Movies

రాముల మధ్యలో సీత

Ali Bhatta As Sita In RRR

రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్న తాజా చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఇందులో తొలితరం స్వాతంత్య్ర సమరయోధులు కొమరంభీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటిస్తున్నారు. ఆ పోరాట యోధుల చారిత్రక ఇతివృత్తానికి కాల్పనిక అంశాల్ని జోడించి రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దానయ్య నిర్మాత. దాదాపు 400కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 40శాతం చిత్రీకరణ పూర్తయింది. హైదరాబాద్, పూణే, గుజరాత్‌లో కీలక ఘట్టాల్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన అలియాభట్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె సీత పాత్రలో కనిపించనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తదుపరి షెడ్యూల్ మరో 45రోజుల్లో అహ్మదాబాద్, పూణేలో ఆరంభంకానుందని తెలిసింది. ఈ షెడ్యూల్‌లో అలియాభట్ చిత్ర బృందంలో జాయిన్ కానుంది. రామ్‌చరణ్, అలియాభట్‌పై కీలక ఘట్టాలను తెరకెక్కించబోతున్నారు. ఇటీవలే సుదీర్ఘ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన అలియాభట్ సీత పాత్ర కోసం సిద్ధమవుతున్నదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా కోసం తెలుగులో శిక్షణ తీసుకుంటున్నది అలియాభట్. ఈ చిత్రంలో అజయ్‌దేవగణ్, సముద్రఖని ముఖ్యపాత్రల్ని పోషిస్తున్నారు. కీరవాణి సంగీతాన్నందిస్తున్నారు.