలో ఆమె తల్లి మీనాక్షికి కాన్పు చేసిన డాక్టర్‌ ఈ పాపను బిఏ వరకూ చదివించాకే పెళ్లి చేయండి అని చెప్పారట! ఆ రోజుల్లో పది, పదమూడేళ్లకే పెళ్లిళ్లు చేయడం, అంత చిన్న వయసులో మహిళల్లో తలెత్తే శారీరక, మానసిక సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ఆ డాక్టర్‌.. ఆమె తండ్రి వెంకయ్యకు అలా చెప్పారు. ఆయన ఈడుపుగల్లు ప్రాథమినోన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయులు. కోటేశ్వరమ్మ విద్య పట్ల ప్రత్యేకశ్రద్ధ కనబరిచేవారు. అరిపిరాల సత్యనారాయణనే విద్వాంసుని వద్ద ఆమెకు సంగీతం నేర్పించారు. ఇంటి వద్దనే చదువుకుంటూ తర్వాత బెజవాడలోని బిషప్‌ హజరయ్య హైస్కూల్లో ఆమె చేరారు.
***బడికి వెళ్లడం నేరమైనట్లు…
ఆమె నివసిస్తున్న ఈడుపుగల్లు నుంచి బెజవాడకు ఒకమ్మాయి చదువుకోసం రావాలంటే ఆషామాషీ కాదు. అదో పెద్ద నేరమైనట్టు వింతగా చెప్పుకునేవారు. అలాంటి వాతావరణంలో అక్కడ నాలుగేళ్లపాటు చదివి, ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తిచేశారు. ఆ తర్వాత కాకినాడ పిఠాపురం రాజా (పిఆర్‌) కళాశాలలో ఇంటర్‌ చేరారు. పిఠాపురం రాజాకి కందుకూరి వీరేశలింగంపై అభిమానం ఉండటాన ఆ కళాశాలలో మహిళలకు సగం ఫీజు మాత్రమే ఉండేది. అక్కడ చదువుకునే రోజుల్లో రఘుపతి వెంకటరత్నం నాయుడు, రామకృష్ణయ్య, పెద్దాడ రామస్వామి వంటి ఉద్ధండులు ప్రిన్సిపాల్స్‌గా పనిచేశారు. వారంతా చారిత్రాత్మక ప్రసంగాలు చేసేవారు. నైతిక పాఠాలు చెప్పేవారు. వారి ప్రభావం ఆమెపై ఉంది.
***విద్యార్థి ఉద్యమాల్లో …
కాకినాడలో చదివే రోజుల్లోనే కళాశాలలో ఎఐఎస్‌ఎఫ్‌ మీటింగులకి ఆమె హాజరయ్యేవారు. ఏ కార్యక్రమం తీసుకున్నా పదండి అని దూకి వెళ్లిపోయేవారు. ఆ రోజుల్లోనే రామచంద్రపురంలో ఎఐఎస్‌ఎఫ్‌ మహాసభ జరిగింది. పార్వతీకృష్ణన్‌ వచ్చారు. ఆమె అప్పటికి అవివాహిత. అతిసామాన్యంగా, ఖద్దరు చీరెతో వచ్చిన ఆమెను చూసి ఇంత నిరాడంబరమా అనుకున్నారు. ఆమె ఉపన్యాసంతో ఉత్తేజభరితులయ్యారు. ఇంటరు పూర్తయ్యాక మద్రాసులోని వారణాసి కళాశాలలో ఆమెకు మెడికల్‌ సీటు వచ్చినా జాయిన్‌ కాకుండా గుంటూరు ఆంధ్రా-క్రిస్టియన్‌ (ఏసి) కళాశాలలో చేరారు. ఇక్కడా ఎఐఎస్‌ఎఫ్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
***బందరు కాలువ పనికి తట్టలు మోసి..
ఆ రోజుల్లో బెజవాడలో లక్షలాది మంది రైతులు హాజరైన కిసాన్‌ మహాసభలో ఆమె వాలంటీరుగా పనిచేశారు. జోషి ప్రసంగాన్ని సుందరయ్యగారు తెలుగులోకి అనువదించడం ఆమెలో ఉత్తేజాన్ని నింపిందని చెప్పేవారామె. బందరు కాలువ పూడికతీత పనిలో వేలాది మంది పనిచేస్తుంటే ఆమెకు మనసాగలేదు. ఆ కార్యక్రమంలో పాల్గొని, అచ్చమాంబతో కలిసి ఇద్దరూ తట్టలు మోశారు. ఇప్పుడు మొగల్‌రాజపురంగా చెప్పేచోట అప్పుడు ప్రజాశక్తి దినపత్రిక నిర్వహణకూ, పార్టీ కార్యాలయంగా అక్కడ కొన్ని పాకలు వేశారు. అక్కడ ఆమె పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, సావిత్రమ్మ వంటి నాయకులను కలిసేవారు. అచ్చమాంబ, మానికొండ సూర్యావతి తదితర మహిళాసంఘ నేతల సాహచర్యంతో ఆమె విద్యార్థిసంఘం కార్యకలాపాలతో పాటు మహిళా సంఘంలో పనిచేయడమూ ప్రారంభించారు. ఆ క్రమంలోనే 1945లో బిఏ ప్రథమ శ్రేణిలో ఆమె ఉత్తీర్ణురాలయ్యారు.
***పిజీ వద్దని బిఇడిలో చేరి …
తర్వాత లక్నోలో ఎమ్మెస్సీ చదవాలనుకున్నారామె. అయితే ఆమెని పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య ‘ఏమ్మా?’ అంటూ పలుకరించారు. ‘రాత్రి మేమంతా మీటింగేసుకుని నీ గురించే మాట్లాడుకున్నాం. నువ్వు ఎమ్మెస్సీ కన్నా బీఇడి చదివితే బాగుంటుందని అనుకున్నాం. మంచి ఉపాధ్యాయినివి అయితే మహిళలకూ, సమాజానికీ ఎంతో లాభం జరుగుతుంది. పైగా మహిళా సంఘం పక్షాన ‘వనిత’ అనే పత్రిక తేబోతున్నాం. దాన్ని నీకప్పగించాలనుకున్నాం’ అని చెప్పారు. అంతే! ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆ నాయకులపై ఉన్న అపార గౌరవంతో బిఇడి చదివేందుకు ఒప్పుకుని, అలాగే చదివారు.
**దండల పెళ్లి..
రాజమండ్రిలో బిఇడిలో చేరి1947లో ఆ కోర్సు పూర్తిచేశారామె. అదే ఏడు ఆమెకు వివి కృష్ణారావుతో గోసాలలో పెళ్లయింది. తాపీ ధర్మారావుగారి తనయుడు తాపీ మోహనరావు వారితో దండలు మార్పించి, పెళ్లి చేయించారు. బిఇడి పూర్తిచేసిన ఆమె ఓ విద్యాసంస్థ పెట్టాలని అనుకొని, గుజరాత్‌లోని సేవాగ్రాంలో గాంధీ ఆశ్రమాన్ని చూడటానికి వెళ్లారు. అక్కడ రచయిత, కవి గుడిపాటి వెంకటాచలం సోదరి ఆశ్రమ నిర్వాహకుల్లో ఒకరుగా ఉన్నారు. అక్కడి ఆశ్రమ నిర్వహణ ఆమెనెంతో ముగ్ధురాలిని చేసింది. అంతకుముందు నెల్లూరు నివాసి పొణకా కనకమ్మ మన రాష్ట్రంలో గాంధీ పర్యటించిన సందర్భంలో బంగారు గాజులు ఆయనకు సమర్పించారు. గాంధీ రాష్ట్ర పర్యటనలో తనకు ప్రజలు అందజేసిన బంగారు ఆభరణాలను ఈ కనకమ్మకి ఇచ్చి.. దీంతో మహిళల కోసం ఏదైనా చేయమని చెప్పారట! ఆమె గాంధీ సతీమణి పేరిట కస్తూరిదేవి గరల్స్‌ హైస్కూలు ఏర్పాటు చేశారు. అందులో కోటేశ్వరమ్మ ఉపాధ్యాయినిగా పనిచేశారు. అక్కడ ఏడేళ్ల పాటు అంటే 1954 వరకూ పనిచేశారు.
***మాంటిస్సోరి మొదలైందిలా…
బందరు కాలువ పక్కన ఒకరు మాంటిసోరి విద్యాసంస్థ పేరుతో స్కూలు పెట్టి, నిర్వహించలేక వదిలేశారు. దాన్ని ఆమె తీసుకొని నిర్వహించాలని భావించారు. ఆమె మూడు వేలు అప్పుచేసి, ఆ పాఠశాల నిర్వహణ చేపట్టారు. అనతికాలంలోనే పాఠశాల బాగా అభివృద్ధి చెందింది. విద్యామంత్రి పట్టాభిరామయ్య ఈ స్కూలును సందర్శించి, పాఠశాల నిర్వహణకూ, పిల్లల క్రమశిక్షణకూ, అక్కడి ప్రశాంత వాతావరణానికీి ఎంతో ముగ్ధులై, రికగ్నైజేషన్‌ ఇప్పించారు. చిన్న చిన్న షెడ్లతో మొదలైన చిల్డ్రన్సు మాంటిస్సోరి పాఠశాలలో రెండేళ్లు గడిచేసరికి 1,650 మంది పిల్లలకు పెరిగింది. ప్రజల నుంచి సేకరించిన విరాళాలతో ఓ పక్కా భవనం నిర్మాణం చేపట్టారు. ఆనాడే రూ.99 వేలు వచ్చాయి. పాఠశాల పిడబ్ల్యుడి స్థలంలో ఉంది. పాఠశాల అభివృద్ధి, మంచి ఫలితాలు చూసి మంత్రి అల్లూరి సత్యనారాయణ రాజు ఆ స్థలాన్ని మాంటిస్సోరి విద్యాసంస్థలకు ఇప్పించారు.
***లక్ష మందిపైనే విద్యార్థినులు
మాంటిస్సోరి విద్యాసంస్థలు క్రమేపీ అభివృద్ధి చెంది మహిళా కళాశాలనేగాక, మాంటిస్సోరి మహిళా పిజి కళాశాల కూడా ఏర్పాటైంది. ఈ విద్యాసంస్థల్లో నూరు శాతం ఫలితాలు తప్పనిసరి. ఈ విద్యాసంస్థల్లో నాటి నుంచి నేటి వరకూ లక్ష మందికి పైనే విద్యార్థినులు చదువుతున్నారు. వీరిలో ఎంతో మంది దేశవిదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఇప్పటికీ బయట కళాశాలల కన్నా ఈ సంస్థల్లోనే ఫీజులు చాలా తక్కువ. పేద బాలికలు, యువతులెందరికో ఉచిత విద్య అందిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థను ముఖ్యమంత్రులు సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, నాటి రాష్ట్రపతి వివి.గిరి, శాసనమండలి సభాపతి గొట్టిపాటి బ్రహ్మయ్య, ఆంధ్రా యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ బులెయ్య, ఎన్టీ రామారావు తదితరులు ఎంతోమంది సందర్శించారు. ఇంత అభివృద్ధి సాధించిన మాంటిస్సోరి విద్యాసంస్థల నిర్మాత డాక్టర్‌ వి.కోటేశ్వరమ్మ 1971లో జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డును నాటి రాష్ట్రపతి వివి గిరి నుంచి స్వీకరించారు. 1980లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందారు. ఇంకా లెక్కలేనన్ని అవార్డులూ, రివార్డులూ ఆమె పొందారు. ఆమె ‘ఇల్లు-ఇల్లాలు’ అనే మాసపత్రికను 39 ఏళ్ల పాటు నడిపారు. ఆమె మహిళాభ్యుదయంపై దాదాపు 35 పుస్తకాలు రాశారు. అనేక ప్రభుత్వ సంస్థల్లోనూ సభ్యత్వం పొందారు. కోటేశ్వరమ్మ ఇప్పుడు భౌతికంగా దూరమైనా ఆమె స్థాపించిన విద్యాసంస్థలూ, అందించిన సేవలూ కలకాలం నిలుస్తాయి. ఒకానొక తరం ఎగరేసిన ధైర్య పతాక కోటేశ్వరమ్మ. ఆమె స్ఫూర్తి ఎప్పటికీ జ్వలిస్తూనే ఉంటుంది.