Politics

భూమనకు భారీ బుజ్జగింపు

YS Jagan To Start A Three District Division And Make Bhumana The Chairman

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక పదవి కట్టబెట్టబోతున్నారని తెలుస్తోంది. మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంతో కాస్త ముభావంగా ఉంటున్న భూమన కరుణాకర్ రెడ్డిని బుజ్జగించేందుకు వైయస్ జగన్ పావులు కదుపుతున్నారు.

త్వరలో సీఎం వైయస్ జగన్ చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలిపి ఒక ప్రాంతీయ మండలిగా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతీయ మండలికి
భూమన కరుణాకర్ రెడ్డిని ఛైర్మన్‌గా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రాంతీయ మండలి చైర్మన్ లకు కేబినెట్ హోదా కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాలను ప్రాంతీయ మండళ్లుగా ఏర్పాటు చేసి వాటికి ఛైర్మన్లను నియమించేందుకు జగన్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేసి, వాటికి కేబినెట్ హోదాతో చైర్ పర్సన్స్ నియమించాలని వైయస్ జగన్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.

ప్రాంతీయ బోర్డు చైర్మన్ ల ప్రతిపాదన దాదాపు ఖరారు అయ్యిందని ఈ నేపథ్యంలో ఒక బోర్డుకు చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ఫైనలైజ్ అయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. భూమన కరుణాకర్ రెడ్డిని జగన్ తన కేబినెట్ లో తీసుకుంటారంటూ వార్తలు వచ్చాయి.

అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఆయనను బుజ్జగించేందుకు ప్రాంతీయ బోర్డు చైర్మన్ పదవి కట్టబెడుతున్నట్లు సమాచారం. వీటితోపాటు రాయలసీమకు చెందిన నాలుగు జిల్లాలకు ఒక బోర్డు, ఉత్తరాంధ్రకు చెందిన మూడు జిల్లాలకు మరో బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు కలిపి ప్రత్యేకమైన బోర్డును ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1970 దశకంలో మూడు ప్రాంతీయ బోర్డులు ఏర్పాటయ్యాయి.

తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఈ ప్రాంతీయ బోర్డులు ఏర్పాటయ్యాయి. అయితే 1983లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాంతీయ బోర్డులను రద్దు చేశారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రాంతీయబోర్డులను పునరుద్ధరించారు.

తెలంగాణ ఉద్యమం తీవ్రతరం అవుతున్న తరుణంలో రాష్ట్రంలో నాలుగు ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేశారు. తాజాగా వైయస్ జగన్ సైతం నాలుగు ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.