Editorials

ఆంధ్రా యూనివర్శిటీ విద్యార్థిని…అమెరికా వర్శిటీకి అధ్యక్షురాలు

The life story of Neeli Bendapudi and her rise to the president of University of Louisville

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకుని ఇప్పుడు అమెరికాలోని యూనివర్శిటీకి అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు నీలి బెండపూడి. ఆచార్యులుగా ఎంతో అనుభవాన్ని గడించి, రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రసిద్ధ ‘యూనివర్శిటీ ఆఫ్ లూయిస్విల్లీ’కి ఆమె అధ్యక్షురాలయ్యారు. 21వేల మంది విద్యార్థులు, వందలాది ఉద్యోగులు ఉన్న ఒక యూనివర్శిటీలో అంతటి ఉన్నత పదవిని అలంకరించిన తొలి అమెరికాయేతర వ్యక్తిగా, అలాంటి అవకాశాన్ని దక్కించుకున్న భారతీయ రెండో (దక్షిణాదిన తొలి) మహిళా ప్రొఫెసర్గా రికార్డు సాధించారామె. ***నాన్న ఆచార్య తిప్పావర్జుల రమేష్దత్తా, అమ్మ పద్మ. ఇద్దరూ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగంలో ఆచార్యులుగా పనిచేశారు. నిజానికి మాది గుంటూరు. అమ్మానాన్న ఉద్యోగరీత్యా ఏయూకు రావడంతో నేను విశాఖపట్టణంలోనే పుట్టి, పెరిగా. ఇక్కడి సెయింట్ జోసఫ్ కళాశాలలో చదివి 1985లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తిచేశా. పీహెచ్డీలో చేరిన తరువాత బెండపూడి వెంకటరమణమూర్తితో నా వివాహమైంది.
**పీహెచ్డీ కోసం అమెరికాకు…
ఏయూలో పరిశోధనను మధ్యలో విడిచిపెట్టి నేను, మా వారూ 1987లో అమెరికా వెళ్లి, యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్లో పీహెచ్డీ కోసం చేరాం. అక్ డాక్టరేట్ చేసి ‘టెక్సాస్ ఎ అండ్ ఎం యూనివర్సిటీ’లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా రెండేళ్లు పనిచేశా. తరువాత కొలంబియాలో అతిపెద్ద వర్సిటీ ‘ది ఓహయో స్టేట్ యూనివర్సిటీ’కి అసోసియేట్ ప్రొఫెసర్గా, ఆ తర్వాత పూర్తిస్థాయి ప్రొఫెసర్గా పనిచేశా.
2011 వరకు అక్కడే పనిచేసి, తిరిగి నేను పరిశోధన చేసిన కాన్సాస్ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ బిజినెస్కు డీన్, ప్రొఫెసర్ ఆఫ్ బిజినెస్గా వచ్చా. దాదాపు అయిదేళ్లు అదే హోదాలో పనిచేస్తున్న సమయంలో ఎగ్జిక్యూటివ్ వైస్ ఛాన్సలర్గా అవకాశం వచ్చింది. నా వరకు ఇది పెద్ద హోదాగా భావించి, రెండేళ్లు పనిచేశాను. మధ్యలో కొన్నాళ్లు ‘హాంటింగ్టన్ నేషనల్ బ్యాంక్’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశా. 55 బిలియన్ డాలర్ల ఆస్తులు, 12 వేల మంది ఉద్యోగులున్న బ్యాంక్ టాప్ ఎగ్జిక్యూటివ్ల్లో నేనొకర్ని.
**లూయిస్విల్లీ వర్శిటీకి ప్రెసిడెంట్గా…
200 ఏళ్ల చరిత్ర కలిగిన ‘యూనివర్శిటీ ఆఫ్ లూయిస్విల్లీ’ అమెరికాలోని పరిశోధన రంగంలో పేరున్న విద్యాసంస్థల్లో ఒకటి. అలాంటి ప్రసిద్ధ యూనివర్సిటీకి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యా. ఈ వర్సిటీకి శ్వేతేతర, అందునా ప్రవాసీయుల నుంచి ప్రెసిడెంట్గా ఎన్నికైన తొలి మహిళను నేనే. అమెరికాలోని పరిశోధన రంగంలో పేరున్న 120 విశ్వవిద్యాలయాల గ్రూప్లో మహిళా ప్రెసిడెంట్లు అరుదుగా ఉంటారు. మనదేశం వరకు చూస్తే అమెరికాలో ఒక యూనివర్సిటీ ప్రెసిడెంట్గా రేణుకటోరి అనే మహిళ పనిచేయగా నేను రెండో వ్యక్తిని. దక్షిణ భారతదేశం నుంచి నేనే తొలి మహిళను.
**అమెరికాలోని గొప్ప విద్యా సంస్థల్లో లూయిస్విల్లీ ఒకటి. నా ముందు అధ్యక్షుడు ఏవో కారణాలతో వైదొలగారు. తరువాత నాకు అవకాశం వచ్చింది. బాధ్యతలు చేపట్టిన తరువాత గతం గురించి ఆలోచన చేయకుండా భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలు, మంచి సంప్రదాయాలు, పాలన కొనసాగించాలని అడుగులు వేశాను. చిన్నచిన్న విషయాలను పట్టించుకోకుండా, మంచిని ఒడిసిపట్టుకునే ఆశావహ దృక్పథం నాది. వర్సిటీలో విద్యావ్యవస్ధ ఎంతో పటిష్ఠంగా ఉంటుంది. అయితే పాలనలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నా.సంస్కృతంలో ‘సహనావవతు… సహనాగుణవత్తు… అనే శ్లోకంలో ఉన్న పరమార్థం… విద్యాబోధనలో విద్యార్థితో కలిసి గురువు బోధన చేస్తారు. ఇరువురి మధ్య అంత అనుబంధం ఉంది. ‘కష్టపడడం…ఇష్టపడి పనిచేయడంతో ఎక్కువ శక్తి సంపాదించవచ్చు… గొప్ప గొప్ప లక్ష్యాలు సాధించవచ్చ’ని నమ్మే వ్యక్తిని నేను. అదే నా ఫిలాసఫీ. అధ్యక్షురాలిగా నేను ఎంపికైన తరువాత ప్రపంచంలో పేరున్న ఐబీఎంతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఎనిమిది అంశాలపై పరిశోధనలు చేయడానికి ఆ ఒప్పందం ద్వారా అవకాశం కలిగింది. ఐబీఎంతో కలిసి పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చింది.
***ఈ తరంపై ఒత్తిడి ఉంది…
ఇండియాలో ప్రాథమిక విద్య పునాది బలమైనది. చిన్నప్పటి నుంచి పిల్లలకు క్రమశిక్షణ, కఠోరశ్రమతో పాటు విలువలతో కూడిన విద్య అందించేవారు. ఎంతో స్వేచ్ఛగా ఉండే బాల్యం మనది. చదువుకోవాలనే చెప్పారు తప్ప ఒత్తిడి తీసుకువచ్చేవారు కాదు. దురదృష్టవశాత్తూ చదువు పేర ఈ తరం పిల్లలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇది ఎంతో బాధ కలిగిస్తోంది. అమెరికాలో ఒత్తిడి లేని చదువు లభిస్తుంది.అక్కడ డిగ్రీ, ఉన్నత విద్యకు ప్రాధాన్యం ఇస్తారు. విద్యార్థి సృజనాత్మకతకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. నాణ్యత విషయంలో అక్కడ రాజీ ఉండదు. ఇండియాలో సృజనాత్మకతకు, నాణ్యతకు తగిన ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రెండు విద్యా విధానాల్లో పాజిటివ్, నెగిటివ్ ఉన్నాయి. అయితే మనం ఎప్పుడైనా మంచిని మాత్రమే తీసుకోవాలి.
***కోర్సు ఏదైనా ఇష్టపడి చదవాలి…
తెలుగు రాష్ట్రాల్లో పిల్లల్ని ఇంజనీరింగ్/మెడిసిన్ చదవాలని తల్లిదండ్రులు గట్టిగా పట్టుబడుతున్నారు. గ్యారెంటీగా ఉద్యోగం వస్తోందని భావించి తమ పిల్లల్ని వాటిలోనే చేర్పిస్తున్నారు. అమెరికాలో లిబరల్ ఆర్ట్స్ అంటే ఆర్ట్స్, ఫిలాసఫీ, హిస్టరీ, ఇతర కోర్సులకు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. ఏ కోర్సు చదివామనేది కాదు… దాంట్లో ఎంత లోతుగా తెలుసుకున్నామన్నది ముఖ్యం. పిల్లల్లోని సృజనాత్మకతను గుర్తించి దానికి అనువైన కోర్సుల్లో మాత్రమే చేర్పించాలి.విద్యార్థులు టెక్నాలజీ రంగంలో కొత్త ఆవిష్కరణల గురించి చదవాలి. ఏ రంగంలో పనిచేద్దామని అనుకుంటే వాటినే ఎంపిక చేసుకోవాలి. అమెరికాలో ఒకప్పుడు రీడింగ్, రైడింగ్, అర్థమెటిక్ అనే నినాదం ఉండేది. ఇప్పుడది కమ్యూనికేషన్, కొలాబరేషన్, క్రిటికల్ థింకింగ్, సెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అనే నినాదంగా మారింది. అంటే ఎవరైనా మార్పును తెలుసుకుని అనుసరించాలి.
***అమెరికాలో సక్సెస్ కావాలంటే…
విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే చదువు మీద బాగా శ్రద్ధ పెట్టాలి. హైస్కూల్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఆ తర్వాత టోఫెల్, జీఆర్ఈ పరీక్షల్లో మంచి మార్కులు వస్తే అమెరికా యూనివర్సిటీల్లో స్కాలర్షిప్లు ఇస్తారు. యూనివర్సిటీలకు ర్యాంకులు ఉంటాయి. విద్యార్థులు ఆ ర్యాంకును బట్టి యూనివర్సిటీని ఎంపిక చేసుకోవాలి.
సీటు లభించిన తరువాత ఎక్కువ సమయం లైబ్రరీ, ల్యాబ్లలో గడుపుతూ సబ్జెక్టుపై పట్టు పెంచుకోవాలి. అప్పుడు ప్రొఫెసర్ వద్ద గుర్తింపు లభిస్తుంది. అలాంటప్పుడు రీసెర్చ్ లేదా క్యాంపస్ ప్లేస్మెంట్లో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. బిడియం ఉండకూడదు. చొరవ ఉండాలి. రీసెర్చ్ పేపర్స్ రాయాలి. సెమినార్స్కు వెళ్లాలి. అప్పుడే తాను వెళ్లాలనుకున్న రంగంలో ఏం జరుగుతుందో వారికి తెలుస్తుంది. అమెరికా వచ్చే వారికి నా సలహా ఏమిటంటే కొత్త విషయాలను తెలుసుకునేందుకు ధైర్యంగా ముందుకువెళ్లండి. దేనికీ భయపడకండి.
***మూలాలు మర్చిపోను…
అమ్మ, నాన్న ఇద్దరూ ఉన్నత విద్యావంతులు. చదువు, సంస్కారం, మర్యాద వంటి మంచి అలవాట్లు వారి నుంచి వచ్చాయి. సంస్కృతంలో శ్లోకాలు, పద్యాలు వారి నుంచే నేర్చుకున్నా. అమెరికాలో ఇన్నేళ్ల కెరీర్ కొనసాగించినా, ఎప్పుడూ పుట్టిన మూలాలు మర్చిపోలేదు. ‘ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా… పొగడరా నీ తల్లి భూమి భారతిని… నిలుపరా నీజాతి నిండు గౌరవాన్ని’ అన్న పద్యం నాకు ఎప్పుడూ గుర్తుంటుంది.ప్రపంచంలో ఏ మూలనున్నా, ఇక్కడి మూలాలు కొనసాగించాలని బలంగా విశ్వసిస్తా. చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అంటే ఇష్టం. తెలుగు, ఆంగ్లంలో కవితలు రాస్తుంటాను. చిన్నప్పుడు అమ్మ, నాన్నలతో కలిసి ఏయూ లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు చదువుకోవడం, విభాగానికి వెళ్లడం మర్చిపోలేని సంఘటనలు. నా భర్త వెంకటరమణమూర్తి అమెరికాలో మేనేజ్మెంట్లో పేరున్న ఆచార్యుడు. మాకు ఒక అమ్మాయి శిరీష. అక్కడి అబ్బాయినే వివాహం చేసుకుంది.
***వివక్ష అన్ని చోట్ల ఉంది…
జండర్ వివక్ష అన్నిచోట్ల ఉంది. అమెరికాలో జండర్ వివక్ష ఉండదని అప్పట్లో అనుకునేదాన్ని. కానీ అక్కడ కూడా ఉంది. అయితే ఇప్పుడిపుడే మహిళల్లో చైతన్యం పెరగడం, పురుషులతో సమానంగా పనిచేయంతో అవకాశాలు మెరుగయ్యాయి. మన దేశంలో కూడా ఉద్యోగాలు చేసే మహిళలు పెరగడం స్వాగతించాల్సిందే. అయితే వివక్షను అధిగమించి పయనించగలిగితేనే గొప్ప విజయాలు సాధించవచ్చు.
అమెరికాలోని పరిశోధన రంగంలో పేరున్న 120 విశ్వవిద్యాలయాల గ్రూప్లో మహిళా ప్రెసిడెంట్లు అరుదుగా ఉంటారు. మనదేశం వరకు చూస్తే అమెరికాలో ఒక యూనివర్సిటీ ప్రెసిడెంట్గా రేణుకటోరి అనే మహిళ పనిచేయగా నేను రెండో వ్యక్తిని. దక్షిణ భారతదేశం నుంచి నేనే తొలి మహిళను. చిన్నచిన్న విషయాలను పట్టించుకోకుండా మంచిని ఒడిసిపట్టుకునే ఆశావహ దృక్పథం నాది. వర్సిటీలో విద్యావ్యవస్ధ ఎంతో పటిష్ఠంగా ఉంటుంది. అయితే పాలనలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నా.